ఆయుర్వేద వైద్యులకు తొలిదైవం ధన్వంతరి. క్షీరసాగర మధనంలో ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో మూలికలతో ఉద్భవించిన ఆదివైద్యుడు ధన్వంతరి. ధన్వంతరి ఆరోగ్యానికి అధిపతి. పరిపూర్ణ ఆయువు కోసం ఘనంగా ధన్వంతరీ వ్రతం చేయడం భారతదేశంలో ప్రాచీన సాంప్రదాయం. ఏటా కార్తీకమాసంలో ధన్వంతరీ జయంతిని జరుపుకుంటారు. ధన్వంతరీ సూర్యనారాయుణుని ప్రియశిష్యుడు. సూర్యుని వద్దనే ఆయుర్వేదం నేర్చుకున్నాడు.
తూర్పగోదావరి జిల్లా ఆలమూరు మండలంలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరీ ఆలయం ఉంది. గౌతమీ నదీతీరాన, పచ్చని పంటపొలాల మధ్య సుమారు రెండు ఎకరాల సువిశాల ఆవరణలో స్వామివారు కొలువుతీరి ఉన్నారు. గర్భాలయంలో ధన్వంతరీ దివ్యమంగళరూపం దేదీప్యమానంగా దర్శమిస్తుంది. కాశీలో ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. నాలుగు హస్తాలతో ఒ చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతకలశం, ఒకచేతిలో జలగతో స్వామి దర్శనమిస్తాడు. ప్రాచీన ఆయుర్వేదంలో జలగ చికిత్స ఉంది. చెడురక్తాన్ని పీల్చుకునే శక్తి జలగకు ఉందంటారు. ద్విభాష్యం వెంకటేశ్వర్లు 1942లో ఈ ఆలయాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం కార్తీక బహుళ త్రయోదశినాడు ధన్వంతరీ జయంతిని వైభవంగా నిర్వహిస్తారు.
శస్త్రచికిత్సా విధానాన్ని శుశ్రుతనకు బోధించిన ఆదివైద్య గురువు ధన్వంతరి అని అంటారు.
ఈ ధన్వంతరీ ఆలయం తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఇంకా తమిళనాడులోని శ్రీరంగంలో ఉన్న రంగనాథస్వామి ఆలయంలో ధన్వంతరీ ఉపాలయం ఉంది. ఇక్కడ తీర్ధంగా వనమూలికలతో కూడిన కషాయాన్ని ఇస్తారు. కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలోనూ ఈ ఆరోగ్యదేవుడి విగగ్రహం ఉంది. గురవాయూర్ సమీపంలోనూ ధన్వంతరీ దేవాలయం ఉంది.