ఇక్కడి ప్రధాన ఆలయం వేణుగోపాలస్వామి గుడి. దీనిని 1250 ప్రాంతంలో కాకతీయ గణపతి దేవుడు అభివృద్ధి చేశాడని చరిత్ర. పశ్చిమ కనుమలలోని మహాబలేశ్వర్‌లో పుట్టిన కృష్ణానది మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రా గుండా ప్రవహిస్తూ మనరాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కృష్ణాజిల్లాలోని పులిగడ్డవద్ద రెండు పాయలుగా చీలిపోతుంది. కుడిపాయ నాగాయలంక వైపు, ఎడమపాయ కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
కృష్ణానది సముద్రంలో కలిసే ఈ ప్రాంతాన్నే సాగరసంగమం అంటారు. గంగానది మనుషుల పాపాలతో కల్మషమైపోయి పాపభారాన్ని మోయలేక తన బాధను విష్ణుమూర్తితో మొరపెట్టుకున్నదట. పాపానికి చిహ్నంగా నలుపు రంగును ధరించి కాకిగా మారి నదుల్లో మునుగుతూ వెళ్ళు. ఎక్కడైతే నీ నలుపు రంగు పోయి తెలుపుగా మారాతావో అప్పటితో నీ పాపాలు పోతాయి అని చెప్పాడట శ్రీహరి.
అలా గంగానది కాకి రూపు ధరించి నదుల్లో స్నానం చేస్తూ హంసలదీవిలోని సాగరసంగమంలో స్నానం చేయగానే నలుపురంగు పోయి తెల్లగా హంసలా మారిపోయిందట. అలా ఈ ప్రాంతానికి హంసలదీవి అని పేరు వచ్చిందంటారు.
ఆదివారాలు, సెలవు రోజుల్లో సూదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఏటా మాఘమాసంలో రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది భక్తులు ఈ సాగర సంగమంలో పుణ్యస్నానాలు చేస్తారు. మాఘమాసంలో చేసే మాఘస్నానం మంచిదంటారు. ఈ సమయంలో సూర్యోదయ వేళల్లో సూర్యకిరణాలు ప్రత్యేక కోణాలలో భూమిపై ప్రసరిస్తాయి. అందువలన సాధారణ సూర్యకిరణాల కంటే వీటి సాంద్రతలో చాలా తేడా ఉంటుందంటారు. ఈ కిరణాలు నీటిపై పడటం వన ఆ నీరు చాలా శక్తివంతమవుతుందంటారు. అందుకే మాఘమాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా మంచివంటారు.
మాఘమాసం సూర్యసంబంధమైన అర్చనామాసం. ఈ నెలలో ఆదివారం చాలా పవిత్రమైనది. ఈ రోజున తలారా స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించాలి.
ఎలా వెళ్లాలి ? : విజయవాడ నుండి అవనిగడ్డకు అక్కడనుండి కోడూరుకు (13 కి.మీ) వెళ్లాలి, కొడూరు నుండి ఉల్లిపాలెం మీదుగా 10 కి.మీ వెళ్తే హంసలదీవి వస్తుంది అక్కడ నుండి 5 కి.మీ దూరంలో సాగరసంగమం ఉంది.