విశాఖపట్టణం జిల్లా శంకారం గ్రామం దగ్గర గల కొండలపై గల బౌద్ధ స్థలాలు బొజ్జన్నకొండ మరియు లింగాలకొండలుగా పిలువబడుతాయి ఇవి క్రీ.శ 4 నుండి 9 శతాబ్ది మధ్యలో కట్టబడినవిగా చెబుతారు. ఒకనాడు సంఘారామము అని పిలవబడేది.అప్పట్లో హీనయానం, మహాయానం, వజ్రయానం బాగా వృద్ధిలో వుండేవి.
ఏకశిలా స్తూపాలు, కొండలో తొలచబడిన గుహలు ఇచ్చటి ప్రత్యేకతలు. మొత్తం నాలుగు గుహలు ఆశ్రమ స్థలాలు. మూడింటిలో ధ్యానబుద్ధ విగ్రహాలున్నాయి. ప్రతి గుహద్వారము రెండుప్రక్కల పెద్ద ద్వారపాలకుల విగ్రహాలున్నాయి. గుహ అంతర్భాగము చతుర్భుజాకారములో ఉండి పదహారు స్థంబాలతో, ఇరువది గదులతో మలచబడింది. గుహ మధ్యలో చతురస్రాకారపు తిన్నెపై రాతిలో తొలచబడిన ఘనస్తూపము గలదు. ధ్యాన ముద్రలో గల బుద్ధుని విగ్రహము అద్భుతంగా ఉంటుంది.
బొజ్జన్నకొండలో
ప్రధాన స్తూపము రాతిలో తొలచబడి ఇటుకలతో చుట్టబడి ఉన్నది. బొజ్జన్నకొండపై ఇటుకలతో కట్టబడిన విహారాలు, చైత్యము. భిక్షువుల గదులు ఉన్నాయి. 1907 లో జరిగిన త్రవ్వకాలలో ఇచట పలు నాణేలు దొరికాయి. 4వ శతాబ్దపు సముద్ర గుప్తుని కాలం నాటి నాణెము, చాళుక్య రాజు కుబ్జ విష్ణువర్ధనుని, ఆంధ్ర శాతవానుల కాలము నాటి నాణేలు దొరికాయి. లింగాలకొండ అంచున రాతిలో తొలచబడిన పలు స్తూపాలున్నాయి. బౌద్ధమత వ్యాప్తితోబాటు పలు ఆరామములు, విద్యాస్థలాలు వెలిశాయి. వానిలో తొట్లకొండ, బావికొండ, పావురాలకొండ మొదలగునవి దగ్గరలోనే ఉన్నాయి. రెండు వేల సంవత్సరముల క్రితము పేరుపొందిన ఈ ప్రదేశాలు కాలక్రమములో వాటి వైభవాన్ని కోల్పోయాయి.