ఉత్తరాంధ్ర ప్రజల కొంగుబంగారంగా పేరుపొందిన గరుడాద్రి పర్వతంమీద స్వయంభూ క్షేత్రమై విరాజిల్లుతున్న ప్రదేశం విశాఖజిల్లాలోని ఉపమాక వెంకటేశ్వరస్వామి ఆలయం.
ఉపమాక అంటే ఉపమానం లేనిదని అర్థం. ఈ కొండపై వెలిసిన స్వామివారి విగ్రహం ఆయుధాలతో గుర్రంపై కూర్చుని, ఉత్తర దిక్కుగా చూస్తున్నట్లు ఉంటుంది. ఆలయాన్ని కూడా ఇదే విధంగా నిర్మించారు. దీంతో భక్తులకు ఏడాది పొడవునా ఉత్తర ద్వార దర్శనమే.
ద్వాపరయుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణభగవానుడిని తనవీపుమీదనే ఎల్లప్పుడూ ఉండేవిధంగా వరాన్ని ప్రసాదించమని కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు కలియుగంలో దక్షిణ సముద్ర తీరంలో గరుడుడు పర్వత రూపంలో ఉండగా, వేటకు వచ్చిన తాను అదే కొండపై స్థిరపడతానని అభయమిచ్చినట్లు స్థలపురాణం వలన తెలుస్తుంది. కలియుగంలో వెంకటేశ్వరస్వామి మొదట ఇక్కడే వెలిశాడంటారు. అయితే స్వామి భారాన్ని మోయలేని గరుడాద్రి కుంగిపోతుండగా వెంకన్న తన రెండో పాదాన్ని ఏడుకొండలపై మోపి అక్కడే వెలిసి, రాత్రిళ్లు మాత్రం ఇక్కడ పవళిస్తారనీ. అందుకే కొండపై ఉన్న ఈ ఆలయాన్ని పగటిపూట మాత్రమే తెరచి ఉంచుతారనీ అంటారు.
వెంకటేశ్వర స్వామికి ఏటా కల్యాణం జరిపించేందుకు ఉత్సవ మూర్తులనూ,ఆలయాన్ని సంరక్షించేందుకు వేణుగోపాలస్వామినీ కొండ దిగువన ప్రతిష్ఠించిన నారదమహర్షి ఇక్కడి ఉపాలయాలనూ తానే స్వయంగా నిర్మించాడని ప్రతీతి.
ఇదే సమయంలో బ్రహ్మ, కశ్యపుడు వంటివారు కలిసి ఇక్కడ చేసిన తపస్సు ఫలితంగా ఒక తటాకం ఏర్పడిందని, తర్వాతి కాలంలో అదే బంధుర సరస్సుగా మార్పు చెందిందనీ పురాణ కథనం. ఇందులో స్నానమాచరిస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల విశ్వాసం. పిఠాపురం సంస్థానాన్ని పాలించిన కృష్ణభూపాలుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించాడు.
ఏటా ఫాల్గుణ శుద్ధ ఏకాదశినాడు (ఫిబ్రవరి) స్వామివారికి వార్షిక కల్యాణోత్సవాలను నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారికి అలంకరించే పురాతన కాలంనాటి వజ్రాభరణాలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. కల్యాణం జరిగిన తర్వాత సదశ్యం, తోట ఉత్సవం, చక్రస్నానం లాంటి క్రతువులను మరో మూడురోజులపాటు నిర్వహిస్తారు.
తర్వాత మూడురోజులూ పుష్పయాగోత్సవాలు జరుగుతాయి. ఇవేకాకుండా ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు, ధనుర్మాస వేడుకలు, శ్రీరాముడి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వైకుంఠ ఏకాదశినాడు స్వామివారికి ఒకేసమయంలో ఎనిమిది వాహనాలతో తిరువీధి సేవ నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
కల్యాణ వేడుకలతోపాటు మిగిలిన కార్యక్రమాలనూ తిలకించడానికి ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు
స్వామివారి కల్యాణ వేడుకలు ముగిసిన తర్వాతి రోజు నుంచీ సుమారు ఇరవై రోజులపాటు ఉపమాకలో తీర్థం జరుగుతుంది. ఇదివరకు ఇక్కడికి వచ్చే భక్తులు రోజులతరబడి ఇక్కడే ఉండి కల్యాణోత్సవాలను మొత్తం చూసిన తరువాత స్వగ్రామాలకు వెళ్లేవారు.
ఉపమాక క్షేత్రం విశాఖపట్టణానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి రైలు రోడ్డు మార్గాలు ద్వారా వెళ్లవచ్చు. రోడ్డు మార్గంలో ఐతే విజయవాడ, విశాఖ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మండల కేంద్రం నక్కపల్లిలో దిగివెళ్లాలి.
రైలు మార్గం - విశాఖ నుంచి వచ్చేవారు నర్సీపట్నం రోడ్డు, విజయవాడ నుంచి వచ్చేవారు తుని రైల్వే స్టేషన్లలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంద్వారా ప్రయాణించి ఉపమాక వెంకన్నను ఆలయానికి వెళ్లవచ్చు.