నారాయణపురం గ్రామానికి దక్షిణ భాగంలో ఉన్న నాలుగు శివాలయాల సముదాయం అలనాటి శిల్పకళా చాతుర్యానికి వేదికగా నిలుస్తుంది. తూర్పు గాంగులు దీన్ని నిర్మించినట్లు శాసనాలద్వారా తెలుస్తుంది.
అనంతవర్మ ఈ వంశంలో ప్రసిద్ధుడు పరమ శివభక్తుడు. ఆలయం మీద లకునీసుని విగ్రహం ఉంది. లకునీసుడు పాశుపత శైవమత స్థాపకుడు. రోజుల్లో పాశుపత శైవం ఓ వెలుగు వెలిగింది. ప్రాంగణంలో నీలకంఠేశ్వరస్వామి కోవెలతోపాటూ నాళేశ్వర సంగమేశ్వర, మల్లికార్జున ఆలయాలున్నాయి. వీటి మీద యాభైకి పైగా శాసనాలను గమనించవచ్చు.
నీలకంఠేశ్వరుడు : క్షీరసాగర మథనంలో హాలాహలం పెల్లుబికింది. ముక్కోటి దేవతల విన్నపాలను మన్నించి పరమశివుడు విషాన్ని దిగమింగాడు. కాబట్టే స్వామికి నీలకంఠుడన్న పేరు వచ్చింది. ఆలయ సముదాయంలో ఈ ఆలయమే పెద్దది. గర్భగృహ ద్వారం మీద నవగ్రహాల్ని గజలక్ష్మీ విగ్రహాలను సుందరంగా మలిచారు. తూర్పుద్వారానికి వెలుపల నందీశ్వరుణ్ణి లోహంతో మలిచారు. ద్వారం ఇరువైపులా అష్టదిక్పాలకుల విగ్రహాలను చెక్కారు. గర్భగుడి, మండపం పైభాగాలలో చూడముచ్చటైన గూళ్ళు ఏర్పరచారు. వాటిలో మహిషాసుర మర్థిని, శివుడు, ఏకపాదమూర్తి, కార్తికేయ, బహ్మ, విష్ణు, అర్థనారీశ్వర, నటరాజ, సరస్వతి, గణేశ, సప్తమాతృకల విగ్రహాలను ప్రతిష్టించారు. మహిషాసుర మర్థిని, రామాయణ గాథలను రమ్యంగా చెక్కారు. ప్రధాన ఆలయానికి ఉత్తరాన మల్లికార్జునుడు వెలిశాడు.
మల్లికా పుష్పాలతో పూజించే భక్తులను వరాలతో కరుణిస్తాడు కాబట్టి మల్లికార్జునుడనే పేరు వచ్చిందంటారు. దక్షిణ దిశలో నాళేశ్వరాలయం ది. నాళాలతో (పేగులు) రావణుడు పలికించిన ఓంకార నాదనికి పరవశించిన పరమశివుడు నాళేశ్వరుడుగా పేరుపొందాడంటారు.
సువర్ణముఖీ నదీతీరాన ఉన్న ఈ క్షేత్రానికి శివరాత్రి, కార్తీకమాసం, సంక్రాంతి తదితర పర్వదినాల్లో వేలాదిగా భక్తులు తరలి వస్తారు.
నది ఒడ్డున, పచ్చని తోటలతో, ఇసుక తిన్నెలతో ప్రకృతి రమణీయంగా ఉంటుంది.
ఎలావెళ్లాలి : విశాఖపట్టణం నుండి నారాయణపురానికి నేరుగా రైలు ద్వారా వెళ్ళవచ్చు. బొబ్బిలి, పార్వతీపురం పట్టణాల నుంచి బస్సుల ద్వారా వెళ్ళవచ్చు.
పార్వతీపురం నుంచి అయతే గరుగుబిల్లి మండలం మీదుగా గౌరీపురానికి వచ్చి సువర్ణముఖి నది దాటి ఆలయానికి చేరుకోవలసి ఉంటుంది.