సామాన్యంగా శివుడు లింగాకారంలో ఉంటాడు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం యనమదుర్రు గ్రామంలోని శివాలయంలో శివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడి విశేషం.
శివుని జటాజూటం నేలకు తగులుతూ ఉంటుంది. అమ్మవారు స్వామివారితో పాటు ఒకే పీఠంపై కొలువై ఉన్నారు. శివుడు శక్తితో ఒకే పీఠంపై ఉండటం వలన శివుణ్ణి శక్తీశ్వరుడు అని పిలుస్తారు. పార్వతీమాత ఒడిలో చిన్నపిల్లవాడిగా ఉన్న కుమారస్వామిని
దర్శించవచ్చు.
పూర్వం రుషులు లోకకంటకుడైన శంబరాసురుణ్ణి వధించాలని యముణ్ణి కోరటంతో యముడు శంబరాసురుడితో యుద్దం చేసి ఓడిపోతాడు. శంబరాసురుడు గొప్ప శివభక్తుడు. శంబరాసురుణ్ణి వధించడం కోసం యముడు ఇక్కడ శివుడి కోసం తపస్సు చేస్తాడు.
అదే సమయంలో శివుడు కైలాసంలో తలక్రిందులుగా తపస్సు చేస్తుంటాడు. యముని తపస్సు శివునిదాకా చేరదు. అమ్మవారు గమనించి శివునికి తెలుపుతుంది. అమ్మవారు యమునికి శంబరాసురుని సంహరించే శక్తి ప్రసాదిస్తూ ఈ ప్రదేశం యముని పేరు మీదగా ప్రసిద్ధి చెందుతున్నదని వరమిస్తుంది.
అమ్మవారు యముణ్ణి ఇంకో వరం కోరుకొమ్మని అడగగా యముడు రాక్షసులు ఈ ప్రదేశానికి రాకుండా మరియు శివుడు అప్పుడు ఏలా ఉన్నారో అలాగే ఈ ప్రదేశంలో ఆవిర్భవించాలని కోరతాడు. యముని కోరిక మన్నించి శివుడు, అమ్మవారు శిలారూపంలో అలాగే వెలుస్తారు.
యముడు తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి యముని పేరుమీద యనమదుర్రుగా ఆ గ్రామం పేరుపొందినదని అంటారు. ఇక్కడి త్రవ్వకాలలో ఈ విగ్రహాలు ఏకపీఠంపై బయటపడగా వాటిని అలాగే గుడిలో ప్రతిష్టించారు.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 5 కి.మీటర్ల దూరంలో ఉన్న యమనదుర్రు గ్రామానికి భీమవరం నుండి బస్సులలో వెళ్ళవచ్చు. రాయలసీమవారు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు జిల్లాలవారు భీమవరానికి విజయవాడ నుండి బస్సు మరియు రైళ్లలో ప్రయాణించి చేరుకోవచ్చు. పంచారామ క్షేత్రమైన సోమారామం, మరియు మావుళ్ళమ్మ గుడి ఇక్కడికి దగ్గరలోనే కలవు.