header

Kolleti Peddintamma / కొల్లేటి పెద్దింటి అమ్మవారు

Kolleti Peddintamma / కొల్లేటి పెద్దింటి అమ్మవారు

కొల్లేటి పెద్దింటమ్మ అమ్మవారి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో పద్మాసన భంగిమలో ఉంటుంది.పెద్దింటి అమ్మవారు పార్వతీ దేవి ప్రతిరూపం. ఎన్నో మహిమలు గల అమ్మగా, పెద్దమ్మగా కొల్లేరు ప్రాంతంలోని వడ్డీ కులస్తుల కులదైవంగా పూజలందుకుంటుంది. అసోం, ఒడిశా, తెలుగు రాష్ట్రాలనుంచి వచ్చే భక్తులు అమ్మవారిని భక్తితో కొలుస్తారు. రాష్ట్రంలోని అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు నడిబొడ్డున కొలువై ఉన్నది పెద్దింటి అమ్మవారు.
11వ శతాబ్దం నుంచి వేంగి చాళుక్య రాజులు అమ్మవారిని కొలిచేవారని క్రీస్తు శకం 12-13వ శతాబ్ధంనాటి కమలాకరపుర వల్లభుల శాసనాల వలన తెలుస్తుంది. నేటి ఏలూరే ఆనాటి కమలాకరపురం. పద్మినీపురం (నేటి గణపవరం)కొలనువీడు (కొల్లేటికోట)గా చరిత్ర ఆధారాలు శాసనాల ద్వారా బయటపడ్డాయి. క్రీస్తు శకం 1076లో వీరవిజయాదిత్యుని మరణంతో వెంగి చాళుక్యరాజుల పాలన అంతరించింది. అనంతరం వేంగీశ్వర రాజు పార్వతీదేవిని పెద్దమ్మగా కొలిచాడని శానాల ద్వారా తెలుస్తుంది. కోట చుట్టూ 150 రాజహస్తాల వెడల్పు, 7 నిలువుల లోతు, 3 కోశాల చుట్టుకొలతలగల అద్భుత అగడ్త ఉండేదని చరిత్రకారులు రాశారు.
ప్రాచీన కాలంలో ఇక్కడ ఉన్న మేడలు, మిద్దెలు, దేవళాలు అంతరించాయి. కొల్లేటికోటలోని పెద్దింటి అమ్మవారి ఆలయం ఒక్కటి మాత్రం నేటికీ నిలిచి ఉన్నది.
కొల్లేటికోటపెద్దింటి అమ్మవారి దేవాలయం భక్తులు, దాతల, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దబడింది.
అమ్మవారి జాతర
ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి వరకు (మార్చి నెలలో) అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించబడతాయి.
అమ్మవారి జాతర సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం, హారతి వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా హరికథ, కూచిపూడి నృత్యం, కోలాటాలు, నాటకాలు, జానపద నృత్య ప్రదర్శనలు సీనీ భక్తిరంజని, మ్యాజిక్ షోలు నిర్వహించబడతాయి.
ఎలా వెళ్లాలి ?
రైలు మార్గం ద్వారా ఆకివీడు, కైకలూరు రైల్వే స్టేషన్లకు వెళ్లాలి. కైకలూరు నుండి బస్సుల ద్వారా ఆలపాడు వరకు, అక్కడనుండి ఆటోల ద్వారా పందిరిపల్లిగూడెం కర్రల వంతెనకు చేరుకోవచ్చు. అక్కడ నుండి లాంచీల ద్వారా కర్రల వంతెన దాటిన తరువాత దాతలు ఏర్పాటు చేసిన ఉచిత వాహనాలలో అమ్మవారి ఆలయానికి వెళ్లవచ్చు. ఆకివీడు రైల్వే స్టేషన్ నుండి ఆలపాడుకు, అక్కడనుండి కర్రల వంతెనకు చేరుకోవచ్చు. కర్రల వంతెన నుండి లాంచీల ద్వారా ప్రయాణించి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు.