header

Pattisachalam Veerabhadra Swamy Temple / పట్టిసాలచం (పట్టిసీమ) వీరభద్రాలయం

అఖండగోదావరి నడిమధ్యలో ఉన్నదీ క్షేత్రం. రేవునుంచి పడవపై నది దాటి ఇసుక తిన్నెలపై కిలోమీటరు దూరం నడిచి గుట్టమీద ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే పచ్చని వాతావరణం, పక్షుల కిలకిలారావాలు వినగానే శ్రమంతా మర్చిపోయి, భక్తులు అద్వితీయమైన అనుభూతికి లోనవుతారు.
కాశీ, కేదారం, శ్రీశైలం, కాళహస్తి, పట్టిసీమను ప్రాచీన పంచ మహాశైవక్షేత్రాలుగా చెబుతారు. శివకేశవులిద్దరిని ఆరాధించే క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రానికి పాలకుడు భావనారాయణస్వామి. శివుని ఆజ్ఞానుసారం దక్షయజ్ఞం ధ్యంసం చేసిన తదుపరి వీరభద్రుడు దేవకూట పర్వతానికి వచ్చి ప్రళయతాండవం చేస్తుండగా చేతిలోనుండి శివునిచే ప్రసాదించబడిన పట్టిసం అనే ఆయుధం జారి పర్వతంపై పడిరదనీ అందుకే ఈ క్షేత్రం పట్టిసాచలంగా పేరొందిందని చెబుతారు
వీరభద్రుణ్ణి శాంతింపజేసేందుకు ముక్కోటి దేవతలు వేడుకున్నా ఫలితం లేకపోయింది. అప్పుడు అగస్త్యముని వీరభద్రుని ఆలింగనం చేసుకుని శాంతింపజేయగా స్వామి లింగాకారంలో స్వయంభువుగా ఈ దేవకూట పర్వతంపై వెలసినట్లు స్కందపురాణం వలన తెలుస్తుంది . ఈ ఆలయ ప్రాంగణంలో వీరభద్రునితో పాటు లక్ష్మీగణపతి, కుమారస్వామి,సరస్వతీదేవి ఆలయాలు కనిపిస్తాయి.
ఇంకోచోట భావనారాయణస్వామి, సీతారామస్వామి, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. శివరాత్రి సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, భీష్మ ఏకాదశి పండగను ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి రోజున సుమారుల క్షమందికి పైగా స్వామిని దర్శించుకుంటారు.
వీరభద్ర ప్రభ : శివరాత్రి రోజున ఆలయ ధర్మకర్తలు గోదావరి నుంచి తీర్థబిందెలతో నీటిని తీసుకువచ్చి స్వామికి నిత్యాభిషేకం చేసి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమపూజ చేస్తారు. తరువాత పూజాకార్యక్రమాలు ప్రారంభమై అర్థరాత్రి వరకు సాగుతాయి. నైవేద్యం తరువాత వీరభద్ర ప్రభ సంబరం ఉంటుంది. ఉత్సమూర్తులను ప్రభ వాహనపై తీరువీధులలో ఊరేగిస్తారు. చాళుక్య చక్రవర్తు కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రతాపరుద్రుని కాలంలో పునరుద్దరించినట్లు తెలుస్తుంది.
శివరాత్రి సమయంలో సువిశాలంగా కనిపించే ఇసుకతిన్నెలన్నీ జనాలతో నిండిపోతాయి. రేవునుండి ఆలయం వరకు తాటాకు పందిళ్ల వేసి దుకాణాలు పెడతారు. జీళ్లు, కర్జూరాల దుకాణాలు ప్రత్యేకం. మూడురోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకోసం భారీ పంటును వేసి ప్రత్యేక లాంచీలను ఏర్పాటు చేస్తారు. పట్టిసీమ రేవునుంచి లాంచీలో గొదావరి గలగలను దాటుకుంటూ హరోం హర...హరోం హర... అనుకుంటూ ఇసుకతిన్నెలమీద అలవోకగా నడుస్తూ ఆనందపారవశ్యంతో ఆ వీరభద్రుని దర్శించుకుంటారు. ఆ బోళాశంకరుడికి మనసులోని కోరికలను నివేదించుకుంటారు.
ఎలా వెళ్ళాలి ? : పశ్చిమగోదావరి జిల్లా పోలవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో అఖండ గోదావరి నది మధ్యలోఉంటుంది ఈ ఆలయం. రేవునుండి పడవపై నదిదాటి సుమారు కిలోమీటరు దూరం నడిచి గుట్టమీద ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు. రాజమండ్రి నుండి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోవూరుకు 25 కి.మీ దూరంలో ఉంటుంది. విజయవాడ వైపు నుండి వచ్చేవారు కోవూరులో దిగి వెళ్ళవచ్చు. రాజమండ్రికి రైలుమార్గం ద్వారా వెళ్లి అక్కడనుండి బస్సులలో వెళ్లవచ్చు.