ఆవులు పెంపుడు జంతువులు. ఆడవాటిని ఆవులు అని మగవాటిని ఎద్దులు అని అంటారు. పురాతన కాలం నుండి ఆవులను అన్నిదేశాలలో పెంచుకునేవారు. ముఖ్యంగా భారతదేశంలో ఆవులను పవిత్రంగా భావిస్తారు. రాజుల కాలంలో రాజులకు అపారమైన గోసంపద ఉండేది. ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే అంత గొప్ప రాజుగా చూసేవారు. భారతదేశంలో రెండు రకాల ఆవులను చూడవచ్చు. మొదటివి దేశవాళీ (నాటురకం) ఆవులు. రెండవవి జెర్సీ ఆవులు. దేశవాళీ ఆవులకంటే జెర్సీ ఆవులు పాలు ఎక్కుగా ఇస్తాయి. అన్ని జంతువుల పాలకంటే ఆవుపాలు ఆరోగ్యం అని అంటారు.
ఆవుల ఆకారం, పరిమాణం ప్రాంతాలను బట్టి మారుతుంది. సాధారణంగా ఆవులు 300 నుండి 100 కిలోలదాకా ఉంటాయి. ఆవులు గడ్డిని తింటాయి. సునాయాసంగా గడ్డిని తినటానికి వీటి నోరు వెడల్పుగా, పళ్లు పెద్దవిగా అనుకూలంగా ఉంటాయి. ఆవులు రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం పాలు ఇస్తాయి. ఆవుల రకాలను బట్టి, ప్రాంతాలను బట్టి పాల పరిమాణం ఉంటుంది. కొన్ని ఆవులు రోజుకు 30 లీటర్ల పాలు కూడా ఇస్తాయి. నాటు ఆవులు మాత్రం పాలు తక్కువగా ఇస్తాయి. వీటి పాల నుండి వెన్న, వెన్న నుండి నెయియ, పెరుగు, మజ్జిగ లభిస్తాయి.
వీటి జీవిత కాలం 18 నుండి 22 సంవత్సరాలు. ఆవుల గర్భధారణ సమయం చాలా రోజులు కొనసాగుతుంది. షుమారు 279 నుండి 292 రోజులు ఉంటుంది. ఈ రోజుల తరువాత ఒకే ఒక దూడకు జన్మనిస్తుంది. ఈ దూడ మగది లేక ఆడది కావచ్చు.
ఆవుల ప్రధాన ఆహారం పచ్చ గడ్డి. ఇవి ఎండుగడ్డిని కూడా తింటాయి. గడ్డే కాకుండా ఆవులకు తవుడు, నువ్వుల చెక్క (నువ్వుల నుండి నూనెను తీయగా మిగిలిన పదార్ధం) వెరుశెనగ చెక్క (వేరుశెనగ గుండ్లనుండి నూనెను తీయగా మిగిలినపదార్ధం) తినిపిస్తారు.
ఎద్దులు పెంపుడు జంతువులు. ఇవి చాలా బలిష్టంగా ఉంటాయి. పూర్వకాలంలో ఎద్దులను నాగలికి కట్టి భూమిని దున్నేవారు. వీటిని చెక్కతో తయారు చేసిన బండ్లకు కట్టి బండ్ల మీద ప్రయాణం చేసేవారు. ఈ బండ్లమీదే సామానులను రవాణా కూడా చేసేవారు. ఆధునిక కాలంలో ఎద్దులకు బదులుగా ట్రాక్టర్లను వ్యవసాయానికి వాడుతున్నారు. నేటికి కొన్ని మారుమూల పల్లెలలో ఎద్దుల బండ్లను చూడవచ్చు. ఎద్దులతో పొలం దున్నటం కూడా చూడవచ్చు.
ఎద్దులు చనిపోయిన తరువాత వీటి చర్మంతో చెప్పులు, తోలు సంచులు తయారు చేస్తారు. విదేశాలలో మాంసం కోసం ప్రత్యేకంగా ఎద్దులను పెంచుతారు.
భారతదేశంలో ఒంగోలు జాతి ఎద్దులు చాలా పేరుపొందినవి. ఒంగోలు జాతి ఎద్దులను విదేశాలకు సహితం ఎగుమతి చేస్తారు. చాలా మంది ఎద్దులను ప్రేమగా పెంచుకుంటారు. పండుగ సందర్భాలలో ఎద్దులకు బండలాగు వంటి పందేలు పెడతారు.
బర్రెలు పెంపుడు జంతువులు. వీటిని కేవలం పాలకోసమే పెంచుకుంటారు. వీటిలో మగవాటిని దున్నలు అంటారు. దున్నలను వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. భూమిని దున్నటానికి, బండ్లను లాగటానికి ఉపయోగిస్తారు.
కొన్ని వర్గాలవారు వీటి మాంసం కూడా తింటారు. వీటి తోలుతో చెప్పులు, బెల్టులు, తయారు చేస్తారు. భారతదేశంలో ఉత్తరాది వారు ఎక్కువగా ఆవులను పెంచుకుంటారు. దక్షిణాదిలో మాత్రం బర్రెల పెంపకం ఎక్కువ. బర్రెపాల నుండి వెన్న, పెరుగు లభిస్తాయి.
బర్రెలు నల్లని రంగుతో బలిష్టంగా, పెద్దపళ్లతో, పెద్ద తలతో కొమ్ములతో ఉంటాయి. ఆడవాటికి మగవాటికి కూడా కొమ్ములు ఉంటాయి. వీటి జీవితకాలం 25 నుండి 30 సంవత్సరాలు. వీటి ప్రధాన ఆహారం పచ్చగడ్డి, ఎండుగడ్డి. వీటికి బలకోసం తవుడు, నువ్వుల చెక్క, వేరుశెగ చెక్క తినిపిస్తారు.
ఆధునిక కాలంలో గుర్రాల వాడకం తక్కువ గానీ పురాతన కాలంలో వీటి వాడకం ఎక్కువగా ఉండేది. దూరపు ప్రయాణాలకు గుర్రాలను, గుర్రాలతో లాగే బండ్లను ఎక్కువగా వాడేవారు. రాజులు పరిపాలించే కాలంలో ప్రత్యేకంగా గుర్రపు దళం ఉండేది. సైనికులు వీటిమీద ఎక్కి యుద్ధం చేసేవారు. 50 నుండి 60 పంవత్సరాల క్రితం దాకా గుర్రాలు ఎక్కువగా కనిపించేవి.
నేటికాలంలో గుర్రాలను కేవలం రేసులకోసం, హోదాకోసం పెంచుకుంటున్నారు.
వీటి ఆకారం నాలుగు కాళ్లు, పొడవైన మెడ, పొడవైన తలతో ఉంటాయి. వీటి పొడవు షుమారు 6 అడుగులు, బరువు 1,000 కిలోలు ఉంటాయి. వీటిని తేలికగా మచ్చిక చేసేకుని పెంచుకోవాచ్చు. వీటి ఆహారం ప్రధానంగా పచ్చగడ్టి. వీటికి బలం కోసం ఉలవలు, బార్లీకూడా తినిపిస్తారు.
ఆడ గుర్రాలు 11 నెలల గర్భధారణ తరువాత ఒకే ఒక పిల్లను కంటుంది. పిల్ల గుర్రం 3 నుండి 5 సంవత్సరాలలోపు పూర్తిగా ఎదుగుతుంది. వీటి జివితకాలం 25 నుండి 30 సంవత్సరాలు.
గొర్రెలను మానవులు పురాతన కాలం నుండి తమ అవసరాల కోసం పెంచుకుంటున్నారు. ఇవి ఆహారాన్ని నెమరు వేసే జంతువులు. అనగా ఆహారాన్ని నెమ్మదిగా నములుతూ తింటాయి. వీటికి కొమ్మలు ఉంటాయి. నాలుగు అడుగుల పొడవు ఉంటాయి. మగ గొర్రెలు 100 కిలోల దాకా బరువు ఉంటాయి. ఆడవి కొంచెం తక్కువ బరువు ఉంటాయి.
వీటిని ఎక్కువగా మాంసం కోసం పెంచుకుంటారు. కొన్ని జాతుల గొర్రెల వెంట్రుకలతో మనం కప్పుకునే కంబళ్లు(దుప్పట్లు) తయారు చేస్తారు.
ఇవి శాఖాహారులు. ఎక్కువగా గడ్డిని, చెట్ల ఆకులను, గింజలను తింటాయి. వీటిలో ఆడవి ఐదు నెలలు గర్భం ధరించిన తరువాత ఒకటి నుండి రెండు పిల్లలను కంటుంది. షుమారు ఐదు సంవత్సరాలు పెరిగిన తరువాత ఇవి సంతాన సామర్ధ్యం పొందుతాయి. వీటి జీవిత కాలం 10 నుండి 12 సంవత్సరాలు.
మేకలు కూడా పెంపుడు జంతువులు. వీటి బలమైన శరీరంతో నాలుగు కాళ్లతో, కొమ్ములతో ఉంటాయి. వీటి రెండు రకాలు ఒకటి మానవులు పెంచుకునేవి. రెండవరకం కొండలలో గుట్టలలో పెరిగే మేకలు. ఇవి షుమారు 50 కిలోలు ఉండవచ్చ. మగవాటికి, ఆడవాటికి కూడా కొమ్ములు ఉంటాయి.
వీటి ఆహారం ఆకులు మరియు గడ్డి. ఇవి కూడా నెమరు వేసే జంతువులు.
ఆడ మేకల గర్భధారణ సమయం ఆరు నెలలు. పిల్లలు ఆరు నెలల పాటు తల్లిపాలు తాగి పెరుగుతాయి. రెండన్నర సంవత్సరాలకు ఇవి పూర్తిగా పెరుగుతాయి. వీటిని మాంసం కోసం పెంచుకుంటారు. కొంత మంది వీటి పాలను తాగుతారు. వీటి జీవితకాలం 15 నుండి 18 సంవత్సరాలు.
గాడిదలు, గుర్రాలు, జీబ్రాలు ఒకేజాతికి చెందినవి. పురాతన కాలం నుండి వీటిని మానవులు పెంచుకుంటున్నారు. ఇవి 250 కిలోల బరువు ఉంటాయి. వీటి చెవులు పైకి నిక్కపొడుచుకుని ఉంటాయి. అడవిలో పెరిగే గాడిదలను అడవి గాడిదలు అంటారు.
ఇవి శాఖాహారులు. గడ్డిని ఎక్కువగా తింటాయి. పొదలను కూడా తింటాయి. గాడిదలకు ఆకలి ఎక్కువ. ఎక్కువ ఆహారాన్ని తింటాయి. గాడిదలు చాలా బరువు మోయగలవు. ప్రధానంగా వీటిని బరువులు మోయటానికి ఉపయోగిస్తారు. కొన్ని వర్గాల వారు గాడిద మాంసం తింటారు. వీటి పాలకు అనేక జబ్బులను తగ్గించే గుణం ఉందంటారు.
ఆడ గాడిదలు 12 నెలలు గర్భం ధరించిన తరువాత ఒకే పిల్లను కంటుంది. 5 నెలల పాటు పిల్లగాడిద తల్లిపాలు తాగి పెరుగుతుంది. పిల్లగాడిదలు పూర్తిగా ఎదగటానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది. నేటికాలంలో పట్టణాలలో గాడిదలు కనిపించవు. పల్లెలలో వీటిని చూడవచ్చు.
కుక్కలను పురాతన కాలంనుండి మానవులు పెంచుకుంటున్నారు. రామాయణంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఇవి చాలా విశ్వాసంగల జంతువులు. ఇదివరకు వీధికుక్కులు ఎక్కువగా ఉండేవి. నేటి కాలంలో అనేక జాతుల కుక్కలు వచ్చాయి. చాలా జాతుల కుక్కలను పెంచుకుంటున్నారు. వీటిలో పోలిసు కుక్కలు (వాసన ఆధారంగా దొంగలను పట్టుకునే కుక్కలు) కూడా ఉన్నాయి. ఇవి సునిశితమైన (చాలా చిన్న శబ్దాలను) వినగలవు. వాసనలు పసిగట్టగలవు.
కుక్కలు మాంసాహారులు. వీటి ఆహారం మాంసం, గుడ్లు, పాలు, పెరుగు.
ఇవి ఇళ్లకు చక్కగా కాపాలా కాస్తాయి. జంతువులను వేటాడటానికి కుక్కలను ఉపయోగిస్తారు. కుక్కలు ప్రమాదకరమైనవి కూడా. వీధికుక్కలు తరుచుగా మానవులను ముఖ్యంగా చిన్నపిల్లలను కరవటం జరుగుతుంది. ముఖ్యంగా పిచ్చికుక్కలు కరవటం వలన మనుషులు పిచ్చిపట్టి చనిపోయిన సంఘటనలు అనేకం. వీటి కాటువలన ప్రమాదం రాకుండా కుక్కలకు రాబిస్ ఇంజక్షన్ లు ఇస్తారు. ఏ కుక్క కరిచినా వెంటనే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.
ఆడ కుక్కలు 63 రోజుల గర్భధారణ తరువాత ఆరు పిల్లల దాకా జన్మ నిస్తుంది. ఈ సంఖ్య కుక్కలజాతులను బట్టి మారుతుంది. వీటి జీవిత కాలం 10 నుండి 13 సంవత్సరాలు.
పందులు కూడా పెంపుడు జంతువులే. కానీ కొన్ని వర్గాలవారు మాత్రమే వీటిని పెంచుకుంటారు. పట్టణాలలో పందులు చాలా తక్కువ. పల్లెలో పందుల పెంపకం జరుగుతుంది. ఇవి బలిష్టమైన శరీరంతో, పొట్టి కాళ్లతో ఉంటాయి. వీటిలో తెల్లపందులు, నల్లపందులు ఉన్నాయి. వీటి చర్మం చాలా మందంగా ఉంటుంది. ఇవి ఎంత బలంగా ఉంటాయంటే రోడ్లమీద తిరిగేటపుడు కారుగాని, ద్విచక్ర వాహనాలు గుద్దినపుడు ఇవి గాయపడవు. వాహనాలకే దెబ్బ తగులుతుంది.
తెల్ల పందులను ప్రత్యేకంగా మాంసంకోసం పెంచుతారు. వీదేశీయులు ఎక్కువగా పందిమాంసాన్ని ఇష్టపడతారు.
భారతీయులలో కూడా కొన్ని వర్గాల వారు మాత్రమే పందిమాంసాన్ని తింటారు..
ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో పందులు ఉన్నాయి. పందులు 100 నుండి 300 కిలోల బరువు ఉంటాయి. మాంసం కోసం పెంచే తెల్ల పందులు ఇంకా ఎక్కువ బరువు ఉంటాయి.
అడవి పందులు దుంపలు, పండ్లు తింటాయి. మాంసం కోసం పెంచే తెల్లపందులు తవుడు, గోధుమలతో పాటు వీటి ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది. ఇంక మామూలుగా పల్లెలలో కనిపించే నల్లపందులు తినని ఆహారం లేదు. మనుషుల మలంతో సహా అనేక చెత్త పదార్ధాలను తింటాయి.
పందులకు సంతాన సామర్ధ్యం ఎక్కువ. ఇవి 6 నుండి 14 పిల్లలను కంటాయి. మానవులు పెంచుకునే పందులు15 నుండి 20 సంవత్సరాలదాకా జీవిస్తాయి. అడవి పందుల జీవితకాలం మాత్రం 4 నుండి 5 సంవత్సరాలు మాత్రమే.