పక్షులలో అందమైనవి చిలుకలు. వీటి శరీరం పచ్చటి రంగుతో, ముక్కు కొద్దిగా వంకర తిరిగి ఎర్రరంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. గింజలు వీటి ఇష్టమైన ఆహారం. ఇంకా పూలను, పండ్లను, విత్తనాలను, చిన్న చిన్న కీటకాలను తింటాయి. వీటి దవడలు బలంగా ఉంటాయి.
వీటి జాతిని బట్టి మూడున్నర అంగుళాలనుండి నలబై అంగుళాల పొడవు కూడా ఉంటాయి. బరువు తక్కువగా ఉంటాయి. 60 గ్రాముల నుండి ఒకటిన్న కిలోల దాకా ఉండవచ్చు. ఇవి గుంపులు గుంపులుగా నివసిస్తాయి. భారతదేశంలో గుళ్లలో ఎక్కువగా కనబడతాయి. భారతీయులు వీటిని రామచిలకలు అనికూడా అంటారు. ఇవి పెంపుడు పక్షులు కూడా.
ఆడ చిలుకలు ఒకసారికి రెండు నుండి ఎనిమిది వరకు గుడ్లు పెడతాయి. పెట్టిన గుడ్లు 30 రోజుల పాటు పొదగబడతాయి. తరువాత వాటి నుండి పిల్ల చిలుకలు బయటకు వస్తాయి. వీటి జాతిని బట్టి చిన్నవాటినుండి పెద్దవాటి వరకు ఉంటాయి. వీటి జీవితకాలం సుమారుగా 50 సంవత్సరాలు. అమెజాన్ చిలుకలు 70 సంవత్సరాల వరకు కూడా జీవిస్తాయి.
భారతదేశంలో చిలుకలను రామచిలుకలు అని అంటారు. దీనికి కారణం శ్రీరామచంద్రునిలాగా ఇవి ఏకపత్నీ వ్రతాన్ని పాటిస్తాయి. ఆడ చిలుక గానీ, మగచిలుకగానీ తొటిదానితో జతకట్టినపుడు జీవితాంతం జతకట్టిన చిలుకతోనే గడుపుతాయి. ఏదైనా ఒకటి చనిపోతే మిగిలిన చిలుక అలాగా ఉండి పోతుంది. వేరే చిలుకతో జతకట్టదు.