header

Mopidevi Subrahmanyeswara Swamy Temple / మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.

Mopidevi Subrahmanyeswara Swamy Temple / మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.
bhavani mukteswara swamy temple శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఒకేచోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం కృష్ణా జిల్లాలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం.
పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలసిన కార్తికేయుడు నిజంగా భక్తులపాలిట కొంగుబంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగులచవితి రోజున ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచీ లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఇక్కడి పుట్టకు విశేషపూజలు నిర్వహిస్తారు
మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి సుమారు అయిదు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కందపురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలశాడని పురాణాలు చెబుతున్నాయి. సర్పాకృతిలో తనయుడైన కుమారస్వామీ లింగాకృతిలో శివుడూ కొలువై ఉండటం వల్ల ఈ క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. రాహు, కేతు, సర్పదోషాలను నివారించే ఇలవేలుపుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు.
స్థలపురాణం...
ఇంద్రాది దేవతల ప్రార్థనలను మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితుడై కాశీ పట్టణాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలోని మోహినీపురంలో సేదతీరుతుండగా జాతివైరాన్ని మరచి పాము, ముంగిస, నెమలీ ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కనే దివ్యతేజస్సును విరజిమ్ముతూ ఉన్న ఒక పుట్ట ఆయన దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూడగా కార్తికేయుడు సర్ప రూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు.
దివ్యదృష్టితో కార్తికేయుడి రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఓ శివలింగాన్ని ఏర్పాటుచేసి ఆరాధించాడు. ఇది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడికి కలలో కనిపించి, తాను పుట్టలో ఉన్నాననీ, తనను బయటకు తీసి ఆలయాన్ని నిర్మించమనీ ఆజ్ఞాపించాడట. స్వప్నవృత్తాంతాన్ని పెద్దలకు తెలియజేసిన పర్వతాలు స్వామి అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించి, షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి మహిమలను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులూ, చల్లపల్లికి చెందిన యార్లగడ్డ రాజవంశీయులూ ఆలయ అభివృద్ధికి విశేష కృషిచేశారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధిచెందింది.
లింగరూపంలో..
తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో ఆరేడు సర్పాల చుట్టలపై శివుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామిగా పూజలందుకుంటున్నాడు. దీన్నే పానపట్టం అని కూడా అంటారు. ఆలయ ప్రదక్షిణమార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. పుట్ట నుంచి గర్భగుడిలోకి దారి ఉందనీ, ఆ దారిలోనే దేవతా సర్పం సంచరిస్తుందనీ భక్తుల నమ్మకం. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు.
పుట్ట బంగారం...
సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్ప రూపంలో పుట్టలో కొలువై ఉన్నాడని భక్తుల విశ్వాసం. నాగుల చవితి రోజున పుట్టదగ్గరకు వెళ్లి ఆయన్ను పూజిస్తే సంతానం లేనివారికి పిల్లలు పుడతారని ఇక్కడివారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానానికి సంకేతం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ఆరాధించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.
అర్చనలూ... ఉత్సవాలూ...
దీపావళి అనంతరం వచ్చే నాగులచవితితోపాటు నాగపంచమి పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తులు పుట్టలో కొలువైన సుబ్రహ్మణేశ్వరుడికి పాలుపోసి, క్షీరాన్నాన్ని నివేదిస్తారు. వల్లీదేవసేనా సమేతుడైన స్వామికి ఇక్కడ నిత్యశాంతి కల్యాణం జరుగుతుంది. మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, సాధారణ అభిషేకాలు, వూయల సేవలు, రాహు - కేతు - సర్పదోష పూజలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే రజత బిల్వార్చన మరింత ప్రత్యేకం. మాఘమాసంలో షణ్ముఖుడికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక దీపోజ్వలన, ఆరుద్రోత్సవాలు, ఏటా ఆషాఢమాసంలో ఆడికృత్తిక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారులకు చెవిపోగులు కుట్టించడం, బారసాల, అన్నప్రాశన, అక్షరాభ్యాసం, నామకరణం లాంటి క్రతువులకు ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఎలా వెళ్లాలి?....
విజయవాడకి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి ఉయ్యూరు, పామర్రు మీదగా ప్రయాణించి స్వామివారిని దర్శించుకోవచ్చు
కరకట్ట మీదుగా తక్కువ సమయంలో ఈ ఆలయాన్ని చేరుకునేందుకు మరో కొత్త రహదారిని కూడా ఏర్పాటుచేశారు. విజయవాడ నుంచి యనమలకుదురు మీదుగా బస్సు ప్రయాణం సాగుతుంది. మచిలీపట్నం, గుడివాడ నుంచి కూడా బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.