అక్షరాభ్యాసాలకు బాసర తరువాత తాడేపల్లిగూడెంలోని జ్ఞాన సరస్వతీ దేవాలయం ప్రసిద్ధి పొందినది. అమ్మ చెంతనే వెలసిన గణపతికి ఎంతో ప్రత్యేకత ఉంది.
దేవాలయంలోనికి ప్రవేశించగానే నైరుతీభాగంలో ఉత్తరముఖంగా తేజో వదనంతో మేధాసరస్వతీదేవి విగ్రహం దర్శనమిస్తుంది. అమ్మవారికి ఎదురుగా 150 అడుగుల దూరంలో శ్రీమేధా దక్షిణామూర్తి విగ్రహం కనబడుతుంది. ఇక్కడ వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తుంటారు. ఈ ఆలయంలో అష్టముఖ గణపతి విగ్రహం చూచి తీరాల్సిందే. ఎనిమిది ముఖాలతో 42 అడుగుల ఎత్తుతో ప్రత్యేకంగా అష్టముఖ గణపతి ఇక్కడ కొలువుతీరాడు. ఈ విగ్రహానికి తూర్పువైపున లక్ష్మీగణపతి, దక్షిణాన సిద్ధ బుద్ధి సమేత శక్తిగణపతి, పడమరవైపున పార్వతీ, పరమేశ్వరులకు నమస్కరిస్తున్న అభివాద గణపతి, ఉత్తరాన కుబేరుని కాలిపై కూర్చుండబెట్టకున్న కుబేరగణపతి కనిపిస్తారు.
ఇదే ప్రాంగణంలో 42 అడుగుల ఎత్తుతో శివపార్వతుల విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విగ్రహాల క్రింది భాగంలో 16 నర్మద శివలింగాలు, లక్షరుద్రాక్షలు విశేష దివ్యయంత్రాలు నిక్షిప్తం చేశారు. దేవాలయంలో సరస్సు నిర్మించారు. పర్వదినాలలో స్వామివారు అమ్మవారు జలవిహారం చేస్తారు.
ఇక్కడ ఇంకో విశేషం హుండీలు ఉండవు. ఆలయంలో అర్జిత సేవల రూపంలో, హుండీ రూపంలో గానీ ఎక్కడా ఒక్కరూపాయి కూడా తీసుకోరు. పేదా ధనిక బేధం లేకుండా అందరూ భగవంతుని దర్శించుకొని వెళ్ళటమే మాకు సంతోషం అంటారు నిర్వాహకులు.
ఈ ఆలయ నిర్మాత శ్రీ వెంకటరమణ శాస్త్రిగారి దాదాపు లక్షా ముప్పైరెండువేల మంది శిష్యులున్నారట. వారే నెలకు పదిమంది చొప్పున దేవాలయ బాధ్యతలను నిర్వహిస్తారు. ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేశారు. ఈ క్షేత్రంలో అన్ని సామాజిక వర్గాల మహిళలకు వేదం నేర్పుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడేనికి వెళ్ళి అక్కడ నుండి వీరపాలెంలో ఉన్న ఈ పంచాయతన క్షేత్రానికి చేరుకోవచ్చు.