header

బుగ్గమల్లేశ్వరుడు మోర్జంపాడు / Bugga Malleswarudu, Morjampadu

బుగ్గమల్లేశ్వరుడు మోర్జంపాడు / Bugga Malleswarudu, Morjampadu
భ్రమరాంబా సమేతంగా అడవిలో కొలువయ్యాడు బుగ్గమల్లేశ్వరుడు. ఆయనకా పేరు రావడం వెనుక గొప్పకారణమే ఉంది. చుట్టూ రాళ్ల గుట్టలు ఉండగా భక్తులు ఎక్కడి నుంచి అభిషేకపు నీళ్లు తెస్తారనుకున్నాడో ఏమో... తన పక్కనే ఓ నీటి బుగ్గను ఏర్పాటు చేసుకుని ఆ నీళ్లతోనే అభిషేకాలందుకుంటున్నాడు. గుంటూరు జిల్లా మోర్జంపాడుకు వెళితే ఈ భక్తవరదుడ్ని దర్శించుకోవచ్చు. గరళకంఠుడి నెత్తిన గంగమ్మ స్థానం జగద్విదితమే. కానీ ఈసారి శివయ్య గంగమ్మను తన పక్కనే ఉంచుకున్నాడు.
గుంటూరు జిల్లా మాచవరం మండల సరిహద్దుల్లోని మోర్జంపాడుకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చోటుకి వెళితే ఆ గంగాధరుడ్ని దర్శించుకోవచ్చు. నల్లమల అభయారణ్యం మొదలయ్యే ప్రాంతం, స్వామి కొండ మీద నుంచి చూస్తే దూరంగా కనిపించే కృష్ణానది, దాని అవతల తెలంగాణలోని నల్గొండ జిల్లా పల్లెలు... అలాంటి ఏకాంత ప్రాంతంలో ఉందీ బుగ్గమల్లేశ్వరాలయం. ఈ ఆలయపు గర్భగుడిలోకి వెళితే శివలింగం పక్కనే చిన్న బిందెపట్టేంత పరిమాణంలో ఒక నీటి బుగ్గ కనిపిస్తుంది. అందులోని నీళ్లతోనే ఇక్కడి స్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయంలో తప్ప చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో చుక్కనీరు కనిపించదిక్కడ. శివుడితో పాటూ భ్రమరాంబ అమ్మవారూ, సీతారాములు కూడా కొలువైన ఈ ఆలయం హరిహర క్షేత్రంగానూ విరాజిల్లుతోంది.
ఏనాటిదో...
రాళ్ల గుట్టల మధ్య ఎత్తైన ప్రదేశంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. అయితే ఈ లింగాన్ని ఎవరు, ఎప్పుడు ప్రతిష్ఠించారూ అన్న దానికి ఆధారాలు లేవు. కానీ, 400 సంవత్సరాలకు పూర్వం అమరావతి జమీందారైన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు బెల్లంకొండ పరగణా ప్రాంతంలో పర్యటిస్తూ అడవిలో ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకున్నారట. ఇంతటి నిర్జన ప్రదేశంలో ఆలయం, శివలింగం, అందులో నీటి బుగ్గ ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. వెంటనే స్వామికి ధూప, దీప, నైవేద్యాలను ఏర్పాటు చేయించారు. బుగ్గ లింగేశ్వరుని ఆలయం పక్కనే మరో ఆలయంలో ఇంకో శివలింగం దర్శనమిస్తుంది. బుగ్గ పక్కనున్న శివలింగం కంటే ముందే దీన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. అందుకే ఈ శివుడ్ని వృద్ధ లింగేశ్వరుడు అంటారు. తర్వాత కాలంలో కాశీ నుంచి తెచ్చిన నర్మదా లింగం, టేకు ధ్వజం, నందీశ్వరుడ్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయ అభివృద్ధి కోసం జమీందార్లు మాన్యాలు రాసిచ్చారు.
ఇక్కడ స్వామికి సోమవారాలు మాత్రమే పూజలు నిర్వహించడం అనాదిగా వస్తోన్న ఆచారం. ఇక, శివలింగం పక్కన ఉన్న బుగ్గలో ఎంతనీరు తీసినా అంతే నీరు తిరిగి రావడం ఇక్కడి విశేషం. అన్ని కాలాల్లో ఈ బుగ్గలో నీరు ఉండటమే కాదు, సూర్యరశ్మి సోకకపోయినా ఇక్కడి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. ఈ నీటితో అభిషేకిస్తే స్వామి కరుణిస్తాడని భక్తుల నమ్మకం. గతంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు సరకుల కోసం మోర్జంపాడు వెళ్లి ఆలయం మీదుగా తిరిగి వెళ్లేవారు. మధ్యలో దాహం వేస్తే బూరతో బుగ్గలో నీరు నింపి శివుడ్ని అభిషేకించి, తర్వాత మరోసారి బూరతో నీళ్లు తీసుకుని తాగి వెళ్లేవారట.
హరిహర క్షేత్రం..
గర్భగుడిలో స్వామి వారి పక్కన వీరభద్రస్వామి, భద్రకాళి అమ్మవారి విగ్రహాలను చేర్చారు. ప్రాకారం లోపల బుగ్గమల్లేశ్వర స్వామికి ఉత్తరంగా వృద్ధ మల్లేశ్వర స్వామి, శ్రీశైలంలో మాదిరిగా వాయువ్యంలో ఎత్తైన ప్రదేశాన భ్రమరాంబ అమ్మవారు కొలువై ఉన్నారు. దక్షిణం వైపున సీతారామస్వామి ఆలయం, దానికి ఎదురుగా ప్రాకారం బయట ఆంజనేయ స్వామి మండపం ఉన్నాయి. ఆలయానికి ఆగ్నేయంగా నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. ఈ పుట్ట వద్ద స్వామిని తలచుకుని నమస్కరిస్తే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఆంజనేయస్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు. బ్రహ్మదూత రామానంద సరస్వతి ఈ ఆలయాలను సందర్శించి ఇవి రుషి ప్రతిష్ఠితాలనీ, తపస్సు చేసుకునేవారికి అనుకూల ప్రదేశాలనీ చెప్పారట. ఆలయం మొత్తం రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమై ఉంది. గుడి ప్రహరీలో శివరాత్రి రోజు దీపాలు పెట్టేందుకు వీలుగా గూళ్లు ఏర్పాటు చేశారు. కోవెలలో రెండు కోనేర్లు కనిపిస్తాయి. ఆలయానికి ఉత్తర వాహినిగా కృష్ణానది ప్రవహిస్తుంది.
పూర్వం ఈ ప్రాంతంలో మునులు తపస్సు చేసుకునే వారని ప్రతీతి. ఏటా మహా శివరాత్రి సందర్భంగా పిడుగురాళ్ల, మోర్జంపాడు గ్రామపెద్దల సహకారంతో పూజలు నిర్వహించి అన్నదానం చేస్తారు. ఈ సందర్భంగా ఉచిత రవాణా కల్పిస్తారు. మోర్జంపాడుకు చెందిన మండాది హరనాథబాబు వంశీయులే పూర్వం నుంచీ ఇక్కడ వార పూజ నిర్వహిస్తున్నారు. ఆయనే ఆలయానికి మట్టి రహదారిని ఏర్పాటు చేయించి, దాతల సహకారంతో నవగ్రహ మండపం, యాగశాలలను నిర్మించి, నీటి సౌకర్యం కల్పించారు. ఆలయానికి చేరుకోవాలంటే గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరి, అక్కడి నుంచి మోర్జంపాడు మీదుగా 20 కిలోమీటర్లు ఆటోలూ ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణించొచ్చు. రాత్రివేళ ఇక్కడ బస చేసేందుకు వీలు లేదు. పిడుగురాళ్లలో ఉన్న హోటళ్లలో ఉండవచ్చు.
---ఆధారం : ఈనాడు - ఆదివారం.....సౌజన్యంతో....