header

Movva Venugopala Swamy

మువ్వ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం : కృష్ణా జిల్లా మువ్వ గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. మువ్వ గ్రామం కవి క్షేత్రయ్య జన్మస్థలం కూడా.
ద్వాపర యుగంలో కార్తీకపౌర్ణమి రోజున రాధా కృష్ణులు నాట్యం చేయుచుండగా కృష్ణని పాదం నుండి మువ్వ జారి ఈ ప్రదేశంలో పడిందంటారు. శ్రీకృష్ణుని ఆనతి మేరకు నారదుడు ఇక్కడకు వచ్చి మువ్వకోసం వెదుకగా మువ్వ దొరకలేదు. నారదుడు స్వామివారికోసం తపస్సు చేయగా మువ్వ పడినచోట స్వామి బంగారు కాంతితో దర్శనమిస్తాడు. నారదమహర్షి దేవేంద్రునిచే స్వామి వారు ఏ విధంగా దర్శనమిచ్చారో అదేవిధంగా విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్టిస్తాడు. .
తరువాత నదీప్రవాహానికి విగ్రహంపై ఇసుక మేటవేసి కప్పబడుతుంది. స్వామి పాదం నుండి పడిన మువ్వ మౌద్గల్యునిగా జన్మించి స్వామివారికోసం తపమాచరిస్తాడు. మాఘపౌర్ణమి రోజున మువ్వగోపాలస్వామి స్వయంభువుగా అవతరిస్తాడు. మౌద్గల్యుని మూలంగా వెలసిన స్వామి కనుక మౌవ్య గోపాలునిగా పేరు వచ్చింది. ఈ పేరు తరువాత కాలంలో మువ్వ గోపాలునిగా రూపాంతరం చెందినది. .
15వ శతాబ్ధంలో 14 సంవత్సరాల వరదయ్య (కవి క్షేత్రయ్య) స్వామిని ఆరాధించి స్వామి సాక్షాత్కారం పొందుతాడు. ఓనమాలు కూడా రాని వరదయ్య నాలుకపై స్వామి బీజాక్షరాలు లిఖించగా వరదయ్య మువ్వగోపాల మకుటంచే అశువుగా పదములు చెప్పసాగాడు. స్వామి వారిమీద పదములు అల్లుచూ క్షేత్రములన్నియూ తిరుగుచూ క్షేత్రయ్యగా పేరు పొందుతాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినమందు స్వామివారిలో ఐక్యమౌతాడు. .
ఎలా వెళ్ళాలి ? కృష్ణా జిల్లా మొవ్వ మండలం మరియు గ్రామంలో ఉన్న మువ్వగోపాలస్వామి ఆలయానికి విజయవాడ నుండి బస్సులలో వెళ్ళవచ్చు. విజయవాడ అవనిగడ్డ బస్సులో ఎక్కి మువ్వ గ్రామంలో దిగవచ్చు. విజయవాడ నుండి సుమారు 55 కి.మీ. దూరంలో ఉంటుంది మువ్వ గ్రామం. మువ్వ గ్రామానికి దగ్గరలోని కూచిపూడి నాట్య జన్మస్థలం కూచిపూడి గ్రామం కలదు. ఇంకా ఇక్కడకు దగ్గరలోనే శ్రీకాకుళేంద్ర మహావిష్ణు ఆలయం ఉన్న శ్రీకాకుళం మరియు పార్వతీజలధీశ్వర స్వామి ఆలయం గల ఘంటశాల గ్రామం కలదు