కావలసిన పదార్థాలు
కొర్రలతో కిచిడీ చాలా ఆరోగ్యకరం. ఇందులో కూరగాయలతో పాటు మెంతికూర లేదా పాలకూర కూడా వాడుకోవచ్చు. ముందుగా కొర్రల్ని ఓసారి కడిగి కనీసం అరగంటసేపు నానబెట్టాలి. తరవాత అడుగు మందంగా ఉన్న గిన్నె లేదా ప్రెషర్ కుక్కర్‌లో కిచిడీ తయారుచేసుకోవచ్చు.
నూనెకు బదులు నెయ్యి లేదా వెన్న వేసుకుంటే రుచి బాగుంటుంది. వేడి చేసిన నేతిలో చెంచా చొప్పున జీలకర్రా, అల్లం తురుము వేసి కమ్మటివాసన వచ్చేవరకు వేయించుకోవాలి. అందులో ఏదో ఒక ఆకుకూర వేసుకోవాలి. అవి కాస్త వేగాక క్యారెట్, బీన్స్, క్యాప్సికం, బఠాణీ వేసుకుని వేయించుకోవాలి. అందులోనే తగినంత ఉప్పూ, కారం, పసుపూ, గరంమసాలా వేయాలి. కావాలనుకుంటే టొమాటో ముక్కలూ, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇందులో కడిగి నానబెట్టుకున్న కందిపప్పు లేదా పెసరపప్పూ, కొర్రలూ వేసుకోవాలి. కొర్రలతో సమానంగా పప్పూ వాడితే రుచిగా ఉంటుంది. ఈ రెండింటినీ మూడు నిమిషాలు వేయించుకుని తరవాత కప్పునకు రెండుకప్పుల చొప్పున నీళ్లు పోసి రెండు కూతలు వచ్చేవరకూ ఉడికించుకుని తీసుకుంటే చాలు.
అంతా తయాం ¹య్యాక ఇంకాస్త నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. ఏరకమైన ఆకు కూరలు వాడినా కూడా మెంతికూర కలపడం వలన కిచిడీకి సువాసన, రుచి వస్తుంది. మెంతికూర లేకపోతే కసూరీమేథీ కలపొచ్చు. అలాగే గరంమసాలా పొడికి బదులుగా తాలింపులో నాలుగు లవంగాలూ, రెండు యాలకులూ, చిన్న దాల్చినచెక్క ముక్క వేసుకోవచ్చు.
కొన్ని ప్రాంతాల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వాడతారు. అలాగే పెసరపప్పూ, కందిపప్పు కాకుండా సెనగపప్పూ వేసుకోవచ్చు. దీన్ని పిల్లలకోసం తయారుచేస్తుంటే జీడిపప్పు, పిస్తా పలుకులు కొన్ని వేస్తే బాగుంటుంది. మసాలా రుచి ఎక్కువగా ఇష్టపడేవాళ్లు చిటికెడు జీలకర్రపొడీ, ధనియాలపొడినీ కలుపుకోవచ్చు. అల్లంతోపాటూ వెల్లుల్లి రెబ్బలూ, మిరియాలు దంచి వేసుకుంటే బాగుంటుంది.
శ్రీదేవి...హొటల్ మేనేజ్ మెంట్ నిపుణురాలు సౌజన్యంతో...