అమరావతి ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ఉన్నది. ఒకప్పటి శాతవాహునుల రాజధాని ఐన ధరణికోట అమరావతికి దగ్గరలోనే ఉన్నది.. తరువాత కుషానులు కాలంలో ఇక్కడ బౌద్ధమతం వ్యాపించింది. 2000 సంవత్సరాక్రితం కట్టబడిన బౌద్ధ స్థూపాన్ని, బౌద్ధమత అవశేషాలను ఇక్కడ చూడవచ్చు. ఈ స్థూపం సాంచి స్థూపంకంటే పొడవైనది. దీనిని అశోకచక్రవర్తి కాలంలో నిర్మించారంటారు. దీనినే మహాస్థూప, దీపాలదిన్నె అనికూడా అంటారు. ఈ స్థూపం గుండ్రని వేదిక మీద ఇటుకలతో నిర్మించబడినది. ఈస్తూపం అనేక చిన్న బొమ్మలతో అలంకరించబడి ఉంది. అశోకచ్రకవర్తికాలంలో నిర్మించబడినదని అంటారు. దీనినే మహాస్థూపం, దీపాలదిన్నె అని కూడా అంటారు. సాంచి స్థూపంకంటే ఈ స్థూపం పొడవైనది.
అమరావతి స్థూపాన్ని కార్బన్ డేటింగ్ ద్వారా పరిశీలించినపుడు అమరావతి (ధాన్యకటకము) పట్టణం క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. స్థూపం క్రీస్తు పూర్వము 2వ శతాబ్దము, క్రీస్తు శకము 3వ శతాబ్దముల మధ్య కట్టబడి మార్పులు చేర్పులు చేయబడినది. క్రీ.శ. 14వ శతాబ్దం తర్వాత మరుగునపడిన చైత్యం తిరిగి 18వ శతాబ్దములో వెలుగు చూసింది. గృహనిర్మాణం కోసం ధ్వంసం చేయబడుతున్న స్థూప కట్టడాలు, శిల్పాల గురించి విన్న కోలిన్ మెకంజీ 1797లో ఈ మహోన్నత సంపదను వెలికితీసి రక్షణకు పూనుకొన్నాడు. తర్వాత సర్ వాల్టర్ స్మిత్ -1845, రాబర్ట్ సెవెల్ -1877, జేమ్స్ బర్జెస్ -1881, అలెగ్జాండర్ రె -1888-1909, రాయప్రోలు సుబ్రహ్మణ్యం -1958-59, యం. వెంకటరామయ్య -1962-65, ఐ. కార్తికేయ శర్మ -1973-74 పురాతత్వవేత్తలు సాగించిన త్రవ్వకాలలో శిథిలమై విఛ్ఛినమైన మహా చైత్యము బయల్పడింది
చైనా యాత్రీకుడు హ్యూయెన్ త్సాంగ్ ఆరవ శతాబ్దములో అమరావతి స్థూపం సందర్శించునాటికే క్షీణదశ ప్రారంభమైనది. ఐతే క్రీ.శ. 1344 వరకు పూజాపునస్కారాలు జరిగినట్లు ఆధారాలున్నాయి. హిందూమత ప్రాభవమువల్ల క్రీ.శ. 1700 నాటికి స్థూపం శిథిలావస్థకు చేరుకొంది. పెర్సీ బ్రౌను మహాచైత్యం ఉచ్చస్థితిలో ఎలా ఉండేదో ప్రణాళికను చేశారు.
అంధ్రప్రదేశ్ ప్రభుత్వంవారు ఇక్కడ మ్యూజియం ఏర్పాటు చేసి ఆకాలంనాటి వస్తువులను భద్రపరచారు. ఈ మ్యూజియానికి శుక్రవారం సెలవు. ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటలవరకు పనిచేస్తుంది.
అమరావతిలోనే ప్రసిద్ధి చెందిన హిందువుల శివాలయం కృష్ణానది ఒడ్డునే కలదు. ఈ శివాలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పంచారామక్షేత్రాలలో ఒకటైన అమరేశ్వర క్షేత్రం.
గుంటూరు నుండి 30 కిలోమీటర్లు, విజయవాడ నుండి 65 కిలోమీటర్ల దూరంలో అమరావతి ఉన్నది. రెండుచోట్ల నుండి బస్ సౌకర్యం కలదు. సొంతవాహనాలలో వెళ్లవచ్చు