తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారిని భక్తులు కొండంత అండగా భావిస్తారు.
నూకాలమ్మను నమ్మిన వాళ్లు. మశూచిలాంటి అంటువ్యాధులు అమ్మ మాత్రమే అరికట్టగలదంటారు. పాడిపంటలు కళకళలాడాలంటే తల్లి దీవెన ఉంటే చాలని నమ్ముతారు
రాక్షస సంహారిణి...
స్థలపురాణం ప్రకారం... పూర్వకాలంలో క్రూరమృగాలతో నిండిన మహారణ్య ప్రాంతంలో ఏలా మహాముని శివుడ్ని ప్రార్థిస్తూ కఠోరమైన తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చిన మహేశ్వరుడు ప్రత్యక్ష్యమై వరం కోరుకోమన్నాడు. దానికాయన సముద్రంలో కలవని నదిని ప్రసాదించమనీ, ఆ నదిలో నీరంతా పాడిపంటలకూ, దాహార్తిని తీర్చేందుకే ఉపయోగపడాలని కోరాడు. దానికి శివాజ్ఞ లభించడంతో... ఆ ప్రాంతంలో ఏలా ముని పేరిట ఏలేరు అనే నది ఏర్పడింది. తర్వాత కొంతకాలానికి ఆ ప్రాంతం కిమ్మీరుడు అనే రాక్షసరాజు పరిపాలనలోకి వెళ్లింది. దాన్ని కిమ్మీరుసీమగా పిలిచేవారు.
ఈ రాజు తన రాజ్యంలోని ప్రజల్ని చిత్ర హింసలకు గురిచేసేవాడు. ఈ ప్రాంతానికి అతి సమీపంలో చంద్రవంశ రాజైన ధర్మకేతు మహారాజు రాజ్యం ఉండేది. కిమ్మీరుడి రాజ్యంలోని ప్రజలు తమని రక్షించాలని ధర్మకేతుడిని ఆశ్రయించారు. వాళ్ల అవస్థలు చూసి చలించిన ధర్మకేతుడు కిమ్మీరుడితో యుద్ధం చేశాడు. అయితే అతడు మహామాయావీ, అరివీర భయంకరుడే కాదు అఖండ సైన్య సంపత్తి కలిగిన వాడు అవడంతో ధర్మకేతుడు ఆ యుద్ధంలో ఓడిపోయాడు. కిమ్మీరుడి ఆగడాలు రోజు రోజుకూ మితిమీరుతుండటంతో ఎలాగైనా ఆ రాజ్యపు ప్రజలకు విముక్తి కలిగించాలనే బలమైన కోరికతో ధర్మకేతుడు పరాశక్తిని పరమనిష్ఠతో ప్రార్థించాడు.
దానికి ప్రసన్నమైన అమ్మ తన అనేకానేక అంశల్లో ఒక అంశను ధర్మకేతుడికి తోడుగా పంపింది. ఆమె సాయంతో ధర్మకేతుడు కిమ్మీరుడిని ఓడించి, వధించి ఆ రాజ్య ప్రజలకు విముక్తిని కలిగించాడు. ధర్మకేతుడు పరిపాలించిన రాజ్యమే కాలక్రమంలో కాండ్రకోటగా మారిందట. ఆయనకు యుద్ధంలో సాయం చేసిన అమ్మే నూకాలమ్మ. తన విజయానికి సాయం చేసిన కృతజ్ఞతతో అమ్మవారిని రాజ్యాధిదేవతగా కొలిచాడట ఆ రాజు. ఆ ఏలా నది ప్రవహించే ప్రాంతాన్ని ఏలేరుగా పిలుస్తారు. ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లా ఏలేరు ప్రాంతపు వూళ్ల ప్రజలంతా ఏ శుభకార్యమయినా అమ్మవారిని ముందుగా పూజిస్తారు.
41 రోజుల జాతర....
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారి జాతరంటే చుట్టు పక్కల వూళ్లకే కాదు ఆ జిల్లాకే పెద్ద పండగ. ఈ జాతరను కనీసం 500 సంవత్సరాలకు పూర్వం నుంచీ నిర్వహిస్తున్నారు. 1956లో ఆలయం దేవాదాయధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్లాక ఆ శాఖ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహిస్తున్నారు. మశూచీ, అమ్మవారులాంటి వ్యాధులు వూరిని చేరకుండా ఉండాలనీ, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని వేడుకోవడం జాతర ప్రధానోద్దేశం. ఫాల్గుణ మాసం బహుళ చతుర్దశి (ఈ ఏడు మార్చి 27న) రోజున రాత్రి జాగరణతో జాతర ప్రారంభమవుతుంది. జాతరకు 15 రోజుల ముందే గరగలతో వూరేగింపు జరుగుతుంది. జాతరనాటి రాత్రి బాణసంచా పోటీలు నిర్వహిస్తారు. పులి వేషాలూ, గరగల నృత్యాలూ, మేళతాళాలతో జరిగే అమ్మవారి ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు తరలివస్తారు. మొత్తం 41 రోజులు జరిగే ఈ జాతరకు ఏడు లక్షల మందిదాకా భక్తులు హాజరవుతారు. ఆది, మంగళ, గురువారాల్లో అధిక సంఖ్యలో జనం అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి భక్తులు అమ్మవారికి అరిసెలు, పాయసం, బూరెలు, సున్నుండలతో పాటు, కోళ్లు, చీరలు, గాజులు సమర్పించుకుంటారు.
రాజమహేంద్రవరం నుంచి రాజానగరం వయా కాకినాడ బస్సు ద్వారా పెద్దాపురం దర్గా సెంటర్‌లో దిగాలి. అదే రైలులో అయితే సామర్లకోటలో దిగి పెద్దాపురం చేరొచ్చు. పాతపెద్దాపురం రోడ్డు గుండా ప్రయాణిస్తే కాండ్రకోటకు సుమారు 8 కి.మీ. దూరం ఉంటుంది.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.