తిరుమకొండకు ప్రతిరూపం వెలిగొండ పుణ్యక్షేత్రం. ఆదిశేషుని ఆకారంలోని ఈ పర్వతశ్రేణికి తలభాగంలో సప్తగిరీశుడు వెలిస్తే తోకభాగంంలో వెలిగొండస్వామి కొలువయ్యాడని భక్తులు పారవశ్వంతో చెబుతారు.
స్థలచరిత్ర : ఈ స్థలచరిత్రకు ద్వానరయుగంతో సంబంధముంది. కాలయవనుడనే రాక్షసుడు మహా దుర్మార్గుడు. కాలయవనుని శ్రీకృష్ణుడు ముచికుందుడనే మహర్షి ద్వారా అంతమొందిస్తాడు. ముచికుందుడు ఇక్ష్యాకుల వంశానికి చెందిన మాంధాత పుత్రుడు. దేవ దానవ యుద్ధంలో దేవతల పక్షాన నిలబడి నిద్రాహారాలు మానుకొని యుద్ధం చేస్తాడు. యుద్ధానంతరం దేవతలు సంతోషించి వరం కోరుకొమ్మంటారు. ముచికుందుడు కంటినిండా ఆటంకం కలగకుండా నిద్రపోవాలని ఎవరైనా నిద్రాభంగం కలిగించిన వారు భస్మమయ్యేలాగున వరం పొందుతాడు.
తదుపరి ఒక గుహలో నిద్రిస్తాడు. శ్రీకృష్ణుడు కాలయవనుని యుద్ధానికి కవ్వించి గుట్టలు పర్వతాలు దాటుతూ ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో ప్రవేశించి కనబడకుండా దాక్కుంటాడు. కాలయవనుడు చీకటిలో నిద్రిస్తున్న ముచికుందుడుని శ్రీకృష్ణునిగా పొరబడి కాలితో తంతాడు. దాంతో నిద్రాభంగమైన ముచికుందుడు ఆగ్రహంతో కాలయవనుని చూడగా కాలయవనుడు భస్మమవుతాడు. ఈ కథనమంతా ఈ ప్రాంతంలోనే జరిగిందంటారు. ముచికుందుని కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఇక్కడ తిరువేంగళనాథస్వామిగా వెలిశాడంటారు. ఇక్కడ ముచికుందుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు.
ఆలయ విశేషాలు : విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు తిరుమల దర్శనానంతరం శ్రీలశైం వెళుతూ మార్గమధ్యంలో ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారిని పూజించి స్వామివారికి నిత్య నైవేద్యాలకు, దీపారాధనకు భూరీ విరాళాలు ఇచ్చాడని ఇక్కడున్న శాసనం ద్వారా తెలుస్తుంది. ఇక్కడే తూర్పుముఖంగా ఉన్న శివలింగాన్ని దర్శించవచ్చు. వేంకటేశ్వరస్వామి ఉత్తరముఖంగా దర్శనమిస్తాడు. ఇక్కడ కొండపైన ఉన్న లక్ష్మమ్మ గుడికి కూడా ఎంతో పేరు ఉంది.
ఈ ప్రాంతం మూసి నది ఉద్భవించిన పవిత్ర ప్రాంతం. స్వామివారి పాదాల చెంతనుండే ఈ నది ప్రవహిస్తుంది. ఇక్కడే మహర్షి తపస్సు చేయటంతో ముచికుంద నదిగా పేరు స్థిరపడింవొ. కాలక్రమంలో ముసినదిగా పేరుపొందింది. పొదిలి, దర్శి, కందుకూరు, ఒంగోలు ప్రాంతాలను దాటుకుని వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. కొండకు కొద్దిదూరంలో బండరాతిలో లక్ష్మమ్మ దోన, నిచ్చెన దొనలు ఉన్నాయి. మండువేసవిలో కూడా ఈ దోనలలో నీరు వుంటుంది.
తాడిపత్రివారి మర్యాద: శ్రీహరి నరసింహావతారంలో హిరణ్యకశిపుని వధించిన అనంతరం చెంచుక్ష్మిని వివాహమాడతాడు. దీంతో లక్ష్మీదేవి బంధువులైన తాడిపత్రివారు కత్తులు, కటార్లతో స్వామివారిపై దాడిచేసారని ఒక కథనం. ఇదే తాడిపత్రివారి మర్వాద అంటే. ఈ ఆచారం ఇప్పటికి బ్రహ్మోత్సవాలో కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ (ఫిబ్రవరి-మార్చి) శుద్ధ పౌర్ణమి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వివిధ సామాజిక వర్గాలవారి 33 సత్రాల ద్వారా అన్న సంతర్పణం జరుగుతుంది. ఈ ఉత్సవాలకు సుమారు లక్ష మంది దాకా భక్తులు వస్తారు.
ఎలా వెళ్ళాలి : ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం లోని గార్లదిన్నె పంచాయతీ పరిధిలో ఉందీ పుణ్యక్షేత్రం. మార్కాపురం-ఒంగోలు మార్గంలో నాగిరెడ్డిపల్లె నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. మార్కాపురంనుండి ఆలయ ముఖద్వారం పక్కగా గొట్లగట్టు వరకు ఉదయం, సాయంత్రం బస్సు నడుస్తుంది. ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.