telugu kiranam

Chennakesava Swamy Kshetram / తొలి చెన్నకేశవ క్షేత్రం, మార్కాపురం

మార్కండేయుడు ... శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి. ఆయన గజారణ్య సంహిత అనే గ్రంథాన్ని రచించారు. ఈ గజారణ్యం ప్రకాశం జిల్లాలోని మార్కాపురమే.
కృతయుగం కంటే ముందు సంగతి. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. మహర్షులు తప్పస్సు భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరికమేరకు శ్రీహరి ఇక్కడ చెన్నకేశవుడిగా స్వయంభువుగా వెలిశాడు. అమ్మవారు రాజ్యక్ష్మీదేవిగా అవతరించింది. కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికా నది (గుండ్లకమ్మ) నీటితో అభిషేకించేవట. అందుకే దీనికి ‘గజారణ్యం’ అనే పేరు వచ్చింది.
త్రేతాయుగంలో గౌతమి మహర్షి స్వామికోసం ఇక్కడే తపస్సు చేశాడు. ద్వాపర యుగంలో రాక్షసుల బాధకు తట్టుకోలేని దేవతలు చెన్నకేశవుణ్ణి పూజించారట. అందుకే దీనికి ‘స్వర్గసోపానం’ అని పేరు. వచ్చిందని చెబుతారు.
కలియుగంలో మారికా, మారకునే భక్తులు స్వామికోసం తపమారించారట. వాళ్ల తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యారట. అప్పట్నుంచీ ఈ క్షేత్రాన్ని వాళ్ల పేరిట మారికాపురమనీ, మారకాపురమనీ పిలిచేవారు. అదే కాలక్రమంలో మార్కాపురం అయ్యిందంటారు.
చరిత్రలోనూ...
12వ శతాబ్దంలో పలనాటి రాజు మలిదేవుడు గురజాలలో జరిగిన కోడిపందేల్లో ఓడిపోయాడట. అప్పుడు తన మంత్రి బ్రహ్మనాయుడితో కలిసి చెన్నకేశవుణ్ణి కొలిచాడట. ఈ విషయాన్ని పల్నాటి వీరచరిత్రలో శ్రీనాథుడు ప్రస్తావించాడు. 1513లో శ్రీకృష్ణదేవరాయు స్వామివారిని దర్శించుకుని కల్యాణ, బ్రహ్మోత్సవాలను జరిపించారు. ఆలయ నిర్మాణానికి తన సామంతరాజు తిమ్మరాజయ్యను ఆదేశించి... స్వామివారికి గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం,గర్భగుడిపై ఉన్న విమానగోపురం, రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్మాణాలను పూర్తిచేయించారు. కృష్ణదేవరాయలు తరువాత అచ్యుతదేవరాయలు ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, వేణు గోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలు నిర్మించారు.
గాలిగోపురం నిర్మాణం వివిధ దశల్లో జరిగింది. 1929 లో అప్పటి తాలూకా కచేరి గుమస్తా పోనంగి లింగరాజు రెండు అంతస్తుల నిర్మించారు. తరువాత ఏడంతస్తులను నాటి మేజిస్ట్రేట్‌ రాయసం యోగేశ్వరరావు భక్తుల సహకారంతో పూర్తిచేశారు. 1936లో గోపుర కలశస్ధాపన, మహా సంప్రోక్షణ, కుంభాభిషేకం నిర్వహించారు.
మార్కాపురం చెన్నకేశవాలయానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి స్వామివారి మూల విగ్రహం చుట్టూ మకర తోరణం ఉంటుంది. కృతయుగం కంటే ముందు ఉన్న ఈ తోరణం పై దశావతరాలు ఉండటం విశేషం. సాధారణంగా శ్రీహరికి కుడిచేతిలో సుదర్శనచక్రం ఉంటుంది. కానీ, ఇక్కడ ఎడమచేతిలో ఉంటుంది. స్వామి ఈ చక్రంతోనే కేశి అనే రాక్షసుణ్ణి సంహరించాడట. మూలవిరాట్టు పక్కనే మార్కండేయ మహర్షి, మారిక, మారకయ్య విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆస్ధాన మండపంలో ఉన్న స్తంభాలన్నీ ఏకశిలతో తయారుచేసినవే. ఈ మండపం చుట్టూ ఉన్న చూరు (సన్‌షేడ్‌) మరో ఆకర్షణ. ఒక రాయిని మూడు వంపులుగా చెక్కడం ఇందులోని ప్రత్యేకత. ఇలాంటి చూరు తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో మాత్రమే కనిపిస్తుంది.
ఇందులో అన్నదమ్ముల స్తంభాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సోదరులైన ఇద్దరు శిల్పులు తమ మధ్యలో అడ్డంగా తెర కట్టుకుని, శబ్దభేది విద్యద్వారా రెండు స్తంభాలను చెక్కారు. అంటే, అన్నయ్య ఉలితో శిలమీద ఒక చోట చెక్కినప్పుడు వచ్చే శబ్దం ఆధారంగా తమ్ముడు వేరే స్తంభాన్ని చెక్కడం జరిగింది, ఈ రెండూ నూటికి నూరు శాతం ఒకేలా ఉండటం విశేషం.
ధనుర్మాసంలో సూర్యోదయ సమయాన ఉదయభానుని లేలేత కిరణాలు గర్భాలయంలోని మూవిరాట్టు పాదాలనుంచి శిరస్సు వరకూ వ్యాపిస్తాయి. వేదకాలం నుంచే ఉత్సవాలు.
చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేదకాలం నుంచీ జరుగుతున్నాయని గజారణ్య సంహితలో ఉంది. ఆ సమయంలో 12 రోజుల పాటు (ప్రతిరోజూ చంద్రోదయానంతరం) వాహనోత్సవాలు జరుగుతాయి. ఏటా చైత్ర శుద్ద చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ , పౌర్ణమి నాడు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వహంస వాహనోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది. రథోత్సవం. దీనికి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారని అంచనా.