చెంగాళమ్మ గుడికి తలుపుండవు. అమ్మవారు చీర కట్టుతో, చేతిలో త్రిశూలంతో, తలపై నాగపడకతో, ఎనిమిది చేతులతో ఉండే రూపం ముగ్ధమనోహరం. అమ్మవారు ఎడమపాదంతో మహిషాసురుణ్ణి చంపుతున్న ఊగ్రరూపిణిగా దర్శనమిస్తుంది.
స్థలచరిత్ర : స్థల చరిత్ర ప్రకారం. కొన్ని వేల సంవత్సరాల క్రితం సూళ్ళూరుపేట ప్రాంతాన్ని శుభగిరి అని పిలిచేవారు. గ్రామానికి పశ్చిమాన కాళంగి నది ప్రవహించేది. అప్పట్లో కొందరు పశువుల కాపరులు ఈ నదిలో స్నానాలు చేయడానికి దిగగా, వాళ్లలో ఒకడు సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోయాడు. చనిపోతాడనుకున్న అతడికి నది అడుగున ఓ నల్లరాయి ఆసరా దొరికింది. దాన్ని పట్టుకొని పైకి వచ్చాడు. తనను రక్షించిన ఆ నల్లరాతిని తోటి కాపరులకు చూపించేందుకు బయటకు తీసి ఒడ్డున ఉన్న రావిచెట్టు కింద పడుకోబెట్టినట్లుగా ఉంచాడు.
అప్పటికే చీకటి పడటంతో కాపరులంతా రాయిని అక్కడే ఉంచి వెళ్లిపోయారు. మర్నాడు వచ్చినప్పుడు చూస్తే పడుకోబెట్టిన రాయి దక్షిణాభిముఖంగా నిల్చొని ఉంది. అప్పుడే వాళ్లకు మరో విషయం తెలిసింది. ఆ రాయి స్త్రీమూర్తి విగ్రహమని. మహిషాసురమర్ధినిలా ఉన్న ఆ విగ్రహాన్ని ఊరి పొలివేరల్లోంచి గ్రామంలోకి తీసుకెళ్ళేందుకు ప్రయత్నించారు గ్రామ పెద్దలు, కానీ విగ్రహం అంగుళం కూడా కదలలేదు.
అమ్మవారు ఊరి పెద్దకు కలలో కన్పించి తనను అక్కడ నుంచి తొలగించవద్దని చెప్పిందట దాంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి తాటాకులతో గుడికట్టి పూజించడం మొదలు పెట్టారు. అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటుంది కాబట్టి తేన్‌కాళి అమ్మవారు అని పిలుస్తారు. తెన్ అంటే తమిళంలో దక్షిణం అని అర్ధం.
కొన్ని వంద సంవత్సరాల క్రితం అమ్మవారి గుడికి తలుపులు పెట్టాలని అందుకు సంబంధించిన చెక్క తెచ్చి గుడి దగ్గర ఉన్న రావిచెట్టు దగ్గర పెట్టారు గ్రామస్తులు. గ్రామపెద్దకు అమ్మవారు కలలో కనిపించి తనగుడికి ఎలాంటి తలుపులు పెట్టవద్దని భక్తులు ఎప్పుడైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చని చెప్పిందట. మర్నాడు గుడి దగ్గరకు వెళ్ళి చూస్తే చెక్కలో నుండి మొక్కలు మెలిచాయట. అందుకే అమ్మవారి గుడికి తలుపులు పెట్టలేదు. భక్తులు 24 గంటలు అమ్మవారిని దర్శించుకోవచ్చు.
ఇక్కడున్న రావిచెట్టును చెంగాళమ్మ చెట్టు అని పిలుస్తారు. వివాహితులు ఈ చెట్టుకు తమ చీరచెంగును కడితే సత్సంతానం కలుగుతుందని నమ్ముతారు. ఆలయంలో అమ్మవారికి కుడివైపున గణపతి, ఎడమవైపున వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యస్వామి ఉంటారు. ఇంకా నాగదేవతలు, అభయాంజనేయస్వామి కూడా ఉన్నారు. రోజు రెండు మూడు వేలమంది అమ్మవారి దర్శనానికి వస్తారు.
షార్ (సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం)లో ఏ ప్రయోగం జరిగినా ఈ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. ప్రయోగించే రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల ముందుంచి ప్రత్యేక పూజలు జరిపిస్తారు.
అమ్మవారి జాతర : ఏడు సంవత్సరాలకు ఒకసారి అమ్మవారికి తిరునాళ్ళు నిర్వహిస్తారు. (2013 మే నె 30 నుండి జూన్ 1 వరకు జాతర జరిగింది) జాతర సందర్భంగా అమ్మవారు మహిషాసుర మర్ధినిగా దర్శనమిస్తారు. అమ్మవారి ప్రతిమ కాళంగి నదిలో సుడిగుండాల్లో దొరికింది కాబట్టి ఆమెకు ఏటా సుళ్ల ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అమ్మవారి గుడిముందు పెద్దమానుతో మూడుసార్లు తిప్పుతారు. మూడురోజుల పాటు సుళ్ల ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం పేరు మీదుగానే ఈ ఊరికి సూళ్ళూరుపేట అని పేరు వచ్చింది.
ఎలా వెళ్ళాలి : సూళ్ళూరుపేట చెంగాళమ్మ పరమేశ్వరీ దేవి ఆలయానికి రోడ్డు మరియు రైలు మార్గాల ద్వారా వెళ్ళవచ్చు. విజయవాడ-చెన్నై (చెన్నై-విజయవాడ) రైలు మార్గంలో వెళ్ళే కొన్ని రైళ్ళు సూళ్ళూరుపేటలో ఆగుతాయి. చెన్నై, నెల్లూరు నుండి బస్సులలో వెళ్ళవచ్చు. తిరుపతి నుండి వెళ్ళేవారు శ్రీకాళహస్తి నాయుడుపేట మీదుగా బస్సులలో వెళ్ళవచ్చు.