header

Butter Chicken / బటర్ చికెన్

Butter Chicken / బటర్ చికెన్
కావల్సినవి
ఎముకల్లేని చికెన్ – అరకేజీ
చిక్కని పెరుగు – పావుకప్పు
వెన్న – అరకప్పు
వెల్లుల్లి రెబ్బలు – ఆరు
అల్లం - పెద్ద ముక్క
నూనె - టేబుల్స్పూను
ఉప్పు – తగినంత
గరంమసాలా – చెంచా
టొమాటోలు – నాలుగు
యాలకులు – ఏడు
దాల్చినచెక్క – చిన్నముక్క
లవంగాలు – నాలుగు
మెంతిపొడి – చెంచా
పచ్చిమిర్చి – రెండు
జీడిపప్పు - పావుకప్పు (నానబెట్టుకుని ముద్దలా చేసుకోవాలి)
కసూరీమేథీ – చెంచా
క్రీం - పావుకప్పు
తయారు చేసే విధానం
ఓ గిన్నెలో పెరుగూ, నూనె, తగినంత ఉప్పూ, గరంమసాలా వేసి బాగా కలపాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్దలా చేసి, సగం పెరుగులో వేసేయాలి. చికెన్ ముక్కలపై ఈ పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి.. ఫ్రిజ్లో కనీసం నాలుగుగంటలు పెట్టాలి (అయితే దీన్ని ముందురోజు చేసుకుంటే కూర ఇంకా రుచిగా వస్తుంది).
సాస్ తయారు చేసుకోవాలి. టొమాటోలను మిక్సీజారులోకి తీసుకుని గుజ్జులా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెన్నను ఓ గిన్నెలోకి తీసుకుని పొయ్యిమీద పెట్టి.. యాలకులూ, లవంగాలూ, దాల్చినచెక్క వేయాలి. వెన్న కరిగాక మెంతిపొడీ, పచ్చిమిర్చి ముక్కలూ, మిగిలిన అల్లంవెల్లుల్లి ముద్ద వేసేయాలి. తరవాత టొమాటో గుజ్జు వేసి మంట తగ్గించాలి. కాసేపటికి ఇది కూరలా తయారవుతుంది. ఇందులో జీడిపప్పు ముద్దా, కప్పు నీళ్లూ పోయాలి.. తరవాత చికెన్ ముక్కలూ, కసూరీమేథీ, గరంమసాలా వేసి మంట తగ్గించాలి. చికెన్ ఉడికిందనుకున్నాక క్రీం, మరికొంచెం ఉప్పూ కలిపి దింపేయాలి.