నాగార్జున కొండ దక్షిణ భారతంలో ప్రసిద్ధి చెందిన ఒక బౌద్ధ క్షేత్రం. బౌద్ధమత తత్వవేత్త, ఆచార్యుడు అయిన నాగార్జునుని పేరు ఈ ప్రాంతానికి పెట్టబడింది. ఆచార్య నాగార్జునుడు బౌద్ధమత వ్యాప్తికొరకు అమరావతి నుండి ఇక్కడకు వచ్చి నివాసం ఏర్పరుచుకున్నాడు. మహాయాన బౌద్ధమతాన్ని (వీరు బుద్ధుని విగ్రహాలను పూజించరు) స్థాపించిన ఈయన సుమారు 60 సంవత్సరాల పాటు ఈ సంఘాన్ని ఇక్కడ ఉన్న విద్యాలయాన్ని కూడా నిర్వహించారు. ఈ విద్యాలయానికి అప్పట్లోనే చైనా, శ్రీలంక నుండి విద్యార్ధులు వచ్చేవారు. అప్పట్లోనే అక్కడ ఆధునాతన స్నానశాలలు, మఠాలు,చైత్యాలు నిర్మించబడినవి.
నాగార్జునాసాగర్ డ్యాం నిర్మాణంతో ఇవన్నీ నీటిలో మునిగి పోయాయి. కానీ నీటిమధ్యలో ఉన్న కొండపై బౌద్ధవిహారం లాగా కట్టబడిన ప్రదేశంలో వీటన్నిటిని బధ్రపరచారు. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో బయల్పడిన, క్రీ.పూ.2వ శతాబ్దపు బౌద్ధావశేషాలను జలాశయం మధ్య కొండపై నిర్మింపబడిన నాగార్జునకొండ ప్రదర్శనశాల లో భద్రపరిచారు
జలాశయం మధ్యలో ఉన్న ఈ
మ్యూజియం ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.
నాగార్జునకొండలో సుమారు 400 వరకు శాసనాలు లభించాయి. వీనిలో చాలావరకు దానధర్మాలకు సంబంధించినవి. ఇవి ప్రాకృత, సంస్కృత, తెలుగు భాషలలో ఉన్నాయి. ఈ శాసనాలను అధ్యయనం కోసం ఏడు విధాలుగా విభజించారు.
1. ఆయక స్తంభ శాసనాలు
2. చైత్యగృహాలలో లభించిన శాసనాలు
3. పగిలిన శాసనాలు
4. శిల్ప ఫలకాలపైనున్న శాసనాలు
5. ఛాయాస్తంభ శాసనాలు
6. బ్రాహ్మణమత ఆలయ సంబంధ శాసనాలు
7. ఇతర శాసనాలు
క్రమక్రమంగా నాగార్జునా కొండ విహారకేంద్రంగా మారింది. ఇక్కడకు భారతీయులే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా వస్తారు.