చుట్టూ పచ్చటి ప్రకృతి శోభతో, గోదావరీ తీరంలోఉన్న పెనుగొండ ఆధ్యాత్మికంగానూ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన మహిషాసురమర్దినీ సమేత నగరేశ్వరస్వామి ఆలయం విశిష్టమైంది. ఈ క్షేత్రంలోనే వెలసిన ఆర్యవైశ్యుల ఆరాధ్య దేవతమవాసవీ కన్యకాపరమేశ్వరీ అమ్మవారు, భక్తజనకోటి కొంగుబంగారంగా విశేష పూజలందుకుంటోంది. అమ్మవారి జన్మస్థలం, ఆత్మార్పణ తర్వాత కులదైవంగా వెలసిన ప్రాంతం ఇదే కావడంతో పెనుగొండ ఆర్యవైశ్యులకు దర్శనీయ స్థలంగా మారింది.
సుమారు నాలుగు వేల సంవత్సరాల కిందటి మాట...నగరేశ్వరస్వామి, మహిషాసురమర్దిని అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిశారు. ఈ క్షేత్రానికి దగ్గర్లో నివాసముంటున్న కుసుమశ్రేష్ఠి, కుసుమాంబ దంపతులకు వాసవీ మాత జన్మిస్తుంది. ఈమె బాల్యం నుంచే శివభక్తురాలు. రాజమహేంద్రవరాన్ని పాలించే విష్ణువర్థన మహారాజు పెనుగొండ క్షేత్రాన్ని దర్శించానికి వచ్చినప్పుడు కుసుమశ్రేష్ఠి ఇంటిలో ఆతిథ్యం తీసుకున్నాడు. ఈ సందర్భంలో వాసవి అందాన్ని చూసి ముగ్ధుడై, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాజు ఆజ్ఞను ధిక్కరించలేని కుసుమశ్రేష్ఠి ఏం చెయ్యాలో పాలుపోక తమ కులపెద్దలకు జరిగింది విన్నవిస్తాడు. వారిలో కొంతమంది ఈ కళ్యాణానికి అంగీకరించగా, మరికొందరు క్షత్రియులతో వియ్యం వద్దంటూ నిరాకరించారు. అనంతరం వాసవిని తన నిర్ణయం అడగగా, తాను పార్వతీదేవి అంశతో జన్మించాననీ ఆ పరమశివుడిని తప్ప అన్యులను వివాహం చేసుకోననీ చెబుతుంది.
కానీ విష్ణు వర్ధనుడి ఆగ్రహంతో ఆమెను బంధించడానికి వస్తాడు. దీంతో వాసవి ఆత్మార్పణకు సిద్ధమవుతుంది. ఆమెతోపాటు వాసవికి మద్దతుగా నిలిచిన వారుకూడా ఆత్మత్యాగం చేసుకోవాలనుకుంటారు. బ్రహ్మకుండం అనే ప్రాంతంలో మాఘ శుద్ధ విదియనాడు 102 అగ్నిగుండాలను ఏర్పాటుచేసుకుని వాసవితో సహా అందరూ వాటిలో దూకి శివుడిలో ఐక్యమవుతారు. తరువాత నగరేశ్వరస్వామి ఆలయంలో వాసవీ అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు ఇక్కడి భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో వాసవీ అమ్మవారు ఆత్మార్పణ చేసిన దృశ్యాలను చూపుతూ నిర్మించిన గాలిగోపుర మండపాన్ని చూడవచ్చు. ఏడంతస్తులుగా నిర్మించిన ఈ గాలిగోపురానికి ప్రతి అంతస్తులో అమ్మవారి స్థలపురాణాన్ని తెలిపే శిల్పాలు కనువిందు చేస్తాయి. వెంకటేశ్వరస్వామి, నవగ్రహాలు, గణపతి, కాలభైరవులతో నాలుగు ఉపాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి క్షేత్రపాలకుడు జనార్దనస్వామి. కంచికామకోటి పీఠాధిపతితో శివపంచాయత క్షేత్రంగా పునఃప్రతిష్ఠ చేయించిన ఈ ఆలయంలో 2012 నుంచీ నిత్యాన్నదాన సేవ చేస్తున్నారు.
అమ్మవారు ఆత్మార్పణ చేసిన మాఘ శుద్ధ విదియ రోజున (జనవరి) ఆ తల్లికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజు వేకువజాము నుంచే కన్యకాపరమేశ్వరి మూలవిరాట్‌కు పంచామృత స్నానాలూ, విశేష అభిషేకాలూ ప్రారంభమవుతాయి. శోభాయమానంగా అలంకరించిన ఆ తల్లి విగ్రహాన్ని మంగళవాయిద్యాలతో ఊరేగిస్తారు. అనంతరం 102 హోమగుండాలను ఏర్పాటు చేసి, పూర్ణహోమాన్ని నిర్వహిస్తారు. ఏడాదిలో వాసవీమాత జన్మదినం, ఆత్మార్పణ చేసుకున్న రెండు రోజులు మాత్రమే మూలవిరాట్‌కు అభిషేకాలు చేస్తారు. దీంతోపాటు వైశాఖమాసంలో శుద్ధ షష్ఠి నుంచి దశమి వరకూ అమ్మవారి జయంతి జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా ఏడు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.
వశిష్ఠ గోదావరికి 15కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి రైలూ, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. పాలకొల్లు నుంచి 12 కిలోమీటర్లు, తణుకు నుంచి 13 కిలోమీటర్లూ ప్రయాణించి వాసవీ అమ్మవారిని దర్శించుకోవచ్చు.దగ్గరలో లోని రైల్వే స్టేషన్లు తణుకు, పాలకొల్లు.