header

Bhattiprolu Famous Buddhist Place

భట్టిప్రోలు

భట్టిప్రోలు గుంటూరు జిల్లాలోని చిన్న గ్రామము. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో బయల్పడ్డ బౌద్ధ స్తూపము అంతర్జాతీయంగా పేరుపొందింది. దీనితో భట్టిప్రోలు గ్రామం కూడా అంతర్జాతీయంగా పేరుపొందింది. భట్టిప్రోలు ఊళ్ళోఉన్న చిన్నలంజ అనే పేరుగల దిబ్బను మరియు విక్రమార్క కోట అనే దిబ్బను త్రవ్వగా క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దములో నిర్మించిన బౌద్ధ స్తూపము బయటపడింది.
క్రీస్తుపూర్వం 3వ శతాబ్దికి చెందిన భట్టిప్రోలు స్తూపం చరిత్ర తెలుసుకునేందుకు భారతీయులకంటే విదేశీయులే ఆసక్తి కనబరిచారు. క్రీ.శ 1870లో బోస్‌వెల్‌, 1871లో ఇర్లియట్‌, 1882లో రాబర్టు సెవెల్ ‌లు దీన్ని సందర్శించారు. 1892లో అలెగ్జాండర్ ‌రే ఇక్కడ జరిపిన తవ్వకాల్లో రాతి ధాతుకరండాన్ని కనుగొన్నారు. 1969-70 సంవత్సరాల్లో పురావస్తు శాఖ తరఫున ఆర్‌. సుబ్రహ్మణ్యం త్రవ్వకాలు జరిపారు. ఒక విహారపు పునాదులు బయటపడ్డాయి. బుద్ధుని తల ప్రతిమ వెలుగుచూసింది.
పలు ఇతర వస్తువులు కూడా బయటపడ్డాయి. పురావస్తు శాఖ అంచనా ప్రకారం క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో దీని నిర్మాణం జరిగిందని నిర్ణయించారు. ఇక్కడి స్థూపం 132 అడుగులు, వేదిక 148 అడుగుల వ్యాసాలతో ఉంది. 8 అడుగుల ఎత్తు, 8.4 అడుగుల వెడల్పు ప్రదక్షిణా పథం నలుదిక్కులా అయకపు అరుగులు కలిగిన ఈ స్థూపం వాస్తురీత్యా నూతన విషయాలను అందించింది.
స్థూప నిర్మాణానికి 45 X 30 X 8 సెంటీమీటర్ల కొలతలున్న ఇటుకలు వాడారు. భట్టిప్రోలు స్థూప త్రవ్వకాల్లో బయటపడిన ధాతువుల్ని అప్పటి బిట్రీష్‌ ప్రభుత్వం భద్రపర్చింది. 1892వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించిన మహాబోధి సొసైటీ ఆఫ్‌ ఇండియాకు నూతన స్థూపంలో నిక్షిప్తం చేసేందుకు వాటిని ఇవ్వటానికి అంగీకరించింది.
1893లో అమెరికాలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన శ్రీలంక బౌద్ద బిక్షువు అనగారిక ధర్మపాల ఈ సంస్థను స్థాపించారు. 1920వ సంవత్సరంలో కలకత్తాలోని శ్రీధర్మరాజిక విహార్‌లోని నూతన స్థూపంలో భట్టిప్రోలులోని బుద్ద ధాతువులున్న స్పటిక పేటికను నిక్షిప్తం చేశారు.
కానీ ఈ బౌద్ధవిహారాన్ని ఇంకా అభివృద్ధిచేయవలసి ఉంది. సరియైన ప్రయాణ సౌకర్యాలను కూడా కల్పించవలసి ఉంది. ఎలా వెళ్లాలి : గుంటూరు నుండి 40 కిలోమీటర్ల దూరంలో భట్టిప్రోలు ఉన్నది. గుంటూరు నుండి రేపల్లె వెళ్లే ప్యాసింజర్ రైళ్లు ఇక్కడ ఆగుతాయి. గుంటూరు నుండి బస్ సౌకర్యం కూడా ఉన్నది.