మహాశివునికి మంత్రయుక్తమైన పూజలు అవసరంలేదు, భక్తిపూర్వకంగా నోరారా పిలిస్తే చాలు. నెల్లూరు జిల్లాలోని దేవునివెలంపల్లిలో ఓ దళిత భక్తునికి దర్శనమిచ్చి దివ్యశక్తిని ప్రసాదించిన అద్భుతం ఇది.....
పడిహేడో శతాబ్దం.....బద్వేలయ్య కుమారుడు పాపయ్య, ఇతని భార్య పోలమ్మ. పంటపొలాలకు కాపలా ఇతని వృత్తి. ఒకరోజు శివపార్వతులు రెప్పపాటు కాలం ఇతని స్వప్నంలో దర్శనమిస్తారు. అప్పటినుండి శివనామస్మరణతో కాలం గడుపుతుంటాడు. తరువాత వెలిగొండ అడవుల్లోని స్తంభాలకోన వెళతాడు. అక్కడే కందమూలాలు తింటూ తపస్సు చేస్తాడు. శివపార్వతులు ప్రత్యక్షమై అతనికి ఓ పవిత్రశిలను అనుగ్రహించి అంతర్ధానమవుతారు. పాపయ్య తాటిమట్టలతో పూరిపాక నిర్మించి అందులో ఆ శిలను ప్రతిష్టించి పూజలు మొదలు పెడతాడు. క్రమంగాప్రజలు కూడా రాసాగారు. పాపయ్య 1816లో మరణిస్తాడు. పాపయ్యకు ఏటా మార్గశిర బహుళ అష్టమినాడు, అతని వారసుడు పోలయ్యకు ఆషాఢ ఆషాఢ శుద్ధపంచమినాడు ఆరాధనా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో గిరిజనులే పూజలు నిర్వహిస్తారు. ప్రతి సోమవారం భక్తులు భారీగా వస్తారు. ఏటా శివరాత్రికి జాతర జరుగుతుంది.
పూరి గుడిసెలో ఉన్న ఈ చిన్న గుడిని తరువాత 2007లో కోటిరూపాయలతో పునర్నిమించారు. ఉగాది పండుగ ముగిసిప పౌర్ణమి తరువాత వచ్చే సోమవారం నాడు ఘనంగా తిరునాళ్లు జరుపుతారు. చివరిలో గ్రామోత్సవం పేరిట జరిగే ఊరేగింపుతో సంబరాలు ముగుస్తాయి. ప్రతి సోమవారం అన్నదానం జరుగుతుంది.
నెల్లూరు పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలోని దేవుని వెలంపల్లి గ్రామంలో ఉంటుందీ ఆలయం.