కర్నూలు జిల్లాలోని హోలగుండ మండలంలో దేవరగట్టు గ్రామంలో వెలసిన మాలమల్లేశ్వరస్వామికి దసరా పండగ సందర్భంగా వైభవంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. దసరా పండుగ సందర్భంగా దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నేరేని తండా, కొత్తపేట మరియు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు వస్తారు.
దేవరగట్టులోఆరురోజుల పాటు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. చివరి రోజు స్వామివారిని దక్కించుకునేందుకు ఇరు గ్రామాల ప్రజలు సాంప్రదాయం పేరుతో కర్రయుద్ధానికి దిగుతారు. ఒకరిని ఒకరు కర్రలతో కొట్టుకొని గాయాల పాలవుతారు
పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అవి ఫలితాన్ని ఇవ్వటం లేదు. ఇనుప చువ్వలున్న కర్రలతో భక్తులు కొట్టుకుంటారు. గాయపడ్డవారికి మెడికల్ క్యాంపులో చికిత్స అందిస్తారు. ఈ ఉత్సవంలో చుట్టు పక్కల గ్రామాలు ప్రజలు పాల్గొంటారు.
కర్నూలు జిల్లాలోని హోలగుండ మండలంలో దేవరగట్టు గ్రామం ఉంది. ఈ గ్రామంలోని కొండపై 800 అడుగుల ఎత్తులో మాలమల్లేశ్వర స్వామి దేవాలయం ఉంది.
విజయదశమి(దసరా) పండుగ నాడు అర్ధరాత్రి పూజారులు మాలమల్లేశ్వరస్వామికి, పార్వతీ దేవికి పూజలు చేస్తారు. తరువాత విగ్రహాలను కొండకిందకు తీసుకువస్తారు. అశ్వవాహనంపై ఆ విగ్రహాలను ఉంచుతారు. కాగడాలతో, పొడవాటి కర్రలతో, మేళతాళాలతో స్వామి వారిని అనుసరిస్తారు. ఈ సందర్భంగా దీపావళి మందుగుండు సామానును పెద్దఎత్తున కాలుస్తారు.
దేవతా విగ్రహాలను వేకువజామున ముల్పండ అనే ప్రదేశానికి తెచ్చి పూజలు చేసి తరువాత పడాలకట్ట అనే ప్రదేశానికి చేరుస్తారు. అక్కడ ఆలయ పూజారి గుప్పెడు రక్తతర్పణం సమర్పించటం కోసం తన తొడను కోసుకుని గుప్పెడు రక్తాన్ని అర్పించిన తరువాత ఈ దేవాలయం గురించి మరియు రాబోయే కాలంలో జరిగేవాటిని గురించి జోస్యం చెపుతాడు.
తరువాత స్వామివారిని వాహన మీదనుంచి సింహాసనం కట్టమీద కూర్చుండబెట్టి పూజలు చేయటంతో ఈ వింత జాతర ముగుస్తుంది.