header

Sri Kpoteswaralayam / శ్రీకపోతేశ్వరాలయం, చేజెర్ల, నరసరావుపేట మండలం, గుంటూరు జిల్లా

స్థలపురాణం : మాంధాత కుమారుడైన శిబి చక్రవర్తికి ఇద్దరు సోదరులు. మేఘదాంబరుడు మరియు జీమూతవాహనుడు. మేఘదాంబరుడు అన్న అనుమతితో తీర్థయాత్రలకు 1500 మంది పరివారంతొ దక్షిణదేశానికి బయుదేరుతారు.పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ నదులలో స్నానం చేస్తూ ఈ ప్రాంతంలోని ఒక కొండపై కొందరు యోగులతో కలసి తపమాచరిస్తాడు. కొంతకాలం తరువాత మరణిస్తాడు.
అతడి శరీరాన్ని దహనం చేయగా శివభక్తుడగుటచేత అతని శరీరం భస్మం లింగరూపం ధరిస్తుంది. అన్న తిరిగి రానందున అతని తమ్ముడు జీమూతవాహనుడు ఇక్కడికి వచ్చి విషయం తెలుసుకొని తను కూడా తపమాచరించి మరణించి లింగరూపం ధరిస్తాడు. సోదరుల విషయం తొసుకొని శిబి చక్రవర్తి ఇక్కడకు వచ్చి నూరు యజ్ఞాలను చేయటాని సంకల్పించి 99 యజ్ఞాలను పూర్తిచేసి 100వ యజ్ఞం జరిపించు చుండగా శిబి చక్రవర్తిని పరీక్షింపగోరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శివుడు వేటగానిగా, విష్ణువు కపోతం లాగా, బ్రహ్మ బాణంగా మారతారు. శివభగవానుడు కపోతాన్ని వెంటాడుతాడు
కపోతం శిబి యొక్క శరణు కోరుతుంది. శిబి చక్రవర్తి ఆ పావురానికి అభయమిస్తాడు. అక్కడకు వేటగాడు వచ్చి ఆ పావురాన్ని తనకు ఇవ్వకుంటే తన కుటుంబం ఆకలితో అలమటిస్తుందని ఆ పావురాన్ని ఇవ్వమని కోరతాడు. అప్పుడు శిబి చక్రవర్తి ఆ పావురాన్ని ఇవ్వడానికి ఇష్టపడక తన శరీరంలో కొంతభాగాన్ని కోసి పావురాని ఒక ప్రక్క ఇంకొక పక్క పావురానిన త్రాసులో ఉంచుతాడు. కాని ఎంత తన శరీర భాగాలు వేసినా త్రాసు తూగదు.
చివరకు శిబి చక్రవర్తి తన తలను నరికించి ఆ త్రాసులో పెట్టిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు ఇతని త్యాగశీలతకు మెచ్చి అతనిని తిరిగి బ్రతికించి వరం కోరుకొమ్మన్నాడు. శిబి చక్రవర్తి తనకు తన పరివారానికి కైలాస ప్రాప్తి కోరుకొన్నాడు. తన పరివార సమేతంగా తమందరి శరీరాలు లింగాలుగా కావాలని కోరతాడు. అలా తలలేని మొండెమే కపోతేశ్వర లింగంగా మారిందని స్థలపురాణం.
ఈ స్థలానికి సంభందించి బౌద్ధజాతక కథలు కూడా ఉన్నాయి.
ఆలయ నిర్మాణం : చేజెర్ల గ్రామానికి వాయువ్యదిశగా ఈ ఆలయం తూర్పుముఖంగా ఉంటుంది. దేవాలయంలో నగర, వెసర, ద్రవిడ నిర్మాణ రీతులు కలసి ఉన్నాయి. ప్రాకారం లోపల అనేక చిన్న చిన్న గుడులున్నాయి. ఇంతే కాకుండా రాళ్ళలో తొలచిన చిన్న చిన్న గుడులను కూడా చూడవచ్చు. రెండు రాతిపలకల మీద ఒకో దాని మీద వెయ్యు చొప్పున శివలింగాలున్నాయి.గర్భగుడి లోపల తలలేని శరీరాకృతిలో ఉన్న కపోతేశ్వర లింగం దర్శనమిస్తుంది. లింగంపై ప్రక్క రెండు రంధ్రాలున్నాయి. కుడి ప్రక్క రంధ్రంలో ఒక పాత్రకు సరిపడా జంల పడుతుంది. మరొక రంధ్రంలో ఎంత నీరు పోసినా గాని తిరిగి రాదు.
కపోతేశ్వరాలయంలో 9 శాసనాలున్నాయి. అందులో రెండు చారిత్రకంగా చాలా ప్రాముఖ్యత కలిగినవి. అందులో మొదటిది పల్లవరాజు 1వ మహేంద్రవర్మ దేవునికి ఇచ్చినా కానుకల గురించి ఉన్నది. మరొక శాసనం ఆనందగోత్ర రాజు కందారుడు ఇచ్చిన కానుక గురించి.
విజయనగరపు శాసనాలు : క్రీ.శ.1517లో దేవాలయానికిచ్చిన 12 పుట్టీ భూమి మరియు 12 వరహాలు ఇచ్చినట్లు వ్రాసిఉన్నది. సాళువ తిమ్మరుసు సేవలకు మెచ్చి నిత్యసేవకు అవసరమైన సంబరాలు, కొన్ని పన్నులు మినహాయింపు గురించి ఉన్నది. ఇంకొక శాసన కాలం క్రీ.శ.1518 శ్రీ కృష్ణ దేవరాయల కాలం నాటిది. శ్రీకృష్ణదేవరాయలు కొండవీటి యుద్ధంలో విజయం సాధించిన తరువాత దేవాలయ నిత్యనైవేద్యం కొరకు 360 ఎకరాల భూమును ఇచ్చినట్లు తెలుస్తుంది.చేజర్ల, బిట్లపుర, కపోతపురమనే గ్రామాలను ఏర్పాటు చేయటంతో పాటు తన మంత్రులు సాళువ తిమ్మరుసు మరియు రాయసం కొండమరుసయ్య పేర్లమీదుగా చేజర్లలో తిమ్మసముద్రం, కొండసముద్రం అనే రెండు చెరువులను త్రవ్వించారు.
ఎలా వెళ్ళాలి : చేజర్ల కపోతేశ్వరాలయం గుంటూరు జిల్లా నరసరావుట తాలూకా నకిరేకల్లు మండలంలో ఉన్నది. నరసరావుపేటకు పశ్చిమ దిశలో 24 కి.మీ. దూరంలో ఉన్నది. నరసరావుపేట నుండి ప్రతి గంటకు బస్సు చేజెర్లకు వెళతుంది.