header

Nookambika Ammavari Temple / నూకాంబికా దేవాలయం – అనకాపల్లి

నూకాంబికా అమ్మవారి దేవాలయం సువిశాలమైన ప్రాంగణంలో కళకళలాడుతూ ఉంటుంది. అమ్మవారికి నిత్యం కుంకుమ పూజలు, మహానైవేద్యం, బాలభోగం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి గురువారం వెండిపూలతో అష్టదశ పాద పద్మార్చన, ప్రతి శుక్రవారం పంచామృతాలతో శ్రీచక్ర అభిషేకం, ప్రతి ఆదివారం పండ్లూ, పంచామృతాలతో వసంతోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. నిత్యాన్నదానం జరుగుతుంది.
ప్రతి సంవత్సరం ఫాల్గుణ బహుళ అమావాశ్య నుంచి (ఉగాది ముందు రోజు) చైత్ర బహుళ అమావాశ్వ వరకు నెల రోజులపాటు అమ్మవారి జాతర వేడుకగా జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల వారే కాకుండా ఒడిశా, పశ్ఛిమబెంగాల్ నుంచి కూడా జనాలు వస్తారు. విదేశాల్లో స్థిరపడిన స్థానికులు కూడా ఈ ఉత్సవాలకు వస్తారు. ఉత్సవాల నెల రోజులు విచిత్ర వేషధారణ, కోలాటాలు, నృత్యాలు, నాటకాలతో సందడిగా ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారి పుట్టుక కథ చెప్పించుకుంటారు. కొత్తగా పెళ్ళైన వారు అమ్మవారిని దర్శించుకోకుండా పొలిమేర దాటరు. జాతర సందర్భంగా ఘటాలతో ఆలయానికి రావటం ఆనవాయితి. ఘటాలను నెత్తిమీద పెట్టుకుని నిప్పులపై నడిచి మొక్కులు తీర్చుకుంటారు, చీరలపై కూడా నడచి మొక్కులు తీర్చుకుంటారు. ఎంతో మంది తమ కష్టాలు తీరితే జాతర చేస్తామని మొక్కుకున్నవారు నిద్రాహారాలు మాని జాతరలో జాగారం చేస్తారు.
మహా మండపంలోని కనకమహాలక్ష్మి, సంతాన లక్ష్మి, మహిషాసుర మర్ధిని, మూగాంబిక, రాజరాజేశ్వరి, సంతోషిమాత, కనకదుర్గ దేవతామూర్తులు ప్రత్యేక ఆకర్షణ.
పొంగళ్ళు - మట్టికుండల విశిష్టత అమ్మవారి ఆలయంలో పొంగళ్ళు వండి నైవేద్యంగా పెడతారు. ఈ సాంప్రదాయంలో కుండకు పసుపు, కుంకుమ పెట్టి, కొత్తచీర చుట్టి ఆ కుండను చెట్టు కింద పెడతారు అందులో అమ్మవారికి బూరెలు, గారెలు,ఇతర పిండివంటలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఇవే కుండలను తరువాత తాగునీటి అవసరాలకు ఉపయోగస్తారు. ఆ చల్లని నీళ్ళు తాగితే తల్లి చల్లగా చూస్తుందని స్ధానికుల నమ్మకం. భక్తుల కొరకు ఆలయ ఆవరణలో చలువ పందిళ్ళు కట్టారు. వసతి సౌకర్యం కూడా ఉంది. కళ్యాణమండపం కూడా నిర్మించారు.
ఎలావెళ్ళాలి ? నూకాంబికా ఆలయం అనకాపల్లి పట్టణం నడిబొడ్డు ఉంది. విశాఖపట్నం నుండి 36 కి.మీటర్ల దూరంలో అనకాపల్లి ఉంది. ప్రతి 15 నిమిషాలకు విశాఖపట్నం నుండి అనకాపల్లికి బస్ సౌకర్యం కలదు. రైలు ద్వారా (విజయవాడ-విశాఖపట్నం రైలు మార్గం) వెళ్ళేవారు అనకాపల్లి స్టేషన్లో దిగి నూకాంబికా ఆలయానికి వెళ్ళవచ్చు.