కడపరాయినిగా పేరుపొందిన కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయం... దేవుని కడప తిరుమలకు తొలి గడప. ఒకప్పుడు కడపనుండి తిరుమల వెళ్లే భక్తులు కడపలోని శ్రీలక్ష్మీవేంకటేశ్వర స్వామిని తప్పక దర్శించుకునే తరువాత తిరుమలకు వెళ్లేవారు. అందుకే తాళ్లపాక అన్నమయ్య ‘కాదనకు నామాట కడపరాయ నీకు- గాదె బోసెవలపులు కడపరాయా...’ అంటూ కీర్తిస్తాడు.
కడప రాయడిని దర్శించుకునేందుకు కేవలం హిందూ భక్తులే కాదు, ముస్లింలు కూడా రావడం ఈ ఆలయానికున్న ప్రత్యేకత. శ్రీనివాసుడు తమ ఇంటి ఆడపడుచు బీబీ నాంచారమ్మను వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు స్థానిక ముస్లింలు.
ప్రతి తెలుగు సంవత్సరాది రోజున ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తారు. బియ్యం, గారెలు, కొబ్బరికాయలూ తెచ్చి స్వామివారికి సమర్పిస్తారు. వెంకన్నను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నాక సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు.
సాధారణంగా మన ప్రసాదం ఇతర మతస్థులు స్వీకరించరు. కానరీ ఇక్కడ మాత్రం హిందూ భక్తులతోపాటే ముస్లింలు కూడా తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచీ ఈ సంప్రదాయం కడప ఆలయంలో సాగుతోంది. ఉగాది రోజున కడప వెంకన్నను దర్శించి కానుకలు సమర్పిస్తే ఏడాదంతా తమకు మంచే జరుగుతుందని అక్కడి ముస్లిం భక్తుల విశ్వాసం.
చూడచక్కని శిల్ప సంపద....
కడప లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ శిల్ప సౌందర్యం చూడాల్సిందే. విజయనగర రాజుల కాలంలో మంటపం నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడి తాండవ గణపతి రూపం అతిమనోహరం. స్థానిక రాజులే కాక నవాబులు, ఆంగ్లేయుడైన సర్ థామస్ మన్రో సైతం ఆలయ పునర్నిర్మాణానికీ మరమ్మతులకూ సహకరించినట్లు ఆధారాలున్నాయి. స్వామి గర్భగుడి వెనుక ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖమై ఉంటుంది.
తిరుమల క్షేత్రపాలకుడు వరాహస్వామి కాగా ఇక్కడి క్షేత్ర పాలకుడు హనుమంతుడు. స్వామి వక్షస్థలంపై కుడివైపున శ్రీవత్స చిహ్నంతో మహాలక్ష్మీమూర్తి ఉండడం విశేషం. మూల విరాట్టు విగ్రహంపైన సుందరంగా చెక్కిన యజ్ఞోపవీతాలూ నాలుగు కంఠాభరణాలూ కనిపిస్తాయి.
విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర, బుక్కరాయలూ సాళువ వంశీయుడైన నరసింహరాయలూ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలూ స్వామికి మడిమాన్యాలూ ఆభరణాలూ సమర్పించినట్లు ఆలయంలోని రాతి శాసనాల ద్వారా తెలుస్తోంది. గర్భాలయానికి ఎడమ వైపున అమ్మవారి మందిరం ఉంది. విష్వక్సేన మందిరం, నాగుల విగ్రహాలు, వినాయకుడు, ఆండాళ్లమ్మ మందిరం, శమీవృక్షం, ధనుర్మాసాది మంటపం, వేంకటేశ్వర స్వామికి ఎదురుగా ఆంజనేయ స్వామి మందిరం సైతం ఉండడం ఈ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయానికున్న ప్రత్యేకత.
ఆలయ ప్రాంగణంలో పుష్కరిణి ఉంది.. నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఈ పుష్కరిణిలోనే స్వామివారి తెప్పోత్సవం, చక్రస్నానాది కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఈ ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతాయి సాగే స్వామి రథోత్సవాన్ని అన్నమయ్య కూడా తన కీర్తనలలో బ్రహ్మోత్సవాలు గురించి కీర్తించాడు
కడపరాయిని రథోత్సవం సమయంలో కూడా కులమతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు రధాన్ని లాగి దేవేరీ సహితుడైన కడపరాయడిని దర్శించుకుంటారు.
ఆలయం తెరచి ఉంచే సమయాలు
ఆది వారం నుండి శుక్రవారం వరకు ఉదయం 06-00 గంటలనుండి మధ్యాహ్నం 12-30 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 03-30 నుండి రాత్రి 08-00 గంటల వరకు తెరచి ఉంటుంది.
శనివారం మాత్రం ఉదయం 08-00 గంటలనుండి సాయంత్రం 08-30 నిమిషాల వరకు తెరచి ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?....
కడప రైల్వే స్టేషన్ నుండి 7 కి.మీ.దూరంలోను, బస్ స్టేషన్ నుండి కేవలం నాలుగున్న కిలో మీటర్ల దూరంలో ఉన్నది.