header

Simhachalam Narasimha Swamy /సింహాచలం నరసింహస్వామి

Simhachalam Narasimha Swamy /సింహాచలం నరసింహస్వామి
నారసింహ క్షేత్రాల్లో విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం క్షేత్రం పురాతనమైనది. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ విశాఖపట్నం నగరానికి 11 కి.మీల దూరంలో తూర్పు కనుమల్లోని సింహగిరిపై సముద్రమట్టానికి 800 అడుగుల(244మీ)ఎత్తున ప్రశాంత వాతావరణంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశారు. విశాఖ పరిసర ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంత భక్తులంతా సింహాద్రి అప్పన్నగా వరాహ లక్ష్మీనరసింహస్వామిని పిలుచుకుంటారు. నిత్యం చందనంతో కప్పబడి కనిపించే ఈ స్వామి నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (మే నెలలో) వస్తుంది.
స్థల పురాణం
11వ శతాబ్దంలో, స్వయంభూవైన సింహాచల శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మించబడినట్ల స్థలపురాణం బట్టి తెలుస్తోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్ప కళ, అందమైన గోపురాలతో భక్తులకు కనువిందు చేస్తుంది. కృతయుగంలో వేదాలు అపహరించిన హిరణ్యాక్షుడిని సంహరించిన వరాహ అవతారం, ఆ తర్వాత యుగంలో హిరణ్యకశిపుని వధించిన నరసింహావతరంగా .. స్వామి ఇక్కడ వరాహ నృసింహ స్వామిగా స్వయం వెలసారు. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ రోజూ నాలుగు వేదాలు, నాలాయిర దివ్య ప్రబంధాలు, పురాణాలు స్వామి వారి సన్నిధిలో పారాయణం చేస్తారు. ఈ క్షేత్రం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటి.
ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. శ్రీవరాహ లక్ష్మీ నృసింహస్వామి వారు ఏడాదిలో 364 రోజులు సుగంధ భరిత చందనంతో కప్పబడి ఉంటారు. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చేది.. ఈ చందన అవతారంలో వుండే స్వామి వారే. ఏటా ఒక్క వైశాఖ శుద్ధ తదియ నాడు మాత్రమే.. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం వరకూ ఆ నిజరూప దర్శనం ఉంటుంది. స్వామి వారి నుంచి తొలగించిన గంధాన్ని చందన ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ కూడా ఇక్కడ ప్రత్యేకంగా జరిగే ఉత్సవం. మిగతా సమయాల్లోనూ ఎంతో రద్దీగా ఉండే సింహాచలం ఆలయం ఈ రెండు సందర్భాల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బంగా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుండి వచ్చే లక్షల మంది భక్తులతో సందడిగా మారుతుంది. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకొంటే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం.
స్వామివారి పూజలు
స్వామి వారి నిత్యకల్యాణం:
టిక్కెట్టు ధర రూ.1000, రోజూ జరిగే ఈ సేవలో స్వామివారి పట్టు శేష వస్త్రం, చీర, రవికె, 80 గ్రాముల బరువు ఉండే 6 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు, ఆరుగురికి ఉచిత దర్శనం, అన్నదానంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తారు.
స్వర్ణ పుష్పార్చన:
టిక్కెట్టు ధర రూ.1116, ప్రతి గురువారం ఉదయం 7 గంటల నుంచి గంటపాటు జరుగుతుంది. పాల్గొన్న వారికి కండువా, రవికె, 2 లడ్డూలు, 2 పులిహోర ప్యాకెట్లు ఉచితంగా అందజేస్తారు.
ఇతర సేవల వివరాలు
- సహస్రనామార్చన: రూ.200-
- అష్టోత్తర శతనామార్చన: రూ.100
- లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన: రూ.50
- గరుడ సేవ: రూ.300
- కప్పస్తంభ ఆలింగనం: రూ.25
- లక్ష్మీనారాయణ వ్రతం: రూ.50
- గోపూజ: రూ.50
- గోసంరక్షణ పథకం విరాళం: రూ.1116
- పశువుకట్టు: రూ.15
- అన్నప్రాశన, అక్షరాభ్యాసం: రూ.50
- ద్విచక్రవాహన పూజ: రూ.100
- కారు పూజ: రూ.200
- కేశఖండన: రూ.10
టిక్కెట్లు ఇచ్చే చోటు: అన్ని పూజా టిక్కెట్లు ఆలయంలోని కప్పస్తంభం వద్ద ఇస్తారు. రూ.100 దర్శనం టిక్కెట్లను గాలిగోపురం వద్ద ప్రత్యేక కౌంటర్లో ఇస్తారు. రూ.20 టిక్కెట్లు క్యూలైన్ల మధ్యలోనే ఇస్తారు.
స్వామివారి ప్రసాదం
- లడ్డూ : రూ.5
- పులిహోర : రూ.5
- చక్కెర పొంగలి: రూ.3
- రవ్వ లడ్డూ : రూ.2
దర్శన సమయాలు
- ఉదయం 6.30 నుంచి 11.30 వరకు సర్వదర్శనం
- ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాజభోగం సందర్భంగా అరగంట పాటు దర్శనాలు నిలుపుదల చేస్తారు.
- మధ్యాహ్నం 12 నుంచి 2.30 వరకు సర్వదర్శనం - మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పవళింపు సేవ. దర్శనాలు ఉండవు
- సాయంత్రం 3 నుంచి రాత్రి 7 వరకు సర్వదర్శనం
- రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన. దర్శనాలు లభించవు.
- రాత్రి 8.30 నుంచి 9 వరకు సర్వదర్శనం
- రాత్రి 9.00 పవళింపు సేవ జరిగి తలుపులు మూసివేస్తారు
- మరలా ఉదయం 6.30కి యథావిధిగా దర్శనాలు లభిస్తాయి.
దర్శనం టిక్కెట్ల
- రూ.100 గాలిగోపురం నుంచి అంతరాలయంలోకి ప్రవేశం
- రూ.100 అష్టోత్తరం టిక్కెట్టు. అంతరాలయంలో గోత్రనామాలతో పూజ చేస్తారు
- రూ.20 సాధారణ క్యూలైన్ల నుంచి ఆలయంలోకి ప్రవేశం.
ఎలా వెళ్లాలి ?
సింహాచల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్నది విశాఖపట్నం అన్ని ప్రధాన పట్టణాలనుండి రైలు, రోడ్డు, విమాన మార్గాలతో అనుసంధానమై ఉంది. దగ్గరలోని విమానాశ్రయం విశాఖపట్నం
విమానాశ్రయం నుంచి 11 కి.మీ, విశాఖ ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి 11 కి.మీ, విశాఖపట్నం బస్ స్టేషన్ నుంచి 12 కి.మీ దూరంలో ఉంది. సింహాచలం కొండ దిగువ నుంచి ఎగువకు మాత్రం సింహాచలం దేవస్థానమే ప్రత్యేక వాహనాలను నడుపుతోంది. సొంత వాహనాలు ఉంటే నామమాత్రపు (రూ.10) టోల్ రుసుము వెళ్లవచ్చు.
వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయ గాలిగోపురం పక్కన లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు.
వసతి సౌకర్యం
కొండపై సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే పలు సత్రాలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చందన టూరిస్టు రెస్ట్ హౌస్, తితిదే సత్రాలు ఉన్నాయి. కొండ కింద పలు ప్రైవేటు వసతి గదులు అందుబాటులో వున్నాయి.