ప్రతి సంవత్సరం రాయలసీమ జిల్లా వారందరూ సుమారు మే నెలలో గంగమ్మ తల్లి జాతరను 8 రోజుల పాటు (తాతగట్టు గంగమ్మ జాతరగా కూడా పిలుస్తారు.) అత్యంత వైభవంగా జరుపుకొంటారు. మే నెల మొదటి మంగళవారం ప్రారంభమైన రెండవ మంగళవారంతో జాతర ముగుస్తుంది. మొదటి మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర ప్రారంభమౌతుంది.
జాతర చాటింపు జరిగిన సమయం నుండి పొలిమేర దాటకూడదని జాతర నియమం. జాతర సందర్భంగా తిరుపతి వాసులు తమ బంధు మిత్రులను ఆహ్వానించి పండుగ జరుపుకుంటారు.
తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు, జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మ తల్లిని స్వయాన శ్రీ వేంకటేశ్వరుని చెల్లెగా భావిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారికి పట్టు చీర సమర్పించడం ఆనవాయితి.ఆ జాతరకు తమిళనాడు, కర్ణాటక మరయు ఒరిస్సా నుండి కూడా భక్తులు వస్తారు.
స్థలపురాణం : తిరుపతి పొలిమేరల్లో ఏడుగురు గ్రామదేవతలు ఉన్నారు. వారిలో గంగమ్మ జాతరే ఘనంగా జరుపుతారు. గంగమ్మ తల్లికి భక్తులు పసుపు, కుంకుమ, చీరెలు, పొంగళ్ళు సమర్పించుకొంటారు.
చినగంగమ్మ పెళ్ళికాని ఓ యువతి. అప్పట్లో తిరుపతిని పాలించే పాలెగాడు గంగమ్మను చూసి మోహించి బలవంతం చేయబోతాడు. అప్పుడు గంగమ్మ ఊగ్రరూపంతో పాలెగాడిని సంహరించబోగా పాలెగాడు భయపడి పారిపోయి దాక్కుంటాడు.
గంగమ్మ ఏడురోజుల పాటు పాలెగాడిని. వివిధ వేషాలను (బైరాగి, బండ, తోటి, దొర మరియు మాతంగి) ధరించి వెతుకుతుంది. కాని పాలెగాడు దొరకడు. చివరి రోజు గంగమ్మ దొర వేషం వేసి వెతుకుతుంది. తమ దొర వచ్చాడని పాలెగాడు బయటకు వస్తాడు. అప్పుడు గంగమ్మ తల్లి విశ్వరూపంతో పాలెగాడిని సంహరిస్తుంది.
మరుసటి రోజున మాతంగి వేషంతో పాలెగాడి భార్యను ఓదారుస్తుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తిస్వరూపిణిగా భావించి జాతర చేస్తారు. తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తన జలక్రీడా విలాసంలో గంగమ్మ తల్లిని గురించి కీర్తించారు.
ఎలా వెళ్లాలి ? తిరుపతి పట్టణానికి తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రధాన పట్టణాల నుండి రోడ్డు, రైలు మార్గాలున్నాయి.