header

Sivalayam, Surutupalli...విగ్రహ రూపంలో కొలువైన శివుడు...

శివాలయం, సురుటుపల్లి .... Sivalayam, Surutupalli..
చుట్టూ పచ్చదనాన్ని ఇనుమడింపచేసే కొండలూ, పక్కనే సెలయేటి గలగలలను వినిపించే అరుణానదీ తీరం... ఇలా ఈ క్షేత్రంలో అణువణువూ ప్రకృతి ఒడిలో సేదతీరిన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇక్కడి పళ్లికొండేశ్వరస్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయలు క్రీ.శ1344-77 మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.
దుర్వాస మహాముని శాపం వల్ల ఇంద్రలోకంలోని దేవతలందరూ అమరత్వాన్ని కోల్పోతారు. అప్పుడు ఇంద్రుడు మహావిష్ణువును శరణు కోరగా సముద్రగర్భంలోని అమృతాన్ని సేవిస్తే మీకు తిరిగి అమరత్వం సిద్ధిస్తుందని చెబుతాడు. దాంతో దేవతలు రాక్షసులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, మంథర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి (పాము)ని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనాన్ని చేపడతారు.
ఈ క్రమంలో వాసుకి నొప్పిని భరించలేక హాలం అనే విషాన్ని క్రక్కుతుంది. ఆ కాలకూట విషం బారి నుంచి రక్షించమని దేవతలు, రాక్షసులు శివుణ్ణి ప్రార్థిస్తారు. వారికి అభయమిచ్చిన పరమశివుడు విషాన్ని తానే మింగి కంఠంలో నిలుపుకుంటాడు.
మహా శక్తిమంతుడైన శివుడుసైతం భయంకరమైన విష ప్రభావానికిలోనై పళ్లికొండేశ్వరస్వామి క్షేత్రంలోనే పార్వతీ దేవి ఒడిలో కాసేపు విశ్రమించాడంటారు. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టి దీనికి శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది.
స్వామి విగ్రహం ప్రత్యేకత....
సర్వమంగళ సమేత శ్రీపళ్లికొండేశ్వరస్వామి విగ్రహం 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీ దేవి ఒడిలో శయనిస్తున్నట్టు ఉండే స్వామివారి దివ్యరూపాన్ని చూడవచ్చు.
విష ప్రభావానికిలోనైన స్వామివారు తిరిగి లేచేవరకూ బ్రహ్మ, మహావిష్ణువు మొదలైన దేవతలందరూ వచ్చి ఈ క్షేత్రంలోనే ఉన్నారట. ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చిన చందన తైలాన్ని ప్రతి పదిహేను రోజులకోసారి పూస్తారు.
ఆలయంలోకి వెళ్లగానే ముందుగా మరగదాంబికా అమ్మవారు దర్శనమిస్తారు. శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా భువనేశ్వరీ దేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాన్ని ఆపి, జీవితాన్ని అమృతమయం చేసినందువల్లే ఆ తల్లి అముదాంబికై (మరగదాంబికా) అయ్యింది. అందుకే ఈ క్షేత్రంలో ముందుగా అమ్మవారినీ, ఆ తర్వాత స్వామివారినీ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వాల్మీకి మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడనీ, అందుకే ఇక్కడ కొలువైన దేవదేవుడిని వాల్మికేశ్వర స్వామిగా కూడా అర్చిస్తారనీ పండితులు ఉవాచ
దక్షిణామూర్తి గౌరీదేవితో కలిసి ఉండటం విశేషం. శివుడి 64 అవతారాల్లో దక్షిణామూర్తి అవతారం ఒకటి. ప్రతి ఆలయంలో మర్రిచెట్టు కింద కూర్చొని ఉండే స్వామివారు ఇక్కడ నందిపై ఆశీనుడై దర్శనమిస్తాడు. గౌరీ సమేత దక్షిణామూర్తిని దర్శించడం వల్ల వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, సంతానంలేని వారికి సంతానం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం.
హాలాహలాన్ని సేవించిన శివుడు శయనించిన సమయంలో స్వామి నిర్వహించాల్సిన క్రతువులను నందీశ్వరుడు నెరవేరుస్తాడు. కోరిన వారికి వరాలిచ్చి భక్తులకు రక్షణగా నిలుస్తాడు. త్రయోదశి నాటి సాయంకాలం శివుడు కళ్లు తెరిచేటప్పటికి అందరూ నందిని పొగడటం చూసి, మహదానంద భరితుడై, ‘నందీ, నీకు ఏ వరం కావాలో కోరుకో’ అని అంటాడు. ‘రోజూ మీకు పూజ జరిగిన తర్వాత మీరు భుజించిన భోజన శేషాన్ని నేను భుజిస్తాను. కానీ త్రయోదశినాడు మాత్రం మొదటి పూజ నాకే చేయాల’ని కోరుకుంటాడు. ఇది జరిగింది శనిత్రయోదశినాడు కావడంతో అప్పటి నుంచీ శనిత్రయోదశి రోజున ప్రదోష కాలంలో మొదటి పూజను నందీశ్వరుడికే నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి ?...
చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లి ఈ ఆలయం ఉంది. ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే వారు చిత్తూరు జిల్లా కేంద్రం లేదా తిరుపతి నుంచి పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్లు ప్రయాణించి ఈ స్వామి ఆలయానికి వెళ్లవచ్చు.పుత్తూరు ప్రతి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది.