అనంతపురం జిల్లా, తాడిపత్రిలో చింతల వేంకటరమణుడు కొలువై ఉన్నాడు. చింతల వేంకటరమణుని దర్శించుకోగానే చింతలన్నీ తొగిపోతాయంటారు భక్తులు.
స్థలచరిత్ర : విజయనగర సామ్రాజ్యం ఉన్నతదశలో ఉన్నపుడు నిర్మించిన ఆలయం ఇది. ఈ ప్రాంతంలోని ఒకసారి చింతచెట్టు తొర్రలోనుండి పెద్దపెట్టున శబ్ధం వినిపించిదట. అక్కడకు వెళ్ళి చూస్తే చెట్టుతొర్రలో విష్ణుశిల దర్శనమిచ్చింది. గండికోటలో సైన్యంతో బసచేసిన పెన్నసాని ప్రాంత పాలకుడైన తిమ్మనాయకునికి వేంకటేశ్వరస్వామి కలలో కనిపించి ఫలాన చోట వెలిశాను. నాకో చక్కటి గుడి కట్టించమని ఆదేశించాడట. పరమ భక్తుడైన తిమ్మనాయుడు 1510-1525 మధ్యకాలంలో వేంకటరమణుడి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పట్లో ఇక్కడ పెద్ద చింతలతోపు ఉండేదని అంటారు చింతతోపులో వెలిసినవాడు, చింతలు తీర్చేవాడు కాబట్టి చింతల వేంకటరమణుడని పేరువచ్చింది.
ఆయ విశేషాలు : పది అడుగుల ఆజానుబాహుడు చింతల వేంకటేశుడు. భాస్కరక్షేత్రంగా పేరుపొందిన ఈ ఆలయంలో మాఘశుద్ధ ఏకాదశి, త్రయోదశి, ద్వాదశి పర్వదినాలలో రాజగోపురం ద్వారా ప్రవేశించే సూర్య కిరణాలు ఆలయం ముందున్న ఏకశిలారథంలోని రెండు రంధ్రాల గుండా లోపలకి ప్రవేశించి రంగమండపం, అర్థమండపం గుండా మూదు ద్వారాలను దాటుకుని .... గర్భగుడిలోని మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఇది నాటి సాంకేతిక నైపుణ్యానికి, ఖగోళశాస్త్ర ప్రతిభకు నిదర్శనం. ప్రస్తుతం చుట్టుప్రక్కల ఆధునిక నిర్మాణాల కారణంగా సూర్యకిరణాలకు ఆటంకం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
ఏకశిలారథం : ఆలయం ముందు భాగంలో ఉన్న రాతిరథం హంపిలోని ఏకశిలారథాలను పోలి ఉంటుంది. కదలిక మినహా రథానికి ఉండాల్సిల హంగులన్నీ ఉన్నాయి. రథంలో నాలుగు అడుగుల గరుత్మండి విగ్రహం ముకుళిత హస్తాలతో దర్శనమిస్తుంది.
ఈ రాతిరథం నుండే మండపం ప్రారంభమవుతంది. మండపాన్ని 40 రాతి స్తంభాలతో నిర్మించారు. ఇది కూడా హంపీలోని విఠలాలయాన్ని పోలి ఉండటం విశేషం. ఆలయం చుట్టూ, లోపల అపారమైన శిల్పసంపద ఉంది. ఈ నిర్మాణ శైలిని ‘నెరేటవ్ స్క్ప్సర్’గా వర్గీకరించారు నిపుణులు. దీని అర్ధం వరుస క్రమంలోని ఆ శిల్పాలను చూస్తే రామాయణ, భాగవత కధలు కళ్లముందు కదలాడుతున్నట్లు అనిపిస్తుంది. బ్రహ్మ, కుబేర, యక్ష, కిన్నెర, మానవమూర్తులు, గజ, తురగ, మర్కటాది బొమ్మలను చూడవచ్చు. హంసలు, చిలకలు కుడ్యాలపై కనువిందు చేస్తాయి. కాళీయ మర్ధన కృష్ణరూపం అత్యంత రమణీయం. గర్భగుడి గోపురం ఎనిమిది ముఖాలతో ద్రావిడ పద్ధతిలో నిర్మితమైంది.
గర్భాలయం పై కప్పుకు బిగించిన అష్దదళ రాతిపద్మం ఒకప్పుడు తిరుగుతూ ఉండేదంటారు. ఇక ఆస్థాన మండపంలో కిష్కింధ, చిత్రకూట, సీతారాముల అరణ్యవాస ఘట్టాలను చూడవలిసిందే. ఆలయం బయట ఎత్తయిన రాజగోపురం దానికీ ఎదురుగా ఓ పెద్ద రాతి మండపం మీద శిలాతోరణం ముందుగా మనకు కనిపిస్తాయి. ఆలయం లోపల ధ్వజస్తంభం ఉంది.
దాని వెనుకాలే ఏకశిలా రధం. విశేష సందర్భాలలో ఆలయానికి ఎడమవైపున ఉన్న మండపంలో పద్మావతీ శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహిస్తారు.కుడివైపున సీతారాముల మందిరం, దాని తరువాత పద్మావతి అమ్మవారు కొలువైన గుడి మనకు కనిపిస్తాయి. ఏటా ఆశ్వీయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) నుంచి బహుళ తదియ వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి.
ఎలావెళ్లాలి : అనంతపురం నుండి తాడిపత్రి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది. అనంతపురం నుండి బస్సులో వెళ్ళవచ్చు. అనంతపురానికి రైలు మార్గం ద్వారాకూడా చేరుకోవచ్చు.