చిత్తూరు జిల్లా పెనుమూరు నుంచి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పులిగుండు.
చుట్టూ పచ్చని పొలాలు.. మధ్యలో ఓ గుట్ట.. దాని పైన నిటారుగా నిలిచిన రెండు గుండ్లు. 1000 అడుగుల ఎత్తు. పర్వతాలను మరిపించే భారీ గుండ్లు. ప్రకృతి వింత అంటారు. భక్తులు ఆదిదంపతులే ఇలపై ఇలా వెలిశారని విశ్వసిస్తారు. ఈ రెండు గుండ్లను శివపార్వతుల స్వరూపంగా భావిస్తారు స్థానిక ప్రజలు. అందుకే ఎంత కష్టమైనా కొండపైకి ఎక్కుతారు. కొండ బొరియల్లోని మెట్లు ఎక్కుతూ, కొన్నిచోట్ల పాకుతూ.. పైకి చేరుకుంటారు. రెండు గుండ్లనూ కలుపుతూ ఉక్కు వంతెన ఏర్పాటు చేశారు.
గుండుపైకి చేరుకున్న తర్వాత.. రివ్వున వీచే కొండగాలి మనసుకు ఆహ్లాదాన్నిస్తుంది. కనుచూపుమేరలో చిక్కటి పచ్చదనం.. అలసటను మరచిపోయేలా చేస్తుంది. గుండుపై ఉన్న శివాలయంలో భక్తులు మొక్కులు చెల్లిస్తారు. పైకి వెళ్లేటప్పుడు కొండ మధ్యలో వేంకటేశ్వరస్వామి, వినాయకుడు, ఆంజనేయుడు కొలువై ఉన్న ఆలయాన్ని సందర్శిస్తారు. పులిగుండు దిగువన స్వయంభూ పులిగుండేశ్వరస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ గుండు కింద పులులు సేదతీరేవట.
అందుకే ఈ ప్రాంతానికి పులిగుండు అనే పేరువచ్చిందని చెబుతారు. గుండు సమీపంలో ఓ కోనేరు కూడా ఉంటుంది. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ కోనేరు ఎండిపోయే దశకు వచ్చిందంటే తప్పకుండా వర్షం కురుస్తుందట. ఇన్ని విశేషాలున్న పులిగుండు క్షేత్రానికి వారాంతంలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చిత్తూరు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. సంక్రాంతి సమయంలో వేలమంది భక్తులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతుంది.
ఎలా వెళ్లాలి...?: పులిగుండు.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి నుంచి 50 కి.మీ., కాణిపాకం నుంచి 28 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రాల నుంచి పెనుమూరు మీదుగా పులిగుండు చేరుకోవచ్చు. ఇక్కడ వసతులు పరిమితంగా ఉన్నాయి.