header

Sri Durga Nageswara Swamy Temple / శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దేవాలయం - పెదకళ్ళేపల్లి – దక్షిణ కాశి

శ్రీ దుర్గా నాగేశ్వరస్వామి దేవాలయం - పెదకళ్ళేపల్లి – దక్షిణ కాశి : పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ, వినతలు వ్యాహ్యాళికి వెళ్ళగా వారికి ఆకాశంలో ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది. వినత ఆ అశ్యం తెల్లగా ఉందని, కద్రువ లేదు ఆ అశ్వం తోక నల్లగా ఉందని వాదించుకుంటారు. చివరకు ఆ అశ్యం తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని లేదా ఆ అశ్యం తెల్లగా ఉంటే వినతకు కద్రువకు దాస్యం చేయాలని పందెం వేసుకొని ఆ రోజుకు వెళ్ళిపోతారు.

కద్రువ తన సంతానమైన నూరుగురు సర్పాలను పిలిచి మీలో ఎవరైనా వెళ్ళి అశ్యం తోకకు చుట్టుకుని ఆ అశ్యంతోక నల్లగా కన్పించేటట్లు చేయమని అడుగుతుంది. సర్పసంతతి అందరూ తల్లీ ఇది అధర్మం అని ఒప్పుకోరు. అపు కద్రువ మీరంతా జనమేజయుడు చేసే సర్పయాగంలో నశిస్తారని శపిస్తుంది. కాని కర్కోటకడు అనే వాడు మాత్రం తల్లి కోసం ఆమె మాటను పాటించి ఆమెను గెలిపిస్తాడు.
కాని కద్రువ తాను తన పుత్రుల కిచ్చిన శాపంను వెనక్కు తీసుకోవటానికి ఈ క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేస్తుంది. తన పుత్రులతో ఒక వేదికను నిర్మించి నాలుగు ప్రక్కలా అరటి బోదెలను ఉంచుతుంది. ఈశాన్యంలో గోముఖాకారంలో ఒక తటాకాన్ని త్రవ్విస్తుంది. ఒకనాడు అరటిబోదెలు పెద్ధశబ్ధంతో విరిగిపడి వాటిలోనుండి పార్వతీ సమేత నాగేశ్వరస్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ కారణం చేతనే ఈ క్షేత్రానికి కదళీపురంగా పేరు వచ్చింది.
కాలక్రమంలో ఈ పేరే కళ్ళేపల్లిగా, పెదకళ్లేపల్లిగా మారిందని అంటారు. జనమేజయిడు సర్పయాగం కూడా చేసింది ఈ ప్రాంతమనే అంటారు. ఈ క్షేత్రాన్ని దక్షిణకాశీ అనికూడా పిలుస్తారు. కాశీకి ఈ క్షేత్రానికి చాలా పోలికలు ఉండటంవలన అలా పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ స్వామిని వశిష్టమహర్షి పూజించినట్లు ఆధారాలున్నాయి. ఆలయ ప్రాంగణంలో 16 స్తంభాల కళ్యాణమండపం మరియు పంచముఖ గణపతి విగ్రహం, యాగశాల ఉన్నాయి. స్వామికి ఉత్తరదిశలో దుర్గమ్మ ఆలయం ఉంది.
కాకతీయుల రాజగురువు శివాచార్యుల వారు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. కార్తీక మాసంలో స్వామికి అఖండ పూజలు జరుగుతాయి.
ఎలావెళ్లాలి : పెదకళ్లేపల్లి కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో మండల కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. విజయవాడ నుండి మోసిదేవికి (60 కి.మీ) అక్కడ నుండి పెదకళ్ళేపల్లికి బస్సుల ద్వారా వెళ్ళవచ్చు.