తారకాసుర సంహారం తర్వాత శివపార్వతులు తన్మయ కేళీ విలాసంలో ఉన్న సమయంలో ఓ ముని దంపతులు శివసాయుజ్యం కోరాలన్న సంకల్పంతో అక్కడకు వస్తారు. తమ రాసలీలలను చూడటాన్ని గమనించిన శివుడు ఆగ్రహించి, వాళ్లను బాలబాలికలుగా కమ్మనీ, అలా బ్రహ్మచర్యాన్ని పాటించి, తర్వాత శివసాయుజ్యాన్ని పొందమనీ ఆజ్ఞాపించాడట.
శాపగ్రస్తులయిన ఆ ముని దంపతులలో పురుషుడైన పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణ ఇంట ‘ఒడయనంబి’గానూ, ఆయన భార్య పుష్పసుందరి మార్తాండపురంలో కళావంతుల ఇంట ‘పరమనాచి’గాను జన్మించారు. ఒడయనంబి తన శాపవిమోచన కోసం తీర్థయాత్రలు చేస్తూ మార్తాండపురం చేరాడు. నిత్యం నాట్యకళా ప్రదర్శనలు చేస్తూ పరమనాచి పరిచయం అయింది. శివసంకల్ప బలంతో ఒక్కటైన ఆ ఇద్దరూ పరస్పర ప్రేమానురాగాలతో ఈశ్వర సేవలో నిమగ్నమయ్యారు. ఒక మహాశివరాత్రి పండుగరోజు రాత్రి ఆ దంపతులు సుఖనిద్రకు లోనయ్యారు. పూజా కార్యక్రమానికి సమయం మించిపోవడంతో భక్తుడైన ఒడయనంబి పక్కనే నిద్రిస్తున్న పరమనాచి స్తనాగ్రాన్నే శివలింగంగా భావించి, పన్నీటితో అభిషేకించి, గంధం అద్ది, పూలమాలలు చుట్టి భక్తి ప్రవత్తులతో కొలిచాడట. స్త్రీ పక్కన ఉండీ శివభక్తిని మరువని అతని ఏకాగ్రతకు మెచ్చిన పరమశివుడు వాళ్లిద్దరికీ శివ సాయుజ్యాన్ని ప్రసాదించాడట.
రావణాసురుడ్ని సంహరించిన రాముడు బ్రహ్మ హత్యా మహాపాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచారామాలలో శివారాధన జరిపి, దండకారణ్య మార్గంలో వెళ్తూ మార్తాండపురం (ఆచంట) వచ్చాడట. అక్కడ, ఆకులూ అలముల మధ్య స్వయంభూగా వెలసిన శివలింగం ఆయనకు తారసపడింది. ఆ లింగాన్ని అభిషేకించగానే ఆయనకు పాప విమోచనమైనట్టు ఆకాశవాణి పలికిందని పురాణకథ. రామచంద్రుడు అభిషేకించినందువల్ల ఈ స్వామిని రామేశ్వరుడిగా పిలుస్తారు.
గౌతమీ, వశిష్ఠ గోదావరి పాయల మధ్య... వశిష్ఠ గోదావరి నదికి పడమటి ఒడ్డున ఆచంట క్షేత్రం కొలువైంది. ఈ క్షేత్ర మహిమల గురించి హరవిలాసం, శివవాజ్ఞ్మయం, కన్నడ వాజ్ఞ్మయాల్లో ప్రస్తావన ఉంది. క్రీ.శ 300 సంవత్సరంలో నిర్మించిన ఈ దేవాలయం దక్షిణభారతావనిలో ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఇక్కడి ఆలయాన్ని అన్నమాచార్యుల అయిదోతరంవారు నిర్మించినట్లు చరిత్ర. అన్నమాచార్యుల వంశస్థులూ, అప్పటి రాజులూ, జమీందార్లూ సుమారు 2 వేల ఎకరాల భూమిని స్వామిపేరిట ఇచ్చారట. 1969 నుంచి దేవాదాయ, ధర్మాదాయశాఖ పరిధిలోకి వచ్చిన ఈ ఆలయానికి ప్రస్తుతం సుమారు 134 ఎకరాల పంటభూమి మాత్రమే మిగిలింది. ఆలయానికి ఏడాదికి దాదాపు రూ.30 లక్షలు ఆదాయం వస్తుంది.
ఈ క్షేత్ర ఆవరణలో 30 ఉపాలయాలు ఉన్నాయి. అందులో సప్తమాతృకలు, విఘ్నేశ్వరుడు, బ్రహ్మదేవుడు, వీరభద్రస్వామి, వాయుదేవుడు, కమఠేశ్వరుడు, కనకదుర్గమ్మ తదితరులు కొలువై ఉన్నారు. కార్తీక పౌర్ణమినాడు భక్తులు తెచ్చిన నెయ్యితో క్షేత్రంలో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. అది మహాశివరాత్రి వరకూ అంటే మూడు నెలల పాటు వెలుగుతూనే ఉంటుంది. దక్షిణ కాశీలో తప్ప మరెక్కడా ఇటువంటి జ్యోతి కనిపించదు. దసరా సమయంలో పార్వతీదేవికి 11 రోజులూ ప్రత్యేక అలంకరణలతో పూజలు నిర్వహిస్తారు.
మిగిలిన దేవాలయాకు భిన్నంగా, ఇక్కడ ఏడాదిలో ఒకరోజు (శివరాత్రి 5వ రోజు పుష్పోత్సవం సందర్భంగా) మాత్రమే భక్తులకు తీర్థం ఇస్తారు. స్వయంభూగా వెలసిన శివలింగం ఉత్తర భాగంలో నిత్యం జలం ఉద్భవిస్తూనే ఉంటుంది. స్త్రీ స్తనాగ్రాన లింగోద్భవ కాలంలో వెలసినందువల్ల మహిళలపై స్వామివారి కృప అపారంగా ఉంటుందన్నది పండితుల ఉవాచ. స్త్రీ వ్యాధులు, వివాహాలు, దాంపత్య సమస్యలు, సంతానలేమి వంటివాటితో బాధపడిన మహిళలు ఎంతో మంది స్వామికి అభిషేకం నిర్వహించి ఫలితాలు పొందారని ఆలయ అర్చకులు చెబుతారు. శివరాత్రి సమయంలో ఐదురోజుల పాటు జరిగే వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని రోజులూ గ్రామస్థులే అన్నసంతర్పణ ఏర్పాటు చేస్తారు.
ఈ క్షేత్రాన్ని దర్శించాలంటే రైలు మార్గంలో పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, రాజమండ్రికి గాని వెళ్లి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆచంటకు వెళ్లవచ్చు. బస్సు, ప్రైవేట్ వాహనాల సౌకర్యమూ ఉంది.