Parasuramalayam…Treteswara Swamy Temple…Attirala…త్రేతేశ్వర స్వామి....పరశురామాలయం.. అత్తిరాల
మనోహరమైప ప్రకృతి ఒడిలో ఉన్న క్షేత్రం త్రేతేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఒకవైపు హత్యరాల మడుగు, మరోవైపు గధాధర స్వామి ఆలయం ఉన్నాయి. దూర ప్రాంతాలకు సైతం కనిపించే దీపపుస్తంభం ఇక్కడ మరో ప్రత్యేక ఆకర్షణ.
సత్యయుగంలో శ్రీ పరశురాముని తండ్రి జమదగ్నిని కార్తవీరార్జుని కుమారులు సంహరించగా ....... కోపోద్రేకుడైన పరశురాముడు ఇరవై ఒక్కసార్లు క్షత్రీయులపై దండెత్తి వారిని సంహరిస్తాడు. రక్తపాతం జరపడం వల్ల.. ఆయనకు పాపం చుట్టుకుంటుంది. దాంతో ఆయన గొడ్డలి చేతికి అంటుకొని రాలేదు.
పాపపరిహారార్ధం పరశురాముడు, మహేశ్వరుడి ఆజ్ఞమేరకు పుణ్యనదులలో స్నానం చేస్తూ... పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకూంటూ చివరకు అత్తిరాల ప్రాంతానికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలోనే వున్న బహుదా నదిలో స్నానం చేయగానే.. ఆయన చేతిలో వున్న గొడ్డలి వేరుపడుతుంది.
పరశురామునికి చుట్టుకున్న హత్యపాపం పోవడంతో.. ఆ ప్రాంతానికి ‘హత్యరాల’ అనే పేరొచ్చింది. కాలంతంరంలో హత్యరాల ‘అత్తిరాల’గా మార్సుచెందింది.
పురాణ గాధలు
పూర్వం ప్రజాపతులలో ఒకరైన పులస్త్య బ్రహ్మ.. ఈ పవిత్ర క్షేత్రంలో నిత్యం తపం ఆచరించేవాడు.
శివుడు ఇతని తపస్సుకు మెచ్చి వరం కోరుకోమంటాడు. పులస్త్యబ్రహ్మ కోర్కె మేరకు సదాశివుడు ‘‘శ్రీ త్రేతేశ్వర స్వామి’’ అనే నామంతో పర్వతం మీద స్యయంభువుగా వెలిశారు.
దండకారణ్యంలో అంతర్భాగంగా ఉండే ఈ ప్రాంతంలోనే భైరవుడు అనే రాక్షసుడు పరమ శివుడి కోసం ఘోర తపస్సు చేశాడంటారు. శివుడు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అని అడగగా, ‘ఎప్పుడూ మీ పాదాల చెంతే ఉండేలా వరాన్ని అనుగ్రహించ’మని అన్నాడట. అందుకు అంగీకరించి శివుడు భైరవకొండగా మారి తన రాకకోసం ఎదురుచూస్తూ ఉండమని తెలిపాడట. త్రేతాయుగంలో ఈ కొండమీదే నారద, శుక్ర, భరద్వాజ, వశిష్ఠ మహర్షులు చేపట్టిన మహా యజ్ఞం ఫలితంగా మహాశివుడు ఇక్కడ లింగ రూపంలో వెలిశాడు. అందుకే ఇక్కడ స్వామిని త్రేతేశ్వరుడిగా పూజిస్తారు. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. లింగం మీద పుట్ట పెరిగిపోయింది. ఈ ప్రాంతానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని పొత్తాపిని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న ధర్మపాలుడు అనే రాజుకు స్వామి కలలో కనిపించి పుట్టలో ఉన్న లింగాన్నీ, ఉత్తర దిశలో మడుగు వద్ద ఉండే కామాక్షీదేవి విగ్రహాన్నీ ఒకే దగ్గర ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించాడట. మరుసటిరోజు ఉదయం పుట్టదగ్గరకు చేరుకున్న రాజు జాగ్రత్తగా దాన్ని తవ్వించి లింగాన్ని బయటకు తీసి, ఆ ప్రదేశంలోనే కామాక్షీ దేవి సమేతంగా త్రేతేశ్వర స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం తెలియజేస్తోంది.
ఈ ప్రాంగణంలోనే నందీశ్వరుడు, పంచ శివలింగాలు, శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ మండపం, చండీశ్వరుడి విగ్రహాలూ కొలువుదీరి ఉన్నాయి
సప్త మహర్షులలో ఒకరైన భ్రగుమహర్షి ఈ పుణ్య స్థలంలో తపస్సు చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకున్నారు. భ్రగు మహర్షి కోరిక మేరకు శ్రీహరి తన పాదాన్ని అత్తిరాలలో వుంచి.. ‘‘శ్రీ గదాధర స్వామి’’గా వెలిశారు.
ఈ అత్తిరాల ప్రాంతానికి ‘‘దక్షిణ గయ’’ అనే పేరు కూడా వుంది. ఎందుకంటే.. పూర్వం చనిపోయిన రక్త సంబంధీకులు ఎవరైనా చెయ్యేరు నదిలో పిండ ప్రదానం, తర్పణం... గయలో చేసిన వాటితో సమానమని ప్రతి ఒక్కరు విశ్వసిస్తారు.
పరశురాముని ఆలయం
ఈ అత్తిరాల పరశురాముని ఆలయం ప్రాముఖ్యత గురించి మహాభారతంలోనే ఉదహరించబడింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం నిర్మాణం.. 10వ శతాబ్దంలో చోళరాజుల చేత, తరువాతపాండ్యులు, శాతవాహనులు, కాకతీయులు,
విజయనగర పాలకులు, కాయస్థ వంశం వారు అత్తిరాల ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు సహకారాన్ని అందించారు.
శ్రీ త్రేతేశ్వర, శ్రీ గదాధర, ఇంకా పురాతన ఆలయాలు శిథిలం కావడంతో.. అవి తిరిగి భక్తుల సహకారంతో పునరుద్ధరించారు. ఈ ప్రాంతంలో నలువైపులా శిథిలమైన విగ్రహాలు, నిర్మాణాలు చాలా కనబడుతాయి.
ఆలయ ప్రాంతానికి నలువైపులా కొండలు.. ఒక ప్రక్క చెయ్యేరు నది.. అన్నివైపులా ఆలయాలతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఆధ్యాత్మిక భావనలను కలిగస్తుంది..
ఎలా వెళ్ళాలి ?
హత్యరాల త్రేతేశ్వరస్వామి ఆలయానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. కడప నుంచి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి బస్సు సౌకర్యం ఉంది. ప్రత్యేక రైళ్లు మినహా దాదాపు అన్ని రైళ్లూ రాజంపేట రైల్వే స్టేషన్‌లో ఆగుతాయి. అక్కడి నుంచి నేరుగా ఆటో ద్వారా కానీ, పాతబస్టాండు నుంచి బస్సులో ప్రయాణించీ స్వామిని దర్శించుకోవచ్చు
మహాశివరాత్రిలాంటి పర్వదినాల్లో, ఉత్సవాలు జరిగే రోజుల్లో ఆలయానికి చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు నడుపబడతాయిS.