సాక్షాత్తు శనిదేవుడే ప్రతిష్టించిన శివలింగం తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట మండలంలోని మందపల్లిలో ఉంది.
పురాణ కథనం :
పూర్వం ఈ ప్రాంతంలో మహర్షుల ఆశ్రమాలు ఉండేవి. నిత్యం యజ్ఞాలు జరుగుతుండేవి. ఇక్కడే అశ్వర్థుడు, పిప్పలుడు అనే బ్రహ్మరాక్షసులు కూడా నివసించేవారు. వీరిలో అశ్వర్థుడు రావిచెట్టు రూపంలోనూ, పిప్పలుడు బ్రాహ్మణుడి రూపంలోను సంచరిస్తూ మునుల యజ్ఞయాగాదులను పాడుచేసేవారు. యజ్ఞం చేసేవారిని కూడా చంపి తినేసే వారు. ఇక్కడ నివసించే మునులంతా కలసి శనీశ్వరుడును ప్రార్థించారు. శనీశ్వరుడు ఈ రాక్షసులను సంహరిస్తాడు. కానీ శనీశ్వరుడుని బ్రహ్మహత్యాదోషం పట్టుకుని పీడించసాగింది. బ్రహ్మహత్యానివారణకు శనిదేవుడు మందపల్లిలో శివలింగాన్ని ప్రతిష్టిస్తాడు.
ఆలయ ప్రాంగణంలోనే పార్వతీదేవి, ఉమా బ్రహ్మేశ్వరుడు, ఉమానాగేశ్వరుడు కూడా వెలసారు. ఇక్కడి క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి. పూర్వం ఇక్కడ గౌతమ మహర్షి ఒక యజ్ఞాన్ని చేశాడంటారు. యజ్ఞం పూర్తైన తరువాత యజ్ఞగుండంలోని అగ్ని ఎంతసేపటికీ ఆరకపోతే గౌతమ మహర్షి గోదావరి నదిని యజ్ఞగుండం మీదుగా ప్రవహింపచేశాడట. అప్పుడు అగ్నిదేవుడు శాంతించాడంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కూడా ఈ ప్రాంతంలోనే శివలింగాన్ని ప్రతిష్టించాడంటారు. ఆ లింగమే బ్రహ్మేశ్వరుడుగా పేరుపొందింది.
ఈ క్షేత్రంలో గౌతమ మహర్షి వేణుగోపాల స్వామిని కూడా ప్రతిష్టిస్తాడు కనుక ఈ క్షేత్రాన్ని గోపాల క్షేత్రంగా కూడా పిలుస్తారు.
ఉత్సవాలు
ఇక్కడ రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి కళ్యాణం ఏటా మాఘశుద్ధ ఏకాదశినాడు వైభవంగా జరుపుతారు. మాఘ బహుళ దశమి నుండి ఫాల్గుణ శుద్ధ విదియ వరకూ మందేశ్వరస్వామి కళ్యాణోత్సవం జరుగుతుంది.
ఎలా వెళ్లాలి ?
రాజమండ్రి దాకా రైళ్ళ ద్వారా ప్రయాణించి అక్కడనుండి రావులపాలెం మీదుగా అమలాపురం వెళ్లే దారిలో మందపల్లికి బస్సులలో ప్రయాణించి చేరుకోవచ్చు.