header

Pushpagiri Temple / పుష్పగిరి

Pushpagiri Temple / పుష్పగిరి
పుష్పగిరి హరి హరుల మధ్య అభేద్యాన్ని చాటిన పవిత్ర క్షేత్రం కడప జిల్లాలోని పుష్పగిరి. రెండో హంపిగా పేరున్న పుష్పగిరిలో ఒకప్పుడు 108 శివాలయాలు ఉండేవంటారు. వైద్యనాథేశ్వర, త్రికూటేశ్వర, భీమేశ్వర, కామాక్షి, చెన్నకేశవస్వామి ఆలయాలు ప్రధానమైనవి. చోళుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయం తరువాత కాకతీయులు, విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి చేయబడింది.
చరిత్ర
పుష్పగిరి స్ధానంలో పూర్వం కాంపల్లె అనే గ్రామం ఉండేది. పల్లె దగ్గరలోనే మంచి నీటి సరస్సు కూడా ఉండేది. గరుత్మంతుడు తన తల్లి శాప విమోచనార్ధం స్వర్గం నుంచి అమృత కలశం తీసుకొస్తుండగా అమృతకలశం తొణికి అందులో నుండి ఓ బిందువు సరస్సులో పడిందంటారు. ఈ ప్రభావంతో సరస్సు మొత్తం సంజీవనీ జలమైంది. అటుగా వెళుతున్న ఓ వృద్ధ రైతు తన ఎద్దులను సరస్సులోని దింపి నీళ్ళు తాగిస్తాడు. అమృత ప్రభావంతో ముసలి ఎద్దులు కాస్తా కోడె గిత్తలుగా మారతాయి. రైతు ఆశ్ఛర్యంతో తానూ కూడా నీళ్ళు తాగుతాడు. మరుక్షణం యువకుడుగా మారతాడు. ఈ విషయం తెలిసి ఊరిలోని జనమంతా సరస్సులో మునకలేసి యవ్వనవంతులుగా మారిపోతారు. ఈ విషయం దేవతలకు తెలిసి ఆంజనేయస్వామిని పిలచి సరస్సును పెద్ద కొండతో మూసి వేయమని చెబుతారు. ఆంజనేయ స్వామి సరస్సు మీద మీద పెద్ద కొండను వేయగా అది నీటిలో పూవులా తేలిపోతుంది. దీనితో త్రిమూర్తులు రంగలోకి దిగి సరస్సును పూడ్చివేస్తారు. అప్పటి నుండి నీళ్లలో పూవులాగా తేలిన కొండ అనే అర్ధంతో ఈ ప్రాంతాన్ని పుష్పగిరి అని పిలవటం ప్రారంభించారు.
కొండమీదున్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని, కొండకింద ఉన్న వైద్యనాథేశ్వరస్వామి ఆలయాలను జనమేజయ మహారాజు నిర్మించాడని అంటారు.
శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరి దేవాలయాన్ని దర్శించుకొన్నాడు. ఆది శంకరాచార్యులు పుష్పగిరి పీఠంతో పాటు శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. పరమేశ్వరుడు జగద్గురువుకు ప్రపసాదించిన మహిమాన్విత స్పటిక లింగం పుష్పగిరిలో నిత్యపూజలందు కుంటున్నది. వేదఘోషతో కళకళలాడే పుష్పగిరి అగ్రహారం శ్రీ వీరబ్రహ్మం గారి శాపానికి గురైందని చెబుతారు. పర్వటనలో భాగంగా పుష్పగిరికి వచ్చిన బ్రహ్మం గారిని అగ్రహారికులు అవమానిస్తారు. దాంతో ఆయన అగ్రహాంతో పుష్పగిరి వైభవమంతా నాశనమవుతుందని శపిస్తాడు. మరలా ఈ క్షేత్రంలో కాకి కనిపించేంత వరకు మర్రిమాను కనబడేంతవరకు శాపవిమోచనం లేదని చెబుతాడు. దీంతో దాదాపు 200 సంవత్సరాలపాటు చెన్నకేశవస్వామి ఆలయం ప్రాభవాన్ని కోల్పోతుంది. పందొమ్మిదవ శతాబ్ధం నుండి తిరిగి అభివృద్ధి బాటలోకి వచ్చింది. పుష్పగిరి ఆర్యవైశ్వ సత్రంలో ప్రస్తుతం ఒక మర్రిచెట్టు పెరుగుతుంది. పుష్పగిరికి పూర్వవైభవం తిరిగి వస్తుందని భక్తుల నమ్మకం.
బ్రహ్మోత్సవాలు
పుష్పగిరిలో ఏటా చైత్రబహుళ త్రయోదశి నుంచి వైశాఖ శుద్ధ పంచమి వరకూ తొమ్మిది రోజుల పాటు వైద్యనాథేశ్వర, చెన్నకేశవ స్వామి వార్లకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్షయ తదియ (ఏప్రియల్ నెలలో) రోజునుండి మూడురోజుల పాటు తిరునాళ్ళు జరుగుతుంది.
ఎలా వెళ్ళాలి ?
కడప నుండి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న పవిత్ర పినాకినీ నదీతీరంలోని పుష్పగిరిలో ఈ ఆలయం ఉన్నది.