వల్లూరమ్మ గుడి ఎలా వెలసింది అనేదానికి స్థానికులు ఓ కధ చెప్తారు.
వెంకటగిరి రాజులు, ఒంగోలు మందపాటి రాజులకు సరిపడేది కాదు. వారిద్దరిలో వెంకటగిరి రాజులు బలవంతులు. వారివలన తమకు హాని జరగకుండా ఉండాలని, ప్రజలు ఇబ్బంది పడకూడదని మందపాటి రాజులు యజ్ఞం చేయాలనుకున్నారు. ఈ సంగతి తెలిసిన వేంకటగిరి రాజులు యజ్ఞం జరక్కుండా చేయాలనుకున్నారు. వెంటనే, యజ్ఞం నిర్వహించే యోగీంద్రుని ఏదో నెపాన ఆపాలనుకున్నారు. కానీ, మందపాటి రాజుల సంకల్పం ఉన్నతమైనది కనుక అలా జరగలేదు.
మందపాటి రాజులు తలపెట్టిన యజ్ఞం నిర్విఘ్నంగా సాగుతోంది. అయితే యజ్ఞవాటిక నుండి మహా జ్వాలలు బయల్దేరాయి.అందులోంచి ఉల్కలు వస్తున్నాయి. అది చూసి అందరూ భయపడ్డారు. ఏదయినా అపరాధం జరిగిందా అని సంశయించారు. కానీ చూస్తుండగానే ఆ ఉల్కలు ఒక దివ్య ఆకృతి దాల్చి ముందుకు సాగింది. అలా వల్లూరు చెరువు వైపు వెళ్ళి అక్కడ అంతర్ధానం అయింది. ఆ దివ్య స్వరూపం చూసి అక్కడివారు ముందు భయపడినా, వెంటనే మహానుభూతికి గురయ్యారు. ఆ శక్తి వేరెవరో కారని, అమ్మవారేనని అర్ధం చేసుకుని ఆలయం కట్టించారు. అగ్ని నుండి వెలసిన శక్తి కనుక ఉల్కాముఖి అని పేరు పెట్టారు. వల్లూరులో వెలసిన దేవత కనుక వాడుకలో వల్లూరమ్మగా నిలిచిపోయింది.
స్థానికులు వల్లూరమ్మ అని, వల్లూరమ్మ తల్లి అని వ్యవహరిస్తూ భక్తిప్రపత్తులతో ఆరాధిస్తారు.