గిరిజనుల ఆరాధ్యదైవమైన మోదకొండమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం మే నెలలో 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరలో గిరిజన సాంప్రదాయ నృత్యం ‘ధిమ్సా’ ఒక ప్రత్యేక ఆకర్షణ.
ఈ జాతరకు విశాఖ, గోదావరి జిల్లాల నుండి పెద్దసంఖ్యలో యాత్రికులు వస్తారు. ఈ జాతరకు సుమారు 8 లక్షల మంది భక్తులు వస్తారు. ఈ తల్లి ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్యదైవం.
స్థలపురాణం : ప్రధానంగా వినిపిస్తున్న కథనం ప్రకారం అమ్మవారి దేవాలయం ప్రస్తుతం సరిహద్దు గ్రామాలైన గాలిపాడు, కొత్తపాడు గ్రామాల దగ్గర దట్టమైన అడవిలో ఉండేదని చెబుతారు. ప్రతి సంవత్సరం ఆదివాసీల డప్పులతో నృత్యాలు చేసుకుంటూ వెళ్ళి అమ్మవారికి మొక్కు బడులు చెల్లించేవారు. ఒకసారి ఒక గిరిజనుడు చెంబును గుడిలో మరచిపోయాడట. చెంబు కోసం మరలా గుడికి వెళ్ళగా అమ్మవారు తన చెల్లెళ్ళు మరియు తమ్ముడు పోతురాజుతో కలసి భక్తులు సమర్పించిన ప్రసాదం ఆరగిస్తుందట. అది గిరిజనుడు చూడటంతో అమ్మ ఆగ్రహించి ఇక మీదట తన దగ్గరకు ఎవరూ రావద్దని ఈ చెంబు ఎక్కడపడితే అక్కడే తనకు గుడి కట్టించమని ఆ చెంబును గట్టిగా తన్నడంతో ఆ చెంబు ప్రస్తుతం అమ్మవారి పాదాలుగా పేరుపొందిన విశాఖపట్నం-పాడేరు దారిలో పడిందట. అప్పటి నుండి అక్కడే అమ్మవారికి పూజలు, జాతరలు చేస్తున్నారు.
ప్రతి సంవత్సరం 10 కిలోమీటర్లు నడచి వెళ్ళి అమ్మవారికి మ్రొక్కులు చెల్లించడం కష్టంగా ఉండటంతో, 1982లో తహసిల్ దారుగా వచ్చిన ధశరధశర్మ గ్రామస్తులతో చర్చించి భక్తుల సహకారంతో పాడేరులోనే అమ్మవారి గుడిని నిర్మింపచేసాడు. అప్పటినుండి ఇక్కడే పూజలు, జాతరలు చేస్తారు. భక్తుల సౌకర్యార్ధం వంటశాల మరియు మరుగుదొడ్లు నిర్మించారు.
విశాఖపట్నం నుండి పాడేరు ప్రయాణం ఘాట్‌రోడ్డు మీద పచ్చటి అడవులు, కాఫీతోటల గుండా చల్లటి వాతావరణంలో ప్రశాంతంగా సాగుతుంది. గరికబండ దగ్గర నుండి ఘాట్‌రోడ్ ప్రారంభమవుతుంది. మూడున్నర గంటలపాటు సాగే ఈ ప్రయాణంలో చుట్టు ప్రక్కల ఓక్ చెట్లు, మిరియాల తోటలు, కాఫీ తోటలు కనువిందు చేస్తాయి. పాడేరు ప్రశాంతమైన చిన్న గిరిజన గ్రామం. ఇక్కడ వాతావరణం వేసవిలో కూడా చల్లగా వుంటుంది.
ఎలా వెళ్ళాలి : విశాఖపట్నం నుండి పాడేరుకు సుమారు 114 కి.మీ. దూరం. ఆర్ టి సి బస్సులో వెళ్ళవచ్చు