header

Kotappakonda / కోటప్పకొండ

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ఆలయం (శివాలయం) గుంటూరు జిల్లా నరసరావుపేట మండంలోని కోటప్పకొండపై కలదు.కొండపైకి బస్‌ ద్వారా గానీ, మెట్ల దారినుండి గానీ వెళ్ళవచ్చును. నరసరావుపేట నుండి 12 కి.మీ. దూరంలో మరియు గుంటూరు జిల్లా చిలకలూరిపేట (విజయవాడ నుండి తిరుపతి నేషనల్‌ హైవే 5) నుండి 13 కి.మీ. దూరంలో ఉన్నది. హైదరాబాద్‌ నుండి 350 కి.మీ విజయవాడ నుండి 90 కి.మీ దూరంలో కలదు. దగ్గరలోని విమానాశ్రయం గన్నవరం (విజయవాడ) దగ్గరలోని రైల్వే స్టేషన్‌ నరసరావుపేట. ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు త్రికోటేశ్వర దేవాలయం, జింకల పార్కు, పక్షుల కేంద్రం, కాళీయ సరస్సు మరియు ధ్యానకేంద్రం.
స్థలపురాణం : హరహరమహాదేవా చేదుకో కోటయ్య చేదుకోవయ్యా అన్ని భక్తి, ఆర్తితో పిలవగానే పాపాలను హరించి భక్తులకు ఇహపర సౌఖ్యాలను ప్రసాదించే దేవుడు శివయ్య. ఏటా లక్షలాది మంది వచ్చే శివరాత్రినాడు భక్తజన నీరాజనాలతో జాగారాలతో దేదీప్యమానమైన ప్రభల వెలుగులతో కన్నుల పండుగగా జరిగే తిరునాళ్ళ దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచినది. ఎటువైపు నుండి చూసినా మూడు శిఖరాలు కనిపించటం చేత త్రికోటేశ్వరస్వామి అని పిలుస్తారు. ఈ మూడు పర్వతాలను బ్రహ్మ, విష్ణు, రుద్ర అనే పేర్లతో పిలుస్తారు.
బ్రహ్మశిఖరం : రుద్రశిఖరానికి కిందిగా నైరుతీ దిశలో బ్రహ్మశిఖరం ఉంది. ఇక్కడ బ్రహ్మ నివసించాడని ప్రతీతి. బ్రహ్మ జ్యోతిర్లింగంకోసం ఈ ప్రాంతంలో శివుని గురించి ఘోర తపస్సుచేసాడని, అపుడు శివుడు ప్రత్యక్షమై బ్రహ్మ కోర్కెను తీర్చేందుకు జ్యోతిర్లింగంగా వెలసాడని అంటారు. ఆ జ్యోర్లింగమే ఇప్పుడు కొలుస్తున్న కోటేశ్వర లింగం.
విష్ణు శిఖరం : ఈ శిఖరం రుద్రశిఖరానికి ప్రక్కగా ఉన్నది. ఇక్కడ విష్ణువు శివుడి గురించి తపస్సు చేసి ప్రసన్నం చేసుకున్నాడు. ఆ వెంటనే ఇంద్రాది దేవతలు ఇక్కడకు వచ్చి తామందరూ దక్షుని యజ్ఞంలో హవిస్సు స్వీకరించినందు వలన దోషపూరితమయ్యామని కనుక లింగరూపంలో దర్శనమిచ్చి దోషాన్ని పోగొట్టమని శివుడ్ని ప్రార్థించారు. అప్పుడు శివుడు తన చేతిలో ఉన్న త్రిశూంతో అక్కడి రాతిపై పొడవగా, ఆ రాతి నుండి నీరు పెల్లుబికింది. శివుడు లింగరూపంలో వెలసాడు. దేవతలు ఆ నీటిలో స్నానం చేసి శివలింగాన్ని ఆరాధించి పాపవిముక్తులయ్యారు. ఆనాటి నుండి శివలింగానికి పాపవినాశ్వేర లింగం అని పేరు వచ్చింది.
సాలంకయ్య కథ : సాలంకయ్య అనే పరమ శివభక్తుడు కొండ దిగువున ఉన్న యల్లమంద అనే గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. సాలంకయ్య రుద్రశిఖరం మీద ఉన్న శివుని పూజిస్తూ తత్ఫలితంగా ధనవంతుడై శివపూజ క్రమం తప్పకుండా సాగిస్తున్నాడు. ఒకనాడు సాలంకయ్య పూజచేస్తుండగా జంగమదేవర ప్రత్యక్షమయ్యాడు. అపుడు సాలంకయ్య ఆయనకు ప్రణమిల్లి తన ఇంటికి విచ్చేసి నివేదన స్వీకరించాల్సిందిగా ప్రార్థించాడు. అందుకు అంగీకరించి ఆయన సాలంకయ్య కోర్కెను తీర్చాడు. జంగమదేవర రూపంలో ఉన్న పరమశివుడు ఆ తర్వాత హఠాత్తుగా కనిపించలేదు. అన్నిచోట్ల వెతికి జంగమదేవర కనిపించక పోవటంచేత ఆహారం మానివేసి సాలంకయ్య శివదీక్ష సాగించాడు.
గొల్లభామ : కోటప్ప కొండకు దక్షిణంవైపున ఉన్న కొండకావూరు అనే గ్రామంలో ఆనందవల్లి అనే గొల్లభామ ఉండేది. ఈమె పరమ శివభక్తురాలు. విభూతి, రుద్రాక్షలు ధరించి శివుడిని ఆరాధిస్తూ పాతకోటేశ్వరుని కొండ వద్ద శివునికి పూజలు చేస్తూ ఉండేది. సాలంకయ్యకు కనిపించిన జంగమయ్య ఈమెకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఒకనాడు ఆనందవల్లి కుండతో అభిషేకానికి నీరు తెచ్చి అక్కడ పెట్టి మారేడు దళాలకోసం వెళ్ళింది.అప్పుడు ఒక కాకి ఆ కుండపై వాలగా ఆ కుండ బోర్లాపడి అభిషేకజలం అంతా ఒలికిపోయింది.
అప్పుడు ఆనందవల్లి ఇక్కడకు కాకులు రాకుండు గాక అని శపించినది. ఆ శాప ఫలితంగా ఇక్కడ కాకులు కనిపించవు. జంగమదేవర ఆనందవల్లి సేవకు సంతృప్తిచెంది జ్ఞానోపదేశం చేశాడు. ఆమెను ఎలాగైనా కొండకు రాకుండా చేసి సాధరణ స్త్రీలా జీవితం గడిపేలా చేయాలని జంగమదేవర భావించాడు. కాని ఆనందవల్లి దైవచింతనకు లొంగిపోయింది. జంగమయ్య ఆమెకు మాయా గర్భం కల్పించాడు.
కానీ ఆమె కొండకు రావటం మానలేదు. దీంతో ఆనందవల్లిని కొండకు రావద్దని నీవెంట నేనే వస్తాను అయితే నీవు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని ఆనందవల్లిని ఆదేశించాడు.. ఆనందవల్లి నడుస్తుండగా ఆమె వెనుక ప్రళయధ్వనులు వినిపించాయి. పరమశివుడు రుద్రశిఖరం నుండి బయుదేరాడు. అలా బ్రహ్మశిఖరం వద్దకు వచ్చేసరికి ఆనందవల్లి నిబ్బరాన్ని కోల్పోయి వెనక్కు తిరిగి చూసింది. వెంటనే శివుడు నీవు వెనక్కి తిరిగి చూదవద్దని చెప్పినా చూశావు కనుక నీవెంట ఇక నేను రాను ఇక్కడే సమాధి నిష్టలో ఉంటాను అని బ్రహ్మశిఖరంపై ఉన్న ఒక బిలంలో నిలిచిపోయాడు. ఆ ప్రదేశమే నేటి కోటేశ్వరస్వామి వారి ఆలయం.
జంగమయ్య మాటు విన్న ఆనందవల్లి అక్కడే నిలిచిపోయి శివైక్యం పొందింది. ఆ తర్వాత సాలంకయ్య ఆనందవల్లిని వెతుకుతూ బ్రహ్మశిఖరం దగ్గర ఉన్న గృహ దగ్గరకు వస్తాడు. అప్పుడు జంగమదేవర కనిపించి నేనే నీ ఇంట పాలను ఆరగించిన పరమశివుడ్ని. ఆనందవల్లి వ్రతసమాప్తి అయినది. ఈ గృహమీద ఒక దేవాలయాన్ని నిర్మించి త్రికోటేశ్వర లింగాన్ని ప్రతిష్టించి పూజిస్తూ ఉండు. ఉత్సవదినాల్లో ఓంకార నదిలో స్నానంచేసి నన్ను అభిషేకించి ఉపవాస జాగారం చేసి ఆ మరునాడు అన్నదానం చేయి. ఆనందవల్లి నా భక్తురాలు. ఆమెను దర్శించిన తరువాతనే నన్ను దర్శించేలాగు గుడి కట్టించి ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించు అని చెప్పి అంతర్థానమయ్యాడు. జంగమయ్య ఆదేశానుసారం సాలంకయ్య గ్లొభామ మరియు త్రికోటేశ్వర విగ్రహాలను ప్రతిష్టించి ఉత్సవాలను చేయటం ప్రారంభించాడు.
పర్యాటక కేంద్రంగా ...
కోటప్పకొండ పుణ్యక్షేత్రమే కాకుండా పర్యాటక ప్రదేశంగా కూడా పేరుపొందింది. కొండపైకి ఘూట్‌రోడ్డు నిర్మాణం పూర్తి అయిన తర్వాత అత్యంత సుందరప్రదేశంగా మారింది. పూలతోటలు, జింకల పార్కు, పక్షుల పార్కుతో పర్యాటకులను అలరిస్తుంది. ఎక్ట్రానిక్‌ పరికరాల ద్వారా తల, తోక కదిలించే రాక్షసబల్లులను ఇక్కడ ఏర్పాటు చేశారు. కాళీయమర్థనం సరస్సులో బోటు షికారు చేయవచ్చు. ఇక్కడ గెస్ట్‌హౌస్‌ మరియు ఫలహారశాలను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకు టాయ్‌ ట్రైన్‌ను కూడా త్వరలో ఏర్పాటు చేయనున్నారు.
ఇతర ప్రత్యేకతలు : కొండపై అభిషేక మండపాన్ని నిర్మించి దానికి సాలంకయ్య అని పేరు పెట్టారు.ఆనందవల్లి అనే సత్రాన్ని కూడా నిర్మించారు. టిటిడి వారు 30 గదుల సత్రాన్ని నిర్మించారు. ఇంకా నాగేంద్ర పుట్ట సమీపంలో ధ్యానమందిరాన్ని నిర్మించారు. ఇక్కడ ధ్యానముద్రలో ఉన్న భారీ శివుని విగ్రహాన్ని చూడవచ్చు.