header

శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం - గొల్లల మామిడాడ / Sri Ramalayam, ollalamadidada

శ్రీ కోదండ రామచంద్రమూర్తి దేవాలయం - గొల్లల మామిడాడ / Sri Ramalayam, ollalamadidada
తూర్పు గోదావరి జిల్లా, పెదపూడి మండలానికి చెందిన గొల్లల మామిడాడలోని రామాలయం ప్రసిద్ధి చెందినది. తొమ్మిది అంతస్తులతో తూర్పువైపున గాలిగోపురం, 200 అడుగుల ఎత్తులో పశ్చిమగోపురం కనులవిందు చేస్తుంది. ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఈ గోపురాలమీద కేవలం రామాయణ ఘట్టాలేకాదు, మహాభారత, భాగవత దృశ్యాలనూ కళ్లకు కట్టినట్లుగా మలచిన దృశ్యాలు చూపరులకు కనువిందు చేస్తాయి.. ఆలయశిఖరం మీద బాల రామాయణ గాథను తెలిపే బొమ్మలు చూడవచ్చు. గ్రామానికి పది కిలోమీటర్ల దూరంలో ఎటువైపు నుంచి చూసినా ఈ గోపురాలు కనిపిస్తాయి. పశ్చిమగోపురం చివరి అంతస్తు ఎక్కితే 25 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం పట్టణంలోని పాండవుల మెట్ట, 20 కి.మీ. దూరంలోని కాకినాడ కనిపిస్తుంటాయి.
అద్దాల మందిరం ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. పశ్చిమగోపురానికి ఆనుకుని 64 స్తంభాలతో పుష్పకమను పేరుతో కట్టిన ఈ మండపంమీద అలనాటి మయసభను తలపించేలా ఈ మందిరాన్ని కట్టారు. ఆ అద్దాల్లోంచి అక్కడ కొలువైన శ్రీరాముణ్ని చూడగలగడం అనిర్వచనీయమైన ఆనందం. మండపం చుట్టూ ఉన్న గోడలమీద రామాయణ గాథ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. స్వామి కల్యాణం అనంతరం రాములవారి శ్రీపుష్పయాగాన్ని ఈ అద్దాలమందిరంలోనే అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
ఆలయానికి సుమారు 200 మీటర్ల దూరంలో శ్రీరామ పుష్కరిణి ఉంది. పవిత్ర తుల్యభాగ నదీజలాలు ఇందులో ఉండేలా చూస్తారు. శ్రీరామకల్యాణానికి పుష్కరిణి నీటినే తీర్ధబిందెలతో తీసుకొచ్చి, స్వామివారి పూజా కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఏటా శ్రీరాముడికి వసంతోత్సవం, చక్రస్నానాలను ఈ పుష్కరిణిలోనే నిర్వహిస్తారు. కార్తీకమాసంలో వచ్చే చిలుక ద్వాదశినాడు శ్రీరాముడి తెప్పోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
భద్రాచలంలో చేసే పద్ధతిలోనే ఈ ఆలయంలోనూ రాములవారి కల్యాణం జరుపుతారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో మంచి ముత్యాల తలంబ్రాలనూ పట్టుబట్టలనూ బహూకరిస్తారు. భద్రాచలంలో లాగానే వివాహమహోత్సవం అనంతరం స్వామివారి తలంబ్రాలను ప్రసాదంలా పంచుతారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి పాయసంగానీ పరమాన్నంగానీ చేసుకుని తిన్నవారికి కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. కల్యాణానికి వచ్చిన వాళ్లంతా అక్కడ ఏర్పాటుచేసిన కౌంటర్ల నుంచి స్వామివారి తలంబ్రాలను తీసుకువెళతారు. కళ్యాణం తరువాత స్వామి వారి కల్యాణ ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో వూరేగిస్తారు. అన్న సంతర్పణ కూడా నిర్వహిస్తారు. ఈ పరిసరాలలో పచ్చని కొబ్బరితోటలూ మామిడితోపులూ వాటి మధ్యలో వరిపొలాలూ గోదావరి పిల్లకాలువలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే గొల్లలమామిడాడలో ఆ కోదండరామచంద్రమూర్తి ఆలయం చూడటం ఒక మధురానుభూతి.
ఎలా వెళ్లాలి ? రాజమండ్రి వరకూ రైలూ లేదా బస్సులో వెళ్లి అక్కడ నుంచి కెనాల్‌ రోడ్డు మీదుగా బస్సులు లేక ట్యాక్సీలలో గొల్లల మామిడాడకు చేరుకోవచ్చు.