ఈ ఆలయం కృష్ణాజిల్లా ఘంటసాల మండంలోని శ్రీకాకుళం గ్రామంలో కృష్ణానది తీరంలో ఉంది. ప్రసిద్ధి చెందిన 108 పుణ్యక్షేత్రాలో ఇది 57వది గా చెబుతారు. శ్రీకాకుళంలో స్వామివారు స్వయంభువుగా వెలిసాడంటారు. ఈ క్షేత్రం బ్రహ్మదేవుని ప్రయత్నం మేరకు ఏర్పడినదని ఒక కథనం.
శ్రీకాకుళేశ్వరస్వామి ఆలయం, ఉపనిషత్తుల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వరుసగా సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత బాషలు అత్యంత ప్రియమైనవి. అంధ్రభాషపై ప్రీతిగల మహావిష్ణువే శ్రీకాకుళంలో కొలువుతీరాడని పురాణోక్తి.
కలియుగంలో రోజురోజుకూ పాపాలు పెరిగిపోతున్నాయని దేవతలంతా వ్యాకులత చెంది బ్రహ్మదేవునితో సహా భూలోకానికి వచ్చి ఒక ప్రాంతంలో తపస్సు ప్రారంభించారు. ఆ తపస్సుకి మెచ్చి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై భూలోకంలో ఈ ప్రాంతంలోనే మీరు కొలువై భక్తు పాపాలను హరించాలని కోరుకున్నారట. అందుకు నారాయణుడు సమ్మతించడంతో బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీమహావిష్ణువుని అక్కడ ప్రతిష్టించాడట.
ప్రాచీనకాలంలో ఇక్కడికి సమీపంలో నున్న నదీమార్గం ద్వారా వ్యాపారాలు జరుగుతుండేవి. ఈ ప్రాంతంగుండా పోయే నావికులు ఈ దేవాలయానికి వచ్చి స్వామిని దర్శించుకునేవారు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్ధంలోనే ఇక్కడ స్వామివారికి ఆలయం ఉండేదట. ఆతరువాత దాదాపు వెయ్యేళ్ళపాటు స్వామి అదృశ్యమై ఎవరికీ కనిపించలేదట. ఆ తరువాత ఒరిస్సా పాలకుడైన అంగభూపాలుడి ప్రధానమంత్రి నరసింహవర్మ ఓ సారి కాంచీపురానికి వెళుతూ శ్రీ కాకుళానికి వచ్చాడు. ఓ రోజు రాత్రి స్వామి నరసింహవర్మ కలలో కనిపించి వేమశర్మ అనే బ్రాహ్మణుడి ఇంటి ఆవరణలో ఉన్నానని చెప్పాడట. వెంటనే నరసింహవర్మ ఆ ప్రాంతానికి వెళ్ళి తవ్వకాలు జరిపించగా విగ్రహం బయటపడిరది. విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో పున:ప్రతిష్టించినట్లు కథనం.
శ్రీకృష్ణదేవరాయలు - అముక్తమాల్యద : విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు నేటి ఒడిషా మీద దండయాత్ర తరువాత ఈ ప్రాంతం గుండా వెళుతూ ఓ రోజు శ్రీకాకుళంలో బసచేస్తాడు. రాయలకి స్వామి కలలో కనపడి తెలుగులో ఒక కావ్యాన్ని రచించమని ఆదేశిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు అముక్తమ్యాద (గోదాదేవి చరిత్ర) అనే కావ్యాన్ని ఇక్కడే మెదలుపెట్టాడని చెబుతారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ ఆవరణలో 16 స్తంలభా మండపంలో అముక్తమాల్యద రచనను ప్రారంభించారు. ఈ మండపాన్ని అముక్తమాల్యద మండపంగా పిలుస్తారు. ఈ మండపం మధ్యలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని చూడవచ్చు.
ఈ దేవాలయం గోడపై 12, 13వ శతాబ్దానాటి శాసనాలు 30కి పైగా ఉన్నాయి.విజయనగరం పతనానంతరం ఈ ప్రాంతం గోల్కొండ నవాబు పాలనలోకి వెళ్ళింది. ఆ తరువాత దేవరకొండ ప్రభువైన యార్లగడ్డ కోదండరామన్న ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాడని చరిత్ర. ఇప్పటికీ చల్లపల్లి జమిందారులైన యార్లగడ్డ వంశీయులే అనువంశిక ధర్మకర్తలుగా వ్యవవహరిస్తున్నారు.
శ్రీనాధుడు తన క్రీడాభిరామంలోనూ, నారాయణతీర్థుల వారు శ్రీకృష్ణలీలా తరంగణిలోనూ ఆంధ్రమహావిష్ణువుని కీర్తించారు.
ఆలయానికి సమీపంలో ఉన్న కృష్ణానదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకుంటారు భక్తులు. ప్రతీ యేటా వైశాఖమాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారు ఉత్తరద్వారం నుండి దర్శనం ఇస్తారు.
ఎలావెళ్ళాలి : కృష్ణాజిల్లా, విజయవాడ నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. నేరుగా బస్ సౌకర్యం (ఆర్డనరి బస్) కలదు. లేక అవనిగడ్డకు వెళ్ళే బస్‌లో ప్రయాణించి కొడాలి గ్రామం దగ్గర దిగి అక్కడ నుండి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళానికి ఆటోలో కూడా వెళ్ళవచ్చు. కొడాలి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘంటసాల గ్రామంలో అగస్త్య మహర్షిచే ప్రతిష్టించబడిన ప్రసిద్ధి చెందిన శ్రీపార్వతీజలధీశ్వరస్వామి ఆలయం కదు.