header

Bugga Ramalingeswara Swamy / బుగ్గరామలింగేశ్వరస్వామి

అనంతపురం తాడిపత్రిలో పెన్నా నదీతీరంలో ఉందీ శివాలయం. ఏడాదిలో 365 రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతునే ఉంటుంది. బుగ్గ అంటే నీటి ఊట. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ పుణ్యక్షేత్రం పూర్తిగా నల్లరాతితో నిర్మించబడినది.
దేవాలయ చరిత్ర : శ్రీరాముడు తాటకిని సంహరించిన అనంతరం స్త్రీహత్యాపాతకాన్ని నివారించుకొనేందుకు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాడని అంటారు. అందుకే ఇక్కడ స్వామిని రామలింగేశ్వరుడని అంటారు. ఇంకొక కధనం ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని తిమ్మరాయుడి కుమారుడు రామలింగాయుడు పాలించేవాడు. అతను ఈ ప్రాంతంలో క్రీ.శ.1460లో కోటను కట్టించాడు. పరమశివుడు రామలింగనాయకుని కలలో కన్పించి తనకు ఆలయం కట్టించమని ఆదేశిస్తాడు. రామలింగనాయకుడు 1460-1475 మధ్యలో ఈ ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆలయం గోడలపై రామలింగనాయకుని ప్రతిమను చూడవచ్చు. ఈ కారణంతో కూడా రామలింగేశ్వరుడని స్వామిని పిలవటం మరో కారణం.
ఆలయ విశేషాలు : ఇక్కడ స్థానికంగా దొరకే నల్లరాతితో ఆనాటి శిల్పులు అద్భుతమైన శిల్ప సంపదకు ప్రాణం పోశారు. కొంత ఖుజురహో శైలిని మరికొంత హంపీ శిల్పకళను చూడవచ్చు.
ఈ దేవాలయంనకు మూడు ప్రవేశ ద్వారాలున్నాయి. ఇక్కడ మండపం నాలుగు స్థంభాలమీద నిర్మించబడి, ప్రతి స్థంభం తిరిగి నాలుగు చిన్న స్థంభాలమీద నిర్మించబడి వున్నది. ఈ నాలుగు స్థంభాను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు. పెన్నా నదీతీరంలో వెలసిన ఈ దేవాలయం వెనుకన స్మశానం ఉంది. ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించటం అరిష్టమని పండితులు చెప్పటంతో మాహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేశారు.
ఇక్కడ శివుడు స్వయంభువు కాబట్టి నిర్మాణాన్ని అర్ధాంతరంగా ఆపినా దోషం ఉండదన్నారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్ధంభం, ముఖమండపం, కళ్యాణమండపం, అంతరాళం, గర్భగుడి అనే ప్రధాన విభాగాలున్నాయి. ఇంకా ఇదే ఆవరణలో కుడివైపున వీరభద్ర చండీ ఆలయాలు కళ్యాణమండపం, రామాలయం పార్వతీ దేవి ఆలయాలున్నాయి.
ముఖమండపంలోని స్ధంభాలను తాకితే సప్తస్వరాలు ప్రతిధ్యనిస్తాయంటారు. మండపాలపై రాతిపుష్పాలు, ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహం, సూర్యచంద్రులు, కత్తి కనిపిస్తాయి. కుడ్యాలపై నాట్యకారిణల నృత్యభంగిమలు కనువిందు చేస్తాయి. మరియు శ్రీమహావిష్ణువు దశావతారాలను మనోహరంగా మలచారు శిల్పలు. ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ అష్టమి మొదలు ఫ్గాుణమాసం శుద్ధ తదియ వరకు 11 రోజులపాటు రామలింగేశ్వరుని బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ప్రయాణసౌకర్యాలు : ముంబాయి`చెన్నైయ్‌ - రైలు మార్గంలో (కడప-గుంతకల్‌ జంక్షన్‌ మధ్యలో) తాడిపత్రి రైల్వేస్టేషన్‌ ఉన్నది మరిము అనంతపురం నుండి తాడికొండకు ప్రతి 5 నిముషాలకు బస్సులున్నాయి. రైలు మార్గంలో వెళ్ళేవారు గుత్తి రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుండి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న తాడిపత్రికి బస్సులలో వెళ్ళవచ్చు.