header

Sri Satyanarayana Swamy, Rangapuram

శ్రీ సత్యనారాయణ స్వామి, రంగాపురం/Sri Satyanarayana Swamy, Rangapuram
పశ్చిమగోదావరి జిల్లా రంగాపురంలో వెలసిన శ్రీసత్యనారాయణ స్వామిని కొలిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.ఇక్కడ సంతానం లేని జంటలకు ఇచ్చే గరుడ ప్రసాదం మరింత ప్రసిద్ధం.
ఆరు దశాబ్దాలకు పూర్వం ఈ ప్రాంతంలో పంటలు పండక పనులు సాగక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉండేవి. ఈ సమయంలో రంగాపురం గ్రామంలోని కామేశ్వరమ్మ అనే భక్తురాలు ఈ పరిస్థితుల నుంచి తమను రక్షించాలంటూ నిత్యం సత్యనారాయణస్వామిని ప్రార్థించేది. అలాంటి భక్తుల విన్నపాలను విన్న స్వామి ఆ కరవును తొలగించాడట.
తర్వాత కొంత కాలానికి సత్యనారాయణ స్వామి ఆ భక్తురాలిని ఆవహించి, తాను గ్రామంలో ఓ చోట భూగర్భంలో సాలగ్రామ రూపంలో ఉన్నానని అక్కడ ఆలయ నిర్మాణం చేపట్టమనీ ఆజ్ఞాపించాడట. దీంతో 1956లో సత్యదేవుని సాలగ్రామం ఉన్నదిగా చెప్పిన ప్రదేశంలో శేషపాన్పును ప్రతిష్ఠించి పూజించ సాగారు. తర్వాత కామేశ్వరమ్మ, ఆమె సోదరులు కామేశ్వరరావు, గౌరీశంకరదత్తుల సహాయంతో పలు గ్రామాల్లోని భక్తులను కూడగట్టి, త్రిదండి రామానుజ పెద్ద జీయరుస్వామి చేతుల మీదుగా 1964లో సత్యదేవుని ఆలయన్ని నిర్మింపజేశారు.
అప్పుడే భూనీలా సహిత శ్రీసత్యనారాయణ స్వామిని, రాజ్యలక్ష్మి అమ్మవారిని, గోదాదేవిని, ఆళ్వారులను ప్రతిష్ఠించారు. నాటి నుంచి క్షేత్ర పరిసర గ్రామాలన్నీ సుభిక్షమయ్యాయనిచెబుతారు. అక్కడ సమృద్ధిగా పంటలు పండుతూ కరవులు రాకుండా ఉన్నాయంటే స్వామే కారణమని భక్తులు బాగా విశ్వసిస్తారు. వారి విశ్వాసాన్ని ఓ సంఘటన మరింత బలపరిచిందని చెబుతారు. 2006లో ఆలయ పునర్నిర్మాణం కోసం లోపలి విగ్రహాలను తీసి పక్కన పెట్టారు. దీంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఆ ప్రాంతం అతలాకుతలమైపోయిందట. విగ్రహాల పునఃప్రతిష్ఠ తర్వాత మళ్లీ ఆ ప్రాంతం సుభిక్షంగా మారిందని చెబుతారు. ఇలా పునర్నిర్మాణ సమయంలోనే చిన్న జీయరు స్వామి... వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లను ప్రతిష్ఠ చేశారు.
సంతాన ప్రసాదం...
స్వామి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ దశమి నుంచి పదిరోజుల పాటు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ద్వాదశి, విదియల్లో జరిగే ధ్వజారోహణ, అవరోహణ కార్యాక్రమాల్లో భక్తులకు అందించే గరుడ ప్రసాదానికి విశిష్టత ఉంది. ఆ రోజు బియ్యం, పెసరపప్పు, నెయ్యి తదితరాలతో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పిల్లలు లేని జంటలకు అందిస్తారు. ఈ ప్రసాదం తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ క్షేత్రంలో గోధుమ రవ్వ, నెయ్యితో తయారు చేసే ప్రసాదం అన్నవరం తరహాలోనే ప్రత్యేక రుచిని కలిగి ఉంటుంది.
రామక్రతు స్తూపం
ప్రపంచ శాంతిని కాంక్షించే రామక్రతు స్తూపం, యజ్ఞ స్తూపాలు రెండూ ఒకే చోట ఉన్న క్షేత్రాలు భారతదేశంలో మూడు మాత్రమే ఉన్నాయి. అందులో రంగాపురం ఒకటికాగా, మిగతా రెండు తిరుమల తిరుపతి, భద్రాచలం. ఆలయ ప్రాంగణంలో ప్రపంచ శాంతి కోసం స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాన్ని చేసి యజ్ఞ భగవానుణ్ణి 1977లో ప్రతిష్ఠించారు. 2002లో అప్పటి మంత్రి కోటగిరి విద్యాధరరావు సహకారంతో ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానానికి సత్యదేవుని ఆలయాన్ని దత్తత చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు ఆంధ్రా తెలంగాణాల్లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి భక్తులు వచ్చి వ్రతాలు ఆచరిస్తుంటారు. కార్తిక, ధనుర్మాసాల్లో ఇక్కడ వ్రతం ఆచరిస్తే సర్వకార్యాలూ సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?.........
రంగాపురం క్షేత్ర ప్రయాణం పచ్చని తోటల మధ్యగా సాగుతూ హాయిగొలుపుతుంది. ద్వారకా తిరుమల నుంచి, కామవరపుకోట, గుంటుపల్లి మీదుగా వచ్చే వారికైతే... ఒక వైపు ఒంపులు తిరుగుతూ సాగే మహా నాగపర్వతం, మరోవైపు పామాయిల్‌, కోకో, కొబ్బరి తోటల నడుమగా సాగే ప్రయాణం మరపురాని అనుభూతినిస్తుంది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న కామవరపుకోట వీరభద్రేశ్వరస్వామి ఆలయం, గుంటుపల్లి బౌద్ధారామాలను దర్శించవచ్చు. రంగాపురానికి ఏలూరు నుంచి ప్రతి గంటకూ ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఏలూరు నుంచి ఇక్కడికి 32 కి.మీ. అదే ద్వారకా తిరుమల నుంచి అయితే 27 కి.మీ., జంగారెడ్డిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి 34 కి.మీ. దూరం ఉంటుంది.