సింహరూపుడైన శ్రీహరి హిరణ్యకశిపుని సంహరించిన చోటు ఇదేనంటారు. ఆ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. అహోబిలం పరిసర ప్రాంతాలలోని ముప్పైఅయిదు గ్రామాలలో 45 రోజులపాటు జరిగే ఉత్సవాలు ఇవి. 35 గ్రామాలలో ఇళ్లన్నీ బంధు మిత్రులతో కళకళలాడుతూ ఉంటాయి.
ఉత్సవాల చరిత్ర : పరి అంటే గుర్రం. స్వామివారు క్రూరమృగాలను వేటాడటంకోసం గుర్రంపై వెళ్ళటాన్నే పారువేటోత్సం అంటారు. గ్రామ గ్రామానికి నన్ను తీసుకువెళ్ళండి. నా పాదపద్మాలను ఆశ్రయించే అవకాశాన్ని భక్తులకు ఇవ్వండి అని స్వామివారు ప్రధమ పీఠాధిపతికి చెప్పినట్లు అహోబిల క్షేత్రమహత్యంలో పేర్కొన్నారు. .
45 రోజులపాటు పార్వేటోత్సవాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. ఆ తరువాత బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గరుడోత్సవంతో వేడుకలతో వూర్తవుతాయి. .
హిరణ్యకశిపుని సంహరించిన అనంతరం ఆవేశం తగ్గని నరహరి నల్లమల అడవులలో సంచరిస్తాడు. ఆ సమయంలో కనిపించిన చెంచులక్ష్మిని చూసి శాంతించి ఆమెను వివాహమాడాలని అనుకుంటాడు. చెంచులు తమ ఆడపడుచును ఇవ్వటానికి ఒక షరతు పెడతారు. పెళ్లికూతురుకి ఓలి(కట్నం) ఇవ్వాలని, ఏమిస్తావని అడుగుతారు. పారువేటేత్సవాలలో భక్తులు సమర్పించే ధాన్యాన్ని ఇస్తాను అని స్వామివారు మాట ఇస్తారు. .
తన వివాహమహోత్సవానికి ఆహ్వానించేందుకు అహోబిలం పరిసర ప్రాంతాలోని 35 గ్రామాలలో సంచరిస్తాడు నరహరి. .
ఉత్సవాల ప్రత్యేకతలు : పారువేటోత్సవాలు సందర్భంగా బొమ్మల దుకాణాలు, చిరుతిళ్ళ అంగళ్ళు ఇంకా వివిధ రకాల అంగళ్ళను వ్యాపారస్తులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క ఆళ్ళగడ్డలోని సుమారు వేయి దుకాణాలు ఏర్పాటుచేస్తారు. .
ఆరువందల ఏళ్లుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. పారు వేటోత్సవాలు సందర్భంగా స్వామి పల్లకి ఎగువ అహోబిలం నుంచి కిందికి దిగుతుంది. బాచేపల్లిలో ప్రారంభమై రుద్రవరం గ్రామానికి చేరడంతో ఉత్సవతంతు ముగుస్తుంది. .
ప్రయాణ సౌకర్యాలు : అహోబిలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజక వర్గంలోని అహోబిలంలో ఉన్నది. అహోబిలం నంద్యాల నుండి అరవై కిలోమీటర్లు, కర్నూలు నుండి సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది.