తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోటలో వెలసిన నూకాలమ్మ అమ్మవారి జాతరంటే చుట్టు పక్కల వూళ్లకే కాదు ఆ జిల్లాకే పెద్ద పండగ. ఈ జాతరను కనీసం 500 సంవత్సరాలకు పూర్వం నుంచీ నిర్వహిస్తున్నారు. 1956లో ఆలయం దేవాదాయధర్మాదాయ శాఖ అధీనంలోకి వెళ్లాక ఆ శాఖ ఆధ్వర్యంలోనే జాతర నిర్వహిస్తున్నారు.
మశూచీ, అమ్మవారులాంటి వ్యాధులు వూరిని చేరకుండా ఉండాలనీ, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలనీ అమ్మవారిని వేడుకోవడం జాతర ప్రధానోద్దేశం. ఫాల్గుణ మాసం బహుళ చతుర్దశి (ఈ ఏడు మార్చి 27న) రోజున రాత్రి జాగరణతో జాతర ప్రారంభమవుతుంది. జాతరకు 15 రోజుల ముందే గరగలతో వూరేగింపు జరుగుతుంది. జాతరనాటి రాత్రి బాణసంచా పోటీలు నిర్వహిస్తారు.
పులి వేషాలూ, గరగల నృత్యాలూ, మేళతాళాలతో జరిగే అమ్మవారి ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల మంది భక్తులు తరలివస్తారు. మొత్తం 41 రోజులు జరిగే ఈ జాతరకు ఏడు లక్షల మందిదాకా భక్తులు హాజరవుతారు. ఆది, మంగళ, గురువారాల్లో అధిక సంఖ్యలో జనం అమ్మవారిని దర్శించుకుంటారు. ఇక్కడి భక్తులు అమ్మవారికి అరిసెలు, పాయసం, బూరెలు, సున్నుండలతో పాటు, కోళ్లు, చీరలు, గాజులు సమర్పించుకుంటారు.
ఎలా వెళ్లాలి ...?
నూకాలమ్మను దర్శించుకోవాలంటే... రాజమహేంద్రవరం నుంచి రాజానగరం వయా కాకినాడ బస్సు ద్వారా పెద్దాపురం దర్గా సెంటర్‌లో దిగాలి. అదే రైలులో అయితే సామర్లకోటలో దిగి పెద్దాపురం చేరొచ్చు. పాతపెద్దాపురం రోడ్డు గుండా ప్రయాణిస్తే కాండ్రకోటకు సుమారు 8 కి.మీ. దూరం ఉంటుంది.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఆలయం తెరిచి ఉంటుంది.