మహిమగల తల్లి కనకమహాలక్ష్మి విశాఖపట్నంలోని బురుజుపేట ప్రాంతంలో బహిరంగ మండపంలో కొలువుదీరిన అమ్మరూపం కడు రమణీయం.
పూర్వం విశాఖ పట్టణాన్ని పరిపాలించిన రాజులు అమ్మవారిని వైశాఖేశ్వరి పేరుతో కొలిచేవారు. వీరితోపాటూ కళింగరాజులూ కనక మహాలక్ష్మిని ఆరాధించేవారనీ, మొక్కులూ, కానుకలూ చెల్లించేవారనీ స్థలపురాణాలు తెలియజేస్తున్నాయి.
ఆ కాలంలో కొందరు శత్రు రాజులు వైశాఖీరాజ్యం మీద దండెత్తినప్పుడు తమ ఇలవేల్పును వారికి దొరక్కుండా ఉంచడం కోసం వైశాఖేశ్వరి విగ్రహాన్ని పక్కనే ఉన్న బావిలో పడేశారు. ఈ క్రమంలో అమ్మవారి వామహస్తం విరిగిపోయింది. కొంతకాలం తర్వాత అమ్మవారు ఒక భక్తురాలి కలలో కనిపించి, ‘నేను కనకమహాలక్ష్మీదేవిని.
ఈ బావిలో ఉన్నాను. నన్ను బయటకు తీసి, గుడి కట్టించమని’ తెలుపుతుంది. ఆ భక్తురాలు బావి దగ్గరకు వెళ్లి చూసేసరికి దివ్యకాంతులు కనిపించాయి. దాంతో తనకు వచ్చింది కల కాదనీ అది కనకమహాలక్ష్మి అమ్మవారి ఆజ్ఞనీ గ్రహించిన ఆ భక్తురాలు విగ్రహాన్ని బయటకు తీసి గుడిని ఏర్పాటు చేసిందని భక్తులు తెలుపుతారు.
ఒకప్పుడు ఇరుకు వీధులతో ఉండేదీ ప్రాంతం
1917వ సంవత్సరంలో వీధి వెడల్పు చేసేందుకు విశాఖ మున్సిపాలిటీ అధికారులు ఈ విగ్రహాన్ని మూలస్థానం నుంచి 30 అడుగుల దూరం జరిపించారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ప్లేగు వ్యాధి ప్రబలి, ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోడంతో విశాఖ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదంతా అమ్మవారి విగ్రహాన్ని కదిలించడం వల్లే జరిగిందని భావించిన ప్రజలు ఆ విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించారట. దాంతో ప్లేగు వ్యాధి తగ్గి ప్రజలు ఆరోగ్యవంతులయ్యారనీ, ఇదంతా కనక మహాలక్ష్మి మహిమేననీ చెబుతారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి గోపురం లేదు. గతంలో ఎన్నోసార్లు గోపురాన్ని నిర్మించడానికి ప్రయత్నించినా ఏవేవో ఆటంకాలు ఎదురయ్యేవి. దాంతో అమ్మవారి అభీష్టం మేరకు బహిరంగ మండపంలో ఉంచి, పూజాదికాలనూ, ఉత్సవాలనూ సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఎవరికి వారే సిరుల తల్లిని పసుపు, కుంకుమలతో
పూజించడం ఈ ఆలయం ప్రత్యేకత. పసిబిడ్డలనూ, కొత్తగా కొన్న బంగారాన్నీ మొదట కనకమహాలక్ష్మి వద్దకే తీసుకురావడం పూర్వం నుంచీ వస్తున్న ఆనవాయితీ.
కనకమహాలక్ష్మి అమ్మవారికి ఏటా మార్గశిర మాసంలో విశేష ఉత్సవాలు నిర్వహిస్తారు. మార్గశిర గురువారం చల్లని తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైనదనీ, ఆ రోజున అమ్మను దర్శించుకుంటే సకల శుభాలూ చేకూరుతాయనీ భక్తుల నమ్మకం.
అందుకే మార్గశిర మాసంలో ప్రతి బుధవారం రాత్రి 12 గంటల నుంచే నాదస్వర వాయిద్యాలూ, వేద మంత్రాలతో శ్రీలక్ష్మికి అభిషేకాలూ, కుంకుమ పూజలూ ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియల అనంతరం అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. ఆలయంలో రథోత్సవ వేడుకను కన్నుల పండగగా జరుపుతారు.
శ్రావణమాసంలో మంగళ, గురు, శుక్రవారాలూ, పూర్ణిమ తిథి లాంటి పర్వదినాల్లో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలూ, నోములూ, వ్రతాలూ జరుపుతారు. తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా అమ్మవారికి అష్టదళ సువర్ణ పద్మారాధన జరుపబడుతుంది. మాలధారణ సాంప్రదాయం కూడా ఉంది. ఆకుపచ్చని వస్త్రాలు ధరించి భక్తులు మాలధారణ చేపడతారు. దసరా శరన్నవరాత్రుల్లో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలూ జరుగుతాయి. వీటిలో పాల్గొనడానికి విశాఖ వాసులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మార్గశిర మాసంలో (జనవరి) 30 రోజులపాటు అమ్మవారి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలు చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు
ఈ ఆలయానికి దగ్గరలోనే రామకృష్ణా బీచ్, కైలాసగిరి, సింహాచలం ఉన్నాయి. విశాఖకు రైలు, రోడ్డు, వాయు మార్గాలు ద్వారా వెళ్లవచ్చు. బస్‌స్టాండ్, రైల్వేస్టేషన్ల నుంచి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం మీదుగా ప్రయాణించే బస్సు ప్రతి పది నిమిషాలకొకటి సిద్ధంగా ఉంటుంది.