ఆంధ్రరాష్ట్రంలోనే కాక దేశవ్వాప్తంగా పేరుపొందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో కర్నూలు జిల్లాలోని మంత్రాలయం ఒకటి- దీనినే శ్రీ రాఘవేంద్రస్వామివారి మఠం అంటారు. తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్యాసం స్వీకరించారు. అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు. ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు.
స్థల పురాణం: మంత్రాలయాన్నే ఒకప్పుడు మంచాల గ్రామంగా పిలిచేవారు. ఆదోని నవాబు సిద్ధిమసూద్‌ఖాన్ పాలనలో ఉండేది.నవాబు నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు. మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్రస్వామి అక్కడి రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చెయ్యాలంటూ దివాన్ వెంకన్నాచారిని ఆజ్ఞాపించారట!
రాఘవేంద్రస్వామి మధ్వమఠంలో సన్యాసం స్వీకరించారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు అని అంటారు. పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం ఇదే కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ కూడా రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని కోరిందంటారు! దీంతో స్వామి ఇక్కడే నివసిస్తూ చివరకు 1671లో రాఘవేంద్రస్వామి మంత్రాలయంలో సజీవసమాధి అయ్యారు.
ఇక్కడికొచ్చే భక్తులు ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని... అనంతరం రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకొంటారు.
రాఘవేంద్రస్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేక ప్రసాదం ఇస్తారు.
దర్శన సమయాలు
రోజూ ఉదయం 6-00 గంటల నుంచి 8.30 వరకూ దర్శనానికి అనుమతిస్తారు. అరగంట విరామం తర్వాత తిరిగి ఉ. 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ దర్శనం ఉంటుంది.
మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉచిత దర్శనం. ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు.
ప్రత్యేక పూజలు
సంపూర్ణ అన్నదాన సేవ సమర్పణ సేవ, వస్త్ర సమర్పణ సేవ, పట్టువస్త్ర సమర్పణ సేవ, బంగారు పల్లకి సేవ, కనక కవచ సమర్పణ సేవ, రజత రథోత్సవ సేవ, రథోత్సవ కనక మహాపూజ, పూర్ణసేవ, మహాపూజ,
ఉత్సవరాయ పాదపూజ, ఫల పంచామృతాభిషేకం, పంచామృత సేవ, శ్రీవాయుస్తుతి పునశ్చరణ సేవ, శ్రీవాయుస్తుతి పునశ్చరణ, శ్రీ సత్యనారాయణ స్వామిపూజ, సామూహిక సత్యనారాయణ స్వామిపూజ, గోదాన సేవ
ఈ ఆర్జిత సేవలను భక్తులు ఆన్‌లైన్‌లోనూ బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి.. బుక్ చేసుకోవచ్చు. పూజల సమయాలు, చెల్లించవలసిన రుసుము
ఇతర వివరాలకు చూడండి :
Sri Raghavendra Swamy వెబ్‌సైట్‌లో దర్శించండి.
భోజనం :
భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉ. 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఉంటుంది.
రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ నామమాత్రపు ధరకు పులిహోర, పెరుగు అన్నం ఇస్తారు.
వసతి సౌకర్యం
మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో 500 గదులున్నాయి. ఇవికాక కర్ణాటక, ఆంధ్రా రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్‌హౌస్‌ల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి.
.
పూర్తి వివరాలకు... Sri Raghavendra Swamy వెబ్‌సైట్‌లో దర్శించండి.